home page

మహారాష్ట్రలో నవనీత్ చాలీసా వివాదం: హైటెన్షన్

మాతో శ్రీ ఇంటికి భారీ బందోబస్తు

 | 
Shiv sena

ఇంటికే పరిమితమైన నవనీత్-రవిరాణా దంపతులు 

మహారాష్ట్రలో నవనీత్ కౌర్-రవిరాణా సృష్టించిన గలభా ఇంతాఅంతా కాదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్-రవిరాణా ప్రకటించిన నేపధ్యంలో శిశవసేన నాయకులు, కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తులు నవనీత్-రవిరాణా. నవనీత్ ఇండిపెండెంట్ ఎంపీకాగా రవిరాణా మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యుడు.

ముఖ్యమంత్రి ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామని, అందువల్ల రాష్ట్రంలో మంచి జరుగుతుందని నవనీత్-రవిరాణా ప్రకటించారు.దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

ముంబయి: ముంబయిలో శనివారం ఉదయం నుంచీ హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం 'మాతోశ్రీ' ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు విసిరిన సవాల్‌ను నిరసిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు.

ఇటు మాతోశ్రీతో పాటు, రాణా దంపతుల నివాసం వద్ద కార్యకర్తలు భారీ ఎత్తున గుమిగూడారు. రాణా దంపతుల ఇంటికి కొద్దిదూరంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను సైతం ధ్వంసం చేశారు. నివాసంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

ఈ అంశంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ''బయటి వ్యక్తులు మాతోశ్రీ వద్దకు వచ్చి హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తామంటే శివసైనికులు ఊరికే కూర్చుంటారా? మీరు మా నివాసానికి వస్తామని సవాల్‌ విసిరితే.. అదే తరహాలో సమాధానం ఇచ్చే హక్కు మాక్కూడా ఉంటుంది. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ మమ్మల్ని బెదిరించొద్దు'' అని రౌత్‌ వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో నగరవ్యాప్తంగా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు మాతోశ్రీ ముందు హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తామని రాణా దంపతులు సవాల్‌ విసిరారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కార్యకర్తలు భారీ ఎత్తున మాతోశ్రీ ముందుకు చేరుకున్నారు. అక్కడకు వచ్చే ఎంపీ నవనీత్‌, ఎమ్మెల్యే రవి రాణాకు 'ప్రసాదం ఇచ్చి పంపుతామని' పరోక్షంగా హెచ్చరించారు.

ముంబయి పోలీసులు అమ్రావతి ఎంపీ అయిన నవనీత్‌ రాణా, ఆమె భర్త రవి రాణాకు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నవనీత్‌కు 'వై' కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిస్థాపన కోసం హనుమాన్‌ జయంతి రోజు ఠాక్రే హనుమాన్‌ చాలీసా పఠించాలని తాము కోరామని, కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదని రవి రాణా పేర్కొన్నారు. అందుకే తామే ఠాక్రే నివాసం వద్దకు చేరుకొని హనుమాన్‌ చాలీసాను చదువుతామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సహకరిస్తామని శుక్రవారం చెప్పారు.