home page

పవన్ మాటల పవర్ పెంచారు

నేరుగా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం గా మాటల‌ తూటాలు

 | 
Pawan
జనసేనాని పవన్ కల్యాణ్ తన గళం , స్వరం పెంచారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పై
నేరుగా దాడికి దిగుతున్నారు. ధైర్యంగానే   సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 మందిని గెలిపించి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ జగన్‌ను నిలదీస్తున్నారు.
బంపర్ మెజారిటీ ఇస్తే.. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. ప్రభుత్వం ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తోందని పవన్ కల్యాణ్‌ విమర్శించారు. అసలు కన్నీళ్లు తుడవలేని అధికారం దేనికని ప్రశ్నించారు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే ప్రజల పరిస్థితేంటని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై బీజేపీ పెద్దలకు చెబుతానని... వచ్చే ఎన్నికల్లో వైకాపా వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. తాను పుట్టిన కులాన్ని గౌరవిస్తా.. కానీ కులాన్నీ బేస్‌ చేసుకుని రాజకీయాలు చేస్తే ఎవరికీ మనుగడ ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ప్రభుత్వ విధానాలపైనే మాట్లాడతానని... ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీస్తానన్న పవన్.. ఏమీ చేయకుండా చప్పట్లు కొట్టాలంటే మేం మీ భజనపరులం కాదని స్పష్టం చేశారు.

తాను అధికారం లేకుండానే కన్నీళ్లు తుడిచేందుకు ముందుకొచ్చినవాడినని గుర్తు చేసిన పవన్ కల్యాణ్ తనకు అధికారం ఇస్తే కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవగలనని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో పరిస్థితులు మారాలని... యువత ఇతర ప్రాంతాలకు, గల్ఫ్‌ దేశాలకు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కలిగేలా చేయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఆలోచించేవాడిగా.. తనను ఆశీర్వదించాలని పవన్ కల్యాణ్ ప్రజలను కోరారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలన్నీ కలిసి రావాలంటున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. తనకు ఏ పార్టీ పైనా వ్యక్తిగత ఆపేక్ష లేదని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై పవన్‌ మండి పడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి వచ్చేవారితో పనిచేయాలని కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఓట్లు చీలిపోతే ప్రజలకు నష్టం జరుగుతుందని, పొత్తులపై చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Visit: mirrortoday.in for more news
Pawan kalyana