home page

ఎన్నికల వాగ్దానాలకు చట్టబద్ధత

ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వాగ్దానాలు

 | 

ఖజనాలను ఖాళీ చేస్తున్న రాజకీయ పార్టీలు

ప్రజాస్వామ్యంలో ప్రలోభాలు

 వడ్డేపల్లి మల్లేశము


     దేశంలోని మెజారిటీ ప్రజానీకం, వెనుకబడిన వర్గాలు, తాడిత పీడిత ప్రజా సమూహాలకు సర్కార్ యొక్క చేయూత చాలా అవసరం. ఈ మౌలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో హామీల ప్రకటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తు రాజకీయ వంచనకు గురి చేస్తున్నాయి. అలాంటి తప్పులను సవరించడానికి మేనిఫెస్టో లను చట్టబద్ధం చేయడానికి దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి నటువంటి అవసరం నేటి రోజుల్లో ఎంతగానో ఉన్నది. ప్రలోభాలు, వాగ్దానాలు, లెక్కకు మించి నటువంటి ఉచిత పథకాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రలోభ స్వామ్యంగా మార్చుకున్న రాజకీయ పార్టీలకు తగిన శిక్ష పడాల్సిందే. అటువంటి అవసరం ఎంతగానో ఉన్నది అనేది నేటి జనవాక్యం.
         న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం తో పాటు ప్రత్యేక యంత్రాంగం లేదా సంస్థలను నెలకొల్పడం ద్వారా ఉమ్మడిగా ఈ ప్రలోభాలకు స్వస్తి పలకాల్సిన టువంటి అవసరం ఉన్నది. ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్లయితే ఆ హామీలను పరిపాలనా కాలంలో అమలు చేయడానికి ఆ రాజకీయ పార్టీలను బాధ్యులను చేస్తూ అమలు చేయని సందర్భంలో వాటి గుర్తింపును రద్దు చేసే విధంగా  ఆ ప్రత్యేక యంత్రాంగం పూనుకోవాలి. అప్పుడే భారత దేశంలో ప్రజాస్వామ్యం నవ్వులపాలు కాకుండా రాజ్యాంగబద్ధంగా అమలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది.
     చట్టబద్ధతపై చర్చ జరగాలి అన్న ఉపరాష్ట్రపతి:-
*******
   ఏప్రిల్ 17న మచిలీపట్నంలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు నేటి రాజకీయాల్లో కులం, మతం, ధనం ప్రాధాన్యత క్రమంగా పెరిగిపోవడంతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు పరిణమించిందని ప్రజలు నైతిక విలువలు కలిగిన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా రాజకీయాలకు కొత్త నిర్వచనాన్ని పలకాలని ఆయన కోరారు. నేటి నాయకులలో విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి అని ప్రస్తుత రాజకీయాల్లో నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా విమర్శించే ధోరణి పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన విధానం మనకు కనువిప్పు కావాలి. రాజకీయాల్లో ముఖ్యంగా ప్రవర్తన, సమర్థత ప్రధానమని కానీ కులము, మతము, డబ్బు, నేర స్వభావం పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ప్రకటిస్తే ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని అందుకే రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల పైన చర్చ జరగాలని వాటికి చట్టబద్ధతను తీసుకువచ్చే కృషి జరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆ రోజంతా తాను చేసిన మంచిచెడులను విశ్లేషించుకోవాలి అని అప్పుడు మాత్రమే నీతివంతమైన రాజకీయాలు వస్తాయని  చేసిన సూచన నేటి తరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాజకీయాలు ప్రక్షాళన కావడానికి  మేనిఫెస్టోలో కూడా చట్టబద్ధత తేవడానికి కృషి జరగాలని ఆయన కోరారు. ఆ అవసరం ఈనాడు దేశవ్యాప్తంగా గణనీయంగా ఉన్నది .కనుక  క్రింది స్థాయి నుండి రాజకీయాలపైన నీతివంతమైన చర్చ జరగాల్సిన అవసరాన్ని మనమందరం గుర్తించాలి.
    ఎన్నికల ప్రణాళిక లకు రాజకీయ పార్టీలని బాధ్యులను చేయాలి:-
*****
    రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రలోభాలు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న విధానానికి స్వస్తి పలకాలని అందుకోసం నూతన వ్యవస్థ రావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల మ్యానిఫెస్టో లకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేసే విధంగా హామీలను నెరవేర్చడంలో విఫలం అయితే రాజకీయ పార్టీల గుర్తింపును ఎన్నికల గుర్తులను రద్దు చేసే విధంగా సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ఎన్నికల ప్రణాళిక వల్ల బడ్జెట్ పైన రాష్ట్రాల పైన ఆర్థిక భారం పడుతుందని అంతేకాకుండా అవినీతికి ఆస్కారం ఇస్తున్న ఈ ప్రకటనలను మేనిఫెస్టో లను అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ పార్టీలు అమలు చేయకపోతే శిక్షించే ప్రత్యేక యంత్రాంగం ఉండాలని కోరడం జరిగింది .అంతేకాకుండా రాజకీయ పార్టీల ప్రణాళికలను రాత పూర్వకంగా దార్శనిక పత్రాలుగా ప్రకటించాలని, వీటిని చట్టబద్ధంగా అమలు చేయడం కోసం మార్గదర్శకాలను జారీ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్లో కోరడం జరిగింది. దీనిని బట్టి ఎన్నికల సంఘం ఏ రకమైనటువంటి వైఫల్యాలకు గురవుతున్నది. ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదో  దేశంలో మనం అర్థం చేసుకోవచ్చు.
     ఉచిత పథకాలతో ఓటర్లను ప్రలోభ పెట్టే పార్టీల పైన కేసులు నమోదు చేయాలని ఇటీవల హిందూ సేన పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం పై దేశ ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. కేవలం తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడితే శాశ్వతమైన టువంటి హక్కులను కోల్పోతాము. అటువంటి దేశ ప్రజలు రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటానికి సిద్ధపడాలని ఈ పిటిషన్ మనకు దారి చూపుతున్నది. ఇంకా ఈ పిటిషన్లో నామినేషన్ వేసే ముందు తాము ఎలాంటి ఉచిత హామీలు ఇవ్వలేదని అభ్యర్థులు ఎన్నికల సంఘం నుండి డిక్లరేషన్ తీసుకోవాలని కూడా పిటిషనర్ కోరడాన్ని బట్టి రాబోయే కాలంలో ఈ విషయం పైన సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉందని కాబట్టి రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉంటే తప్ప వాటి మనుగడ సాధ్యం కాదని మనకు తెలిసిపోతుంది.
     రాజ్యాంగబద్ధమైన కొన్ని సందర్భాలు- చర్యలు:-
****** పార్టీలు ప్రకటించే ప్రణాళికలు ఎన్నికల హామీల కు సంబంధించి ఆయా దేశాలలో ఎన్నికల సంఘాలు కాచి వడబోసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి అసంబద్ధమైన హామీలను తొలగించే అధికారం భూటాన్, మెక్సికో లాంటి దేశాలలో అమలులో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి భారతదేశం లోపల కూడా హామీల సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని పార్లమెంట్ ఒక చట్టం ద్వారా రూపకల్పన చేయవలసిన అవసరం ఉన్నది. దీనికి తోడు ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ కూడా తగు చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం భారతదేశంలో పదికాలాలపాటు నిలబడుతుంది. ప్రలోభాలకు తావులేకుండా మనగలుగుతుంది.
       అవినీతికి ఆస్కారమిచ్చే హామీల తోపాటు, బడ్జెట్ పైన పెను ప్రభావాన్ని చూపే మేనిఫెస్టో లను అంత సులభంగా ఆమోదించకుండా ముందుగానే ఆడిట్ కోర్టుకు నివేదించే పద్ధతి కొన్ని ఐరోపా దేశాలలో ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కనుక భారతదేశంలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల ప్రణాళికలను ఆడిట్ కోర్టు ముందుoచి వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నాకనే ఎన్నికల్లో పాల్గొనేలా ఏర్పాటు చేసినట్లయితే ప్రస్తుతము జరుగుతున్నంత అవినీతికి ఆస్కారం ఉండదు .పైగా నీతివంతమైన రాజకీయాలకు కొంతైనా అవకాశం ఏర్పడుతుంది.
       పరిష్కారం ఏమిటి;-
*********
  అతిగా స్పందించి ప్రలోభాలు, వాగ్దానాలకు పాటుపడి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి. అంతే కాకుండా ప్రత్యేక యంత్రాంగం కూడా చాలా అవసరం. నామినేషన్లు దాఖలు చేసే సందర్భంలో కూడా ఎన్నికల సంఘము అంతేకాకుండా ప్రత్యేక యంత్రాంగం ద్వారా కూడా ఉచిత పథకాలు కంటితుడుపు చర్యలు హామీలు ఇవ్వలేదని డిక్లరేషన్ కనుక ఉన్నట్లయితే రాజకీయ పార్టీలు కొంత అదుపులో ఉండే ఆస్కారం ఉంటుంది .ఈ నిబంధనలు ఉల్లంఘించిన టువంటి రాజకీయ పార్టీల యొక్క గుర్తింపును రద్దు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ పోటీ చేయకుండా నిలువరించే  విధానం రావాలి. అంతే కాకుండా వాటి చట్టబద్ధత పైన దేశవ్యాప్తంగా చర్చ జరిగి తదనుగుణమైన టువంటి చట్టాలు అమలులోకి వస్తే తప్ప ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో మరింత సమర్థవంతంగా అమలు చేసుకోలేము. ఆ వైపుగా చర్చలు, చర్యలు కొనసాగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది
*( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)