home page

పార్టీ మారం,మేమే నిజమైన శివసేన వారసులం: ఏక్నాధ్ షిండే

మాబలం 40 ఎమ్మెల్యేలు,10మంది స్వతంత్రులు

 | 
Shinde

తాము పార్టీ మారబోమని, కొత్త పార్టీ పెట్టబోమని శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. తామే బాలాసాహెబ్ ఠాక్రే అసలైన శివ సైనికులమని అన్నారు.

తనకు 40 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం 'టైమ్స్ నౌ' కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయం ప్రస్తావించినప్పుడు తన విధేయులతో సమావేశం నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

 "మేము ఎమ్మెల్యేలు లేకుండా చర్చలు జరుపుతాం. సమావేశం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. మేము బాలాసాహెబ్ ఠాక్రే శివ సైనికులం. ఆయనే మా దేవుడు. మేం ఆయన వల్లే ఇలా ఉన్నాం. మేం పార్టీ మారలేదు. కొత్త పార్టీ పెట్టడం లేదు '' అని షిండే అన్నారు. తమ తిరుగుబాటును ఒక జాతీయ పార్టీ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించిందని అన్నారు. వారికి తమకు అన్ని విధాల సహాయ సహకాలు అందిస్తారని గతంలో ఆయన వ్యాఖ్యానించారు.

కాగా గౌహతి హోటల్‌లో షిండే తన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియోను ఆయన కార్యాలయం తాజాగా విడుదల చేసింది. తామంతా ఐక్యంగా ఉన్నామని, విజయం తమదేనని అందులో పేర్కొన్నారు. " ఒక జాతీయ పార్టీ మనం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది '' అని ఆయన అందులో పేర్కొన్నారు.

ఏక్ నాథ్ షిండే ప్రస్తుతం గౌహతిలో 40 మంది సేన ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులతో క్యాంపు నిర్వహిస్తున్నారు. షిండే కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. తమ తరుఫున నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు అప్పగించారు. భిన్న సిద్ధాంతాల కారణంగా ఎన్సీపీ, భారత జాతీయ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉందని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెలిపారు. కాగా మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ గతంలో షిండే స్థానంలో శివసేన గ్రూప్ లీడర్‌గా అజయ్ చౌదరిని నియమించడాన్ని ఆమోదించారు.

కాగా ఏక్ నాథ్ షిండే క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 12 మంది పై అనర్హత వేటు వేయాలని శివసేన ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఏక్‌నాథ్ షిండే నుండి ఘాటైన స్పందన వచ్చింది. తన వర్గాన్ని నిజమైన శివసేనగా అభివర్ణిస్తూ.. తాము ఎవరి బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ''ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? మీ వ్యూహాలు ఏంటో, చట్టం ఏంటో మాకు తెలుసు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. విప్ పవర్ కేవలం అసెంబ్లీ వ్యవహారాలకు మాత్రమే వర్తిస్తుంది. సమావేశాలకు వర్తించదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది '' అంటూ ట్వీట్ చేశారు.