home page

ఇప్పుడు భాష పరంగా హిందీ ఏకీకరణ దిశగా

ఒకేదేశం ఒకే భాష - అదే బిజెపి అనుసరిస్తున్న విధానం

 | 
Kashi Vishwanath A symbol of Sanatan culture of India
పాలన తామనుకున్నట్టుగా సాగాలంటే ఏలినవారు ఎప్పుడూ ప్రజల్లో ఏదో ఒక అంశాంతిని రగిలించాలన్న ''సూత్రం'' బీజేపీకి బాగా వంటబట్టినట్టున్నది. ''మందిరాలు - మసీదులు'' మొదలు ''హిజాబ్‌ - హలాల్‌'' వరకూ అవి సృష్టించిన మంటలు చల్లారనే లేదు, ఇప్పుడు సరికొత్తగా భాషా విద్వేషాలను రెచ్చగొడతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌ మంత్రి సంజరు నిషాన్‌ ఏకంగా ''హిందీ మాట్లాడనివారు ఈ దేశం విడిచి వెళ్లిపోవాల''ని హెచ్చరిస్తున్నారు. గత కొంత కాలంగా సాగుతున్న ఈ భాషా వివాదాలకు ఇదొక పరాకాష్ట.
మొన్న అమిత్‌షా ''హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల ప్రజలందరికీ కమ్యూనికేషన్‌ భాషగా హిందీ తప్పనిసరి'' అని హుకూం జారీ చేసినంత పని చేశారు. నిరసనలు వెల్లువెత్తడంతో నాలిక కరుచుకున్నారు. ఇప్పుడీ సంజరు నిషానేమో మరో అడుగు ముందుకేసి ''హిందీ రానివారు అసలు భారతీయులే కాదు'' అంటున్నారు. వీరిద్దరికీ మధ్యలో ''హిందీని నిరాకరించడమంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే''నని ప్రవచించారు పద్మశ్రీ కంగనా రనౌత్‌. దీనికి ముందు బాలీవుడ్‌ నటుడు అజరుదేవగణ్‌ ప్రేలాపనలు ఉండనే ఉన్నాయి. ''పదవీ వ్యామోహాలు - కులమత భేదాలు, భాషా ద్వేషాలు - చెలరేగే నేడు'' అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు గానీ, ఇప్పటికీ అవి చల్లారకపోగా మరింతగా చెలరేగడం ఆందోళనకరం.
అనేకానేక భాషలు ఉనికిలో ఉన్న ఈ దేశంలో, రాజ్యాంగమే గుర్తించిన ఇరవైరెండు జాతీయ భాషలుండగా... హిందీ మాత్రమే దేశ భాష అంటే ఎలా చెల్లుతుందీ..?! ప్రజలు తమ భావ వ్యక్తీకరణకు ఏ భాష సౌకర్యంగా ఉంటే ఆ భాష వాడతారు. అది వారి ప్రాథమిక హక్కు. కాదనే హక్కు ఎవరికుంది? కాదంటే అది ఈ దేశ మౌలిక స్వభావానికే విరుద్ధం కదా! భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత. అందుకే ''సుసంపన్నమైన - బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం'' అంటూ పాఠశాల నుండే ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. ఇందుకు భిన్నంగా, దేశంలో కేవలం 20శాతం ప్రజలకు మాతృభాషగా ఉన్న హిందీని మిగిలిన 80శాతం ప్రజల మీద బలవంతంగా రుద్దాలనుకోవడం ఎలా సమంజసం?! ఇది భిన్న జాతులు, భిన్న భాషలు, విభిన్న సంస్కృతులతో వైవిధ్య భరితంగా విరాజిల్లుతున్న భారతీయతపై దాడిచేయడమే. దేశంలోని ఆయా జాతుల, భాషల ఉనికినీ, స్వయం ప్రతిపత్తినీ ధ్వంసం చేయడమే. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే. ఇదంతా ఏలినవారికి తెలియని సంగతి అనుకుంటే పొరపాటు. మరి తెలిసే చేస్తున్న ఈ కుతంత్రాలు ఏ ప్రయోజనాల కోసం?
దేశంలోని బహుళత్వాన్ని నిర్మూలించి ఏకీకృతం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో భాగమే ఇదంతా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ''హిందూ - హిందీ - హిందుస్తాన్‌'' అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ మిషన్‌ను వేగంగా అమలు చేసే ప్రయత్నంలో మరో అడుగే ఈ హిందీ రగడ. నిజానికి దేశంలో జాతీయ భాషలుగా ప్రకటించిన అన్ని భాషలకన్నా ఆలస్యంగా ఆవిర్భవించిన భాష హిందీ. ఇతర ప్రాచీన భాషలతో పోల్చితే వయస్సులో చిన్నది. అయితే, హిందీ కూడా అందమైన భాషేననడంలో ఎవరికీ ఏ సందేహమూ లేదు. హిందీని గౌరవించాలనడంలోనూ ఏ అభ్యంతరమూ లేదు. అభ్యంతరమల్లా భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన ఇరవైరెండు భాషలూ జాతీయ భాషలేనన్న నిజాన్ని వీరు గుర్తించకపోవడమే. సాంస్కృతిక ఆధిపత్యం కోసం హిందూత్వ ముద్రతో కూడిన జాతీయవాదాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతిపాదిస్తుండగా, దాని అమలుకు అధికార బీజేపీ ప్రయత్నాల్లో భాగమే ఈ హిందీ మంత్రం. వీరి నూతన విద్యా విధానంలోనూ ఇదే సూత్రం. అంతిమంగా ప్రాంతీయ భాషలన్నిటిపై హిందీకి ఆధిపత్యాన్ని కట్టబెట్టడం, తద్వారా దేశమంతటిపై ఉత్తరాది పెత్తనానికి పాదులు వేయడమే వీరి లక్ష్యం.
అమిత్‌షా నుంచి సంజరు నిషాన్‌ వరకూ అందరి వాఖ్యలూ జాగ్రత్తగా వరుస క్రమంలో పరిశీలిస్తే ఇది మరింత స్పష్టమవుతుంది. అమిత్‌షా ''హిందీ భారతీయ ఆత్మ'' అంటే, సంజరు నిషాన్‌ ''హిందూస్తాన్‌'' అంటే ''హిందీ ప్రదేశము'' అని సరికొత్త నిర్వచనం చెపుతున్నారు. దీని అర్థమేమిటి? ఈ దేశంలో తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, బెంగాలీ, మరాఠీ, ఒరియా వంటి అనేక భాషలు మాట్లాడే ప్రజలెవరూ భారతీయులు కాదన్నమాట! ఇది ఎక్కడ మొదలయ్యి ఎక్కడిదాకా వచ్చిందో చూడండి...! ముందు హిందువులు కానివారెవ్వరూ భారతీయులు కాదన్నారు. ఇప్పుడేమో హిందీ మాట్లాడనివారెవరూ భారతీయులుకాదంటున్నారు. ఉప రాష్ట్రపతిగారేమో మాతృభాషలో విద్యాబోధనంటారు. ఈ సంజయుడేమో హిందీలో మాట్లాడనివాడు దేశం వదలిపోమ్మంటాడు. బహుళనాలుకలున్న విషనాగులతో పారాహుషార్‌!