home page

ముస్లిం వ్యతిరేక ప్రచారంలో కాషాయదళం బిజీ.‌.బిజీ!

క్రమపద్ధతిలో విస్తృత ప్రచారం

 | 
Speakers

ఎం కోటేశ్వరరావు


” 2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు ” హిందువులారా బహుపరాక్‌, జాగ్రత్త పడండి,హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్‌ లేదా హిందూత్వశక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి ? హిందువులు విశాలదృక్పధం కలిగిన వారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు, అదే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి ? ఇప్పటికి దేశంలో జకీర్‌ హుసేన్‌, ఫకృద్దీన్‌ అలీ అహమ్మద్‌, అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ రాష్ట్రపతులుగా పని చేసినపుడు అదే సామాజిక తరగతికి చెందిన వారు ప్రధాని అయితే వచ్చే ముప్పు ఏమిటి ? రాష్ట్రపతులుగా పని చేసిన వారు హిందూ మతానికి లేదా సమాజానికి చేసిన హాని ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?


ఐరోపాలో, ఆసియాలో తలెత్తిన జాతీయవాదాలు భిన్నమైన నేపధ్యాలు, లక్ష్యాలతో ముందుకు వచ్చాయి. ప్రతి చోటా వినాశనానికే దారి తీశాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదం కులాలు, మతాలు, భాషా, ప్రాంతీయతలకు అతీతంగా జరిగింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం, హిందూమహాసభలు ముందుకు తెచ్చిన జాతీయవాదానికి ప్రాతిపదిక పరమత విద్వేషం – హిందూత్వ. జర్మనీలో జర్మన్‌ జాతి పవిత్రతను కాపాడేపేరుతో యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారు, అది ఐరోపా అంతటినీ ప్రభావితం చేసింది. అనేక దేశాల్లో యూదుల ఊచకోతకు దారి తీసింది. మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దానిలో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం.


” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041నాటికి దేశంలో ముస్లిం జనాభా 84శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని, 2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని, అప్పటికి హిందువుల జనాభా 11.2శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకేముంది హిందువులు అంతరించిపోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది. గత వంద సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు నాటుతున్న విషబీజాలు ఇప్పుడు మర్రి ఊడల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం అదే పనిగా ఇలాంటి ప్రచారం కొనసాగుతుండటంతో జనాల్లో ఏమో అనే అనుమానం తలెత్తి దాన్ని నివృత్తి చేసుకోకుండానే అనేక మంది నిజమే అని నమ్ముతున్నారు. దాంతో విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.


వాస్తవం ఏమిటి ? మన జనాభాలెక్కల ప్రకారం 1951లో 84.1శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35శాతంగా ఉండగా ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగుదశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70శాతం ఎలా పెరుగుతారు ? అమెరికా పరిశోధనా సంస్ధ ” పూ ” వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిధ్య అన్నట్లుగా అసలు సదరు ” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ ఉనికిలోనే లేదని గూగుల్‌ తల్లి చెప్పినట్లు 2019లోనే ఫాక్ట్‌లీ డాట్‌ ఇన్‌ అనే సంస్ధ ప్రతినిధి వెల్లడించారు. అందువలన హిందూమతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్దాలే. బిజెపి ఎంపీలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచారదాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తర ప్రదేశ్‌, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒక వేళ అవి చట్టరూపం దాల్చితే 80శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా భజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు ? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా ?


” బిజెపి ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం, కానీ కాంగ్రెస్‌ వచ్చిందా జెండాపై రంజాన్‌ చంద్రుడే గతి, ఎప్పటికీ గుర్తుంచుకో ! ” అంటూ మరొక ప్రచారం జరుగుతున్నది. ఇదీ ముస్లిం విద్వేష ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. ఒక వైపు దేశంలో ముస్లిం జనాభా పెరిగి హిందువులు మైనారిటీగా మారనున్నారనే ప్రచారం చేస్తూనే అదే శక్తులు మరోవైపు చేస్తున్న ప్రచారాన్ని చూద్దాం. ” కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విష జంతువులు ఉన్న కాంగ్రెస్‌ అనే పెద్ద మర్రి చెట్టును మోడీ పెకలించి వేస్తున్నాడు ” మార్క్‌తులి అనే బిబిసి మాజీ విలేకరి ఈ ప్రకటన ఇచ్చాడు అని అదే పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు సారం ఏమంటే విషసర్పాలన్నింటికీ మోడీ పొగపెట్టారు గనుక అవి దేశం మీద పడ్డాయి. వాటిని జనాలకు చూపి మోడీ అప్రమత్తంగావించటం మంచిదైంది. లేకపోతే అవి ఈ భారత భూమిని, హిందువులను మింగివేసేవి. మోడీ భవిష్యత్‌ తరాల మతమార్పిడులకు అడ్డుకట్టవేశారు. మోడీగారు చాలా కష్టపడాలి, పడతారు కూడా. అయితే ఈ దేశ ప్రజలంతా ముఖ్యంగా హిందువులంతా నరేంద్రమోడీ గారికి అండగా నిలవాలి. అని పేర్కొన్నారు. ఒక పోస్టులోనేమో ముస్లింలు మెజారిటీగా మారనున్నారని భయపెడతారు, మరో పోస్టులో హిందూమత రక్షకుడు నరేంద్రమోడీ వచ్చినట్లు, ముప్పు తప్పించినందుకు మద్దతు ఇవ్వాలని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఉనికిలో లేని సంస్ధ పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించినట్లుగానే మార్క్‌తులి పేరు చెప్పి మరో పచ్చి అబద్దం ప్రచారంలో పెట్టారు. నరేంద్రమోడీకి అనుకూలంగా కొన్ని అంశాలను రాసి అవి మార్క్‌తులి పుస్తకంలోనివిగా పేర్కొంటూ గత ఐదు సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” 2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషులూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే ” చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” అన్నారు. 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. హిందువులు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు.


1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ? ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది.


దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. .2011లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? చిత్రం ఏమంటే దేశంలో అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?


2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లిం పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు ఇక్కడి ముస్లింలకు వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు.


ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. హిట్లర్‌ను, వాడి మంత్రి గోబెల్స్‌ను ఎవరు ఆదర్శంగా తీసుకున్నదీ వేరే చెప్పాలాా?