home page

భర్తకు ఎక్కువ భార్యలు ఉండాలని ఏ మహిళ కోరుకోదు

ముస్లిం మహిళలే ఈ విషయం చెప్పారు: అస్సాం సీఎంశర్మ

 | 
Biswa sarma

'ఉమ్మడి పౌర స్మృతి చట్టం తీసుకురాక తప్పదు'

దిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) తేవాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.

ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని కోరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో ముస్లిం మహిళలు గౌరవంగా బతకాలంటే ట్రిపుల్‌ తలాక్‌ తరహాలో ఉమ్మడి పౌరస్మృతి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను కలిసిన ముస్లిం మహిళలందరూ ఉమ్మడి పౌరస్మృతి కావాలని కోరుతున్నట్లు హిమంత పేర్కొన్నారు.

''ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని కోరుకోదు. కావాలంటే వారినే అడగండి. ఇదేదో నా సొంత సమస్య కాదు. ముస్లిం తల్లులు, సోదరీమణులకు సంబంధించిన అంశం. ఈ సమాజంలో ముస్లిం మహిళలు గౌరవంగా బతకాలంటే ట్రిపుల్‌ తలాక్‌ తరహాలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలి. నేను హిందువుని, నాకు ఉమ్మడి పౌరస్మృతి ఉంది, నా సోదరికి, నా కుమార్తెకు రక్షణ ఉంది. ఇదే తరహాలో ముస్లిం కుమార్తెలకూ రక్షణ కావాలి'' అని హిమంత పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి పౌరస్మృతి అమలు వైపుగా పుష్కర సింగ్‌ ధామీ అడుగులు వేశారు. ముసాయిదా రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని, మరిన్ని రాష్ట్రాలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తాయని అభిప్రాయపడ్డారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సైతం ఉమ్మడి పౌరస్మృతిపై ఆలోచన చేస్తున్నట్లు గత నెల 23న పేర్కొన్నారు. అక్కడికి రెండ్రోజులకే హిమాచల్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ సైతం ఉమ్మడి పౌరస్మృతి అమలును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, భాజపాకు చెందిన ముఖ్యమంత్రులు ఉమ్మడి పౌరస్మృతి గురించి వ్యాఖ్యలు చేయడాన్ని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఖండించింది. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీ వ్యతిరేక చర్య అని పేర్కొంది.