home page

ఇక పై బస్తా అంటే 30 కేజీలు!

కర్నాటక రైసు మిల్లర్లు సంఘం నిర్ణయం 

 | 
Gst bags

ఇక నుంచి 30 కేజీల చొప్పున బియ్యం బస్తాలు అమ్మాలని కర్నాటక రైసు మిల్లర్లు సంఘం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 కేజీల ప్యాకేజీ బస్తా లపై 5శాతం జీఎస్టీ పన్ను వర్తిస్తుందని, ఆపైన వర్తించదని తెలిపారు. జీఎస్టీ వల్ల ఒక్కో రైస్ బ్యాగ్ రూ.50-100 వరకు పెరుగుతుందని వినియోగదారుల పై పన్ను భారం వేయడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నామని రైస్ మిల్లర్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం 25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 5శాతం పన్ను విధించడం ప్రారంభించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి విరుగుడుగా కర్ణాటకలో రైస్ మిల్లర్లు వినూత్నమైన పద్ధతికి తెర లేపారు. ఇకపై తాము 25 కేజీల రైస్ బ్యాగ్ బదులు, 30 కేజీల రైస్ బ్యాగ్ లను మార్కెట్లో విక్రయిస్తామని, తద్వారా వినియోగదారుడికి జీఎస్టీ నుంచి ఉపశమనం కల్పిస్తామని రైస్ మిల్లర్లు ప్రకటించారు. జీఎస్టీకి విరుగుడు మంత్రం ఇదే అని వారంటున్నారు.

25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు రైస్‌ మిల్లు యజమానులు ఈ కొత్త పద్ధతి మొదలు పెట్టారు. 30 కేజీల రైస్ బ్యాగులను మార్కెట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు.
25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై (బియ్యం, పప్పులు మొదలైనవి) కేంద్రం 5శాతం పన్ను విధించడం ప్రారంభించింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, ఎలాంటి పన్నులు విధించొద్దని వాణిజ్య, వర్తక సంఘాలు కోరాయి. అయితే ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులపై భారం పడకుండా తూకంలో మార్పులు చేసి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ విక్రయించాలని రైస్ మిల్లు యజమానులు నిర్ణయించుకున్నారు.
బియ్యం, పప్పులు, పాల ఉత్పత్తులపై పన్నుల వల్ల మధ్య, పేద తరగతి ప్రజలపై పెనుభారం పడనుంది. ఈ క్రమంలో పన్ను లేకుండా ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించామని కర్నాటక రైస్ మిల్లర్లు తెలిపారు.
25 కిలోలు, అంతకంటే తక్కువ బరువున్న ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై(ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్) మాత్రమే 5శాతం జీఎస్టీ విధించబడుతుంది. అయితే, ప్యాక్ చేయని ఉత్పత్తులపై GST లేదు. 25 కిలోల్ బ్యాగుపైనే పన్ను వేయాలని కేంద్రం నిర్ణయించడంతో.. 26 కిలోల సంచుల్లో లేదా 30 కిలోల సంచుల్లో బియ్యం ప్యాక్ చేసి విక్రయించాలని రైస్ మిల్లర్లు యోచిస్తున్నారు.
కర్నాటక రాష్ట్రంలో దాదాపు 1,800 రైస్‌ మిల్లులు కొప్పళ, గంగావతి, రాయచూరు జిల్లాల్లోనే ఉన్నాయి. జీఎస్టీ కారణంగా మిల్లులు తమ కార్యకలాపాలను బాగా తగ్గించుకున్నాయి. గతంలో బ్రాండెడ్ బియ్యంపైనే జీఎస్టీ విధించే వారని, ఇప్పుడు అన్ బ్రాండెడ్ బియ్యానికి కూడా వర్తింపజేశారని మిల్లర్లు వాపోయారు. రాగులను (50 కేజీల బ్యాగులు) మినహాయిస్తే.. 90శాతం బియ్యాన్ని 25 కిలోల బ్యాగుల్లోనే మార్కెట్ కు పంపుతామన్నారు. 25 కిలోల బస్తాల్ల విక్రయించే తృణధాన్యాలను హోల్ సేల్ మెటీరియల్ గా కాకుండా రిటైల్ ఉత్పత్తులుగా కేంద్రం పరిశీలిస్తోందన్నారు.
గతంలో 100 కేజీల బియ్యాన్ని మిల్లర్లు విక్రయించగా, ఆ తర్వాత 50 కేజీలకు తగ్గించారు. కానీ, 2011లో సవరించిన లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం, మిల్లర్లు సులువుగా లోడింగ్ మరియు అన్ లోడ్ చేయడానికి 25 కిలోల బస్తాను ఉపయోగించాలని ఆదేశించారు. మిల్లర్లు 30 లేదా 35 కిలోల బస్తాల్లో బియ్యాన్ని విక్రయించేలా లీగల్ మెట్రాలజీ విభాగం నిబంధనలను సడలించిందని స్థానిక రైస్ మిల్లర్లు తెలిపారు.
ఇప్పుడు జీఎస్టీ భారం పడకుండా ఉండేందుకు తమ ఉత్పత్తులను 30 కేజీల సంచుల్లో విక్రయించేందుకు మిల్లర్లు ప్లాన్ చేస్తున్నారు. వినియోగదారులపై పన్ను భారాన్ని మోపడం మాకు ఇష్టం లేదు. అందుకే 25 కిలోల బ్యాగుల్లో కాకుండా 30 కిలోల సంచుల్లో విక్రయిస్తాం. కొత్త సంచులు రావడానికి కనీసం 20 రోజుల సమయం పట్టొచ్చన్నారు. అప్పటివరకు కస్టమర్లు పన్ను చెల్లించడం తప్ప మరో మార్గం లేదన్నారు.
కొత్త బస్తాల తయారీకి యంత్రాలను రీక్యాలిబ్రేట్ చేయాల్సి ఉంటుందని, అందుకు సమయం పడుతుందని స్థానిక రైస్ మిల్లు యజమాని ఒకరు చెప్పారు. కాగా.. కొత్త రైస్ బస్తాలు వచ్చే వరకు పన్ను వసూలును కేంద్రం నిలిపివేయాలని రైస్ మిల్లర్లు డిమాండ్ చేశారు. లేదంటే కస్టమర్లు కనీసం మూడు నెలల పాటు 5శాతం జీఎస్టీ భారం భరించక తప్పదన్నారు.