home page

ఉత్తమ నగరంగా పుదుచ్చేరి ఆతర్వాతే వస్తా: అమిత్ షా

అరబిందో, భారతీయర్ ఆదర్శం

 | 
Amit shah

అరబిందో కు గుజరాత్ తో సంబంధం:అమిత్ షా

 

చెన్నై:  పుదుచ్చేరిని ఉత్తమంగా తీర్చిదిద్దిన తర్వాతే మళ్లీ రానున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు.

 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పుదుచ్చేరిలోని ఆలయ వీధిలోని మహాకవి భారతియార్‌ స్మారక నివాసానికి అమిత్‌షా వెళ్లారు. అక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అరబిందో ఆశ్రమంలో అరబిందో, మాతా మీరా సమాధులకు అమిత్‌షా నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం అరబిందో, మీరా గదులను తెరిచారు. శ్రీఅరబిందో సొసైటీ తరఫున పాండిచ్చేరి వర్సిటీలో జరిగిన అరబిందో 150వ జయంతి వేడుకల్లోనూ పాల్గొన్నారు. అరబిందో, భారతరాజ్యాంగం అనే పుస్తకాన్ని అమిత్‌షా ఆవిష్కరించగా వాటి ప్రతులను తమిళిసై, సీఎం రంగస్వామి స్వీకరించారు. కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ... అరబిందోకు, గుజరాత్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. తానూ గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. వర్సిటీలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కంబన్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రూ.204 కోట్ల పథక పనులను ప్రారంభించారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ... పుణ్యభూమియైన పుదుచ్చేరిని నమస్కరిస్తున్నానని తెలిపారు. భారతియార్‌, అరబిందోల కర్మభూమిగా పుదుచ్చేరి ఉందన్నారు. వీవీఎస్‌ అయ్యర్‌, భారతిదాసన్‌ల సేవలను కొనియాడారు. ప్రజాతీర్పుతో ఎన్నార్‌ కాంగ్రెస్‌, భాజపా కూటమి సర్కారు భేషుగ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో సౌరశక్తి ద్వారా 26 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రూ.150 కోట్ల వ్యయంతో పుదుచ్చేరిలో మురుగునీటి కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. రూ.16 కోట్ల వ్యయంతో బొటానికల్‌ పార్కు పునరుద్ధరణ, రూ.6 కోట్ల వ్యయంతో పర్యాటకాభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు.

'రాష్ట్ర హోదా దక్కుతుందన్న నమ్మకం ఉంది'

ముఖ్యమంత్రి రంగస్వామి మాట్లాడుతూ... పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌ సుదీర్ఘకాలంగా ఉందన్నారు. దానిని కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుచ్చేరికి అదనపు నిధులు అందించడానికి అమిత్‌షా చర్యలు చేపడతారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఇన్‌ఛార్జి లఫె్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ... పుదుచ్చేరిని అన్ని విధాల పురోభివృద్ధి సాధించిన ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. కేంద్ర మార్గదర్శకాలు మేరకు ఆదర్శవంతంగా పుదుచ్చేరి మారనుందని తెలిపారు. అమిత్‌షా రాకతో పుదుచ్చేరి అభివృద్ధి పరుగులు తీయనుందని పేర్కొన్నారు. అమిత్‌షా రాకను వ్యతిరేకించేవారు పుదుచ్చేరి అభివృద్ధికి వ్యతిరేకులని తెలిపారు.

విపక్షాల ఆందోళన

ఆందోళనలో నారాయణస్వామి, ఏవీ సుబ్రమణియన్‌ తదితరులు

పుదేచ్చేరిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. పెరియార్‌ విగ్రహం వద్ద పెరియార్‌ ద్రావిడర్‌ విడుదలై కళగం నిర్వాహకులు నల్లజెండాలు ప్రదర్శించి అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. సారం జీవానందం విగ్రహం ఎదుట ప్రతిపక్షాలు నల్లజెండాలతో నిరసన చేపట్టాయి. పుదుచ్చేరి రుణాలు మాఫీకి చర్యలు చేపట్టలేదని, పుదుచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఇందులో కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, పీసీసీ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణియన్‌, సీపీఐ పుదువై కార్యదర్శి సలీమ్‌, సీపీఎం పుదువై కార్యదర్శి రాజాంగం, వీసీకే ముఖ్యకార్యదర్శి దేవ పొళిలన్‌ తదితరులు పాల్గొన్నారు.