కుప్ప కూలిపోయిన ఇన్వెస్టర్లు
ఆరు ట్రేడింగ్ సెషన్స్ లో
18 లక్షల కోట్లు ఆవిరి
- గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో మదుపరులకు నష్టం
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపరులు ఏకంగా రూ.18 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అంతర్జాతీయంగా పలు సెంట్రల్ బ్యాంక్‌లు క్రమంగా వడ్డీరేట్లను పెంచుతుండటంతోపాటు విదేశీ నిధుల వెళ్లిపోతుండటంతో మదుపరుల్లో సెంటిమెంట్ నీరుగారింది. గడిచిన ఆరు సెషన్లలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 3,956.86 పాయింట్లు లేదా 7.15 శాతం తగ్గి ఏడాది కనిష్ఠ స్థాయి 50,921.22 వద్ద ముగిసింది. దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.18,17,747.13 కోట్లు కరిగిపోయి రూ.2,36,77,816.08 కోట్ల వద్ద ముగిసింది. గడిచిన కొన్ని సెషన్లలో అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ సిద్ధార్థ తెలిపారు.
ఆరో రోజు అదే తీరు
స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరోరోజు శుక్రవారం కూడా నష్టపోయాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారుకుంటున్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 135.37 పాయింట్లు తగ్గి 51,360.42 పాయింట్లకు జారుకున్నది. దీంతో సూచీ ఏడాది కనిష్ఠ స్థాయికి తగ్గినట్లు అయింది. అలాగే నిఫ్టీ 67.10 పాయింట్లు కోల్పోయి 15,293.50 వద్ద స్థిరపడింది. వారాంతం మార్కెట్లో టైటాన్ షేరు 6.06 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్‌లు కూడా నష్టపోయాయి. మరోవైపు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు మూడు శాతం వరకు బలపడ్డాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 2,943.02 పాయింట్లు(5.42 శాతం), నిఫ్టీ 908.30 పాయింట్లు(5.61 శాతం) నష్టపోయాయి.