home page

జాతీయ రాజకీయాలపై కేసిఆర్

దేశవ్యాప్తంగా స్నేహయాత్రలు

 | 
Kcr

జాతీయ స్ధాయిలో దక్షిణాది నాయకత్వం 

(జింకానాగరాజు)Kcr

తెలుగు రాజకీయాలలోనే కాదు, మొత్తం దక్షిణ భారత దేశ రాజకీయాలలోనే ఆసక్తికరమయిన పరిణామమొకటి గమనిస్తున్నాం. ఇది ఆసక్తికరమయినదే కాదు, వాంఛనీయ పరిణామం కూడా. అదేంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించాలనుకుంటున్నారు. ఆయన జాతీయ రాజకీయల్లోకి మైగ్రేట్ అయిపోయి ఫుల్ టైం నేషనల్ లీడర్ కావాలనుకుంటున్నారు. ఫ్రంటు గింటు అనేవి ఎన్నికల ముందు వచ్చేవి పోయేవి. అలాకాకుండా ఫుల్ టైం నేషనల్ పొలిటీషన్ అనేది శాశ్వత హోదా. పదవితో నిమిత్తం లేకుండా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగే హోదా. ఇపుడు కెసిఆర్ ఢిల్లీ పర్యటన, ఇతర రాష్ట్రాల పర్యటన చూస్తే ఆయన మనసులో ఏముందో అర్థమవుతుంది. ఢిల్లీ రాజకీయాలను ఒక దక్షిణాది నాయకుడు అందునా తెలుగు వాడు ప్రభావితం చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం.

ఎందుకంటే, ఆధునిక రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు అరుదు.

దేశంలో జాతీయ నాయకుల పుట్టుక 1885లో కాంగ్రెస్ పార్టీ పుట్టాక దేశంలో జాతీయ కార్యకలాపాలు మొదలయ్యాయి. స్వాతంత్య్ర సంగ్రామం మొదలయ్యాక జాతీయ రాజకీయాలు మొదలయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం పోవాలి, భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే నినాదం ఉన్నచోటల్లా జాతీయ రాజకీయాలు మొదలయ్యాయి. జాతీయ రాజకీయ నాయకులు పుట్టారు. దక్షిణాన ఇలాంటి నినాదం మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చింది. మొదటి తరం జాతీయ నాయకులు మద్రాసు ప్రెసిడెన్సీలోనే పుట్టారు. అపుడు ఆంధ్రా ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలోనే ఉండింది కాబట్టి మొదటి తెలుగు జాతీయనాయకులు ఆంధ్ర నుంచి వచ్చారు. నైజాం నుంచి జాతీయోద్యమ నాయకులు రాలేదు. నైజాంలో నిజాం వ్యతిరేక ఉద్యమం వచ్చినా అది జాతీయోద్యంలో భాగంగా రాలేదు. స్వతంత్ర ఉనికి ఉన్న ఉద్యమం. అందుకే స్వామి రామానంద తీర్థ వంటి మహా నాయకులు నైజాంలో వచ్చినా వారిని జాతీయోద్యమ నాయకుల్లో ఒకరిగా చెప్పలేం. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వారిలో తెలుగు వాళ్లున్నా వాళ్లకి జాతీయ నాయకుల హోదా రాలేదు. జాతీయోద్యమ బలంగా ఉన్నపుడు ఆగ్రశ్రేణి నాయకుల సరసన నిలబడే హోదా కొందరికే దక్కింది. తమిళనాడుకు చెందిన చక్రవర్తి రాజగోపాలాచారి, తెలుగు ప్రాంతాలకు చెందిన డా. పట్టాభీ సీతారామయ్య, టంగుటూరి ప్రకాశంపంతులు వగైరా. ఇక స్థానిక నాయకులకు కొదువే లేదు.

ఇక స్వాతంత్య్రం వచ్చాక అధికారం ఉత్తరాది వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఉత్తరాది నాయకుల చేతిలోనే జాతీయ ప్రభుత్వాలు నడిచాయి. నాయకత్వం ఎపుడూ దక్షిణాదికి రాలేదు. దక్షిణాది నుంచి కమాండింగ్ పొజిషన్ లో ఉన్న జాతీయ నాయకుడెవరూ లేరు. అయితే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకులు మాత్రం ఒకరిద్దరుండే వారు. వీళ్లకి దేశ నాయకత్వం రాలేదు. కాకపోతే, వీళ్లలో కింగ్ మేకర్లు తయారయ్యారు.

దక్షిణాదిన మొదటి కింగ్ మేకర్

స్వాతంత్య్రానాంతర దక్షిణాది నుంచి గాని, తెలుగు రాష్ట్రాలనుంచి గాని నేషనల్ పొలిటీషన్సస్ గా కొనసాగుతూ వచ్చిన వారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. మొదటి తరంలో కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి, నిజలింగప్పలు వగైరా మాత్రమే జాతీయ నాయకులు. వీళ్లంతా కలిపి పిడికెడే. అయినా జాతీయ రాజకీయాలను శాసించారు. ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి నీలం సంజీవరెడ్డి చివరి జాతీయ నాయకుడు. భారత రాజకీయాల్లో ‘కింగ్ మేకర్’ అనే గుర్తింపు మొదట పొందిన నాయకుడు కామరాజ్ నాడార్ (జూలై 15, 1903- అక్టోబర్ 2,1975). ఓల్డ్ కాంగ్రెస్ అనే పేరున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్)కు అధ్యక్షుడాయన. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన స్వాతంత్ర్యానంతర గొప్ప నాయకుడు. ఇక ఆంధ్రప్రదేశ్ కుచెందిన నీలం సంజీవరెడ్డి, కన్నడ ప్రాంతానికి చెందిన నిజలింగప్పలు కూడా ఇదే పార్టీ లో ఉన్నారు. ఇలా వాళ్లూ ఆరోజుల్లో జాతీయ నాయకులుగా గుర్తింపు పొందినవారే. వీళ్లే చివరి తరం జాతీయ నాయకులు.
ఎందుకంటే, ప్రధాని ఇందిరాగాంధీ కాంగ్రెస్ లో ఎవరున్నా జాతీయ నాయకుడిగా ఎదగనీయలేదు. ఆమె హయాంలో కాంగ్రెస్ బలహీన పడటం, ప్రాంతీయ పార్టీలు రావడం, జాతీయ రాజకీయాలు మాయం కావడం, బలమయిన ప్రాంతీయ నాయకులు పుట్టడం జరిగింది. ప్రాంతీయ పార్టీల వ్యవస్థలో జాతీయ నాయకులుండటం కష్టం. 1982లో తెలుగుదేశం, 2001లో తెలంగాణ రాష్ట్రసమితి, 2011 లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ వచ్చాక బలమయిన ప్రాంతీయ నాయకులు తయారయ్యారగాని జాతీయ నాయకులెవరూ రాలేదు. వచ్చే అవకాశమూ లేదు. కాకపోతే, ఇలాంటి ప్రాంతీయ పార్టీలకూటమి జాతీయ స్థాయిలో అవసరమయినపుడు వాటికి ఛైర్మన్ గా ఒక సారి ఎన్టీరామారావు, మరొక సారి చంద్రబాబు నాయుడు నియమితులయ్యారు. అయినా సరే వాళ్లకి జాతీయ నాయకుడనే హోదా రాలేదు. ఇంకా స్పష్టంగా చెప్పుకుంటే ‘కింగ్ మేకర్లు’ అనిపించుకున్నారు. ఈ లెక్కన దక్షిణాది వాళ్లు కింగ్ మేకర్లు అయ్యారు తప్ప కింగ్స్ కాలేదు.
 2022 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ రాజకీయాలే లేవు. జాతీయనాయలకునే అనే తెగ అంతరించి పోయింది. దేశంలో కాంగ్రెస్, బిజెపి, వామక్షాల వంటి జాతీయ పార్టీలున్నాయి. కాంగ్రెస్, బిజెపిలలో అగ్ర నాయకుడికి తప్ప మరొకరెవరికి జాతీయ నాయకుడనే గుర్తింపు లేదు. వాజ్ పేయి హయాంలో మాత్రమే పార్టీ లో ఇద్దరు జాతీయనాయకులండే వారు. మరొక నేత ఎల్ కె అద్వానీ. నేటి బిజెపిలో మోదీ తప్ప అద్వానీలాగా స్వతంత్ర హోదా ఉన్న జాతీయ నాయకుడెవరు? ఇలాగే కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, సోనియా తప్ప జాతీయ నాయకులెవరు?
 ఏ ఒక్క కేంద్ర మంత్రి కూడా పక్క రాష్ట్రంలో నాయకుడు కాలేదు. ఇపుడున్న పరిస్థితి: జాతీయ పార్టీలలో జాతీయ నాయకులుండరు, ప్రాంతీయ పార్టీలకి జాతీయ నాయకుల అవసరమే లేదు. ఇలాంటపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కొత్త పరిణామం, చాలెంజ్ కూడా. ఆయన ఫుల్ టైమ్ నేషనల్ పొలిటీషన్ పాత్ర పోషించేందుకు అన్ని పార్టీల ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఈ రోజుల్లో ఒక ప్రాంతీయ పార్టీనేత ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటి సారి.
ఎందుకంటే, జాతీయ నాయకులు కావాలని భావించిన శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ చివరకు ప్రాంతీయ రాజకీయాల్లోనే చిక్కుకు పోయారు. బయట పడలేకపోయారు.
జాతీయ స్థాయిలో దక్షిణాది నాయకత్వం
ఢిల్లీ చక్రవర్తులు, లేదా ఉత్తరాది చక్రవర్తులు వింధ్యపర్వతాలు దాటి దక్షిణాదికి వచ్చి, ఇక్కడి రాజులను జయించి, జండాలు పాతి, శాసనాలు వేయించి వెళ్లిపోయారు. అశోకుడి కాలం నుంచి ఔరంగా జేబు దాకా ఎందరో చక్రవర్తులు దక్కన్ ను అక్రమించుకున్నారు. అయితే, ఒక్క దక్షిణాది రాజు కూడా వింధ్య పర్వతాలు దాటి ఢిల్లీని వశపర్చుకుని జండా ఎగరేయలేదు. పూర్వమేకాదు, స్వాతంత్య్రం వచ్చాక కూడా జరగలేదు. కొంతమంది దక్షిణాది నాయకులు సర్దుబాట్లలో భాగంగానో, పరిస్థితుల కారణంగానో ప్రధానులయి ఉండవచ్చు తప్ప, స్వతంత్రంగా జాతీయ స్థాయిలో ఎదిగి ఎవ్వరూ ప్రధాని కాలేదు. జాతీయ పార్టీల అగ్రనేతలకు ఒక ఎడ్వాంటేజ్ ఉంటుంది. ఇందిరాగాంధీ, వాజ్ పేయి,అద్వానీ, నరేంద్ర మోదీలు దేశంలో ఎక్కడనుంచైనా పోటీ చేసి గెలవగలిగే స్థాయికి ఎదిగారు. ఆ పార్టీలలో మరొకరికి ఈహోదా రాలేదు. ఇలాంటి హోదా ప్రాంతీయపార్టీల నాయకులు దొరకడం కష్టం. అయితే ప్రాంతీయ పార్టీల నేతలకు ఇది సాధ్యం కాదు. అందుకే ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడి జాతీయరాజకీయాలను శాసించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కెసిఆర్ బాట కూడా ఇదే.
దక్షిణాదికి నాయకత్వం వస్తుందా?
క్రీస్తుకు పూర్వం తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడ్డప్పటి నుంచి దక్షిణాది రాజులెవరూ ఉత్తరాదిలో పెత్తనం చేయలేదు. తెలుగు వాళ్ల అతి పెద్ద సామ్రాజ్యమయిన శాతవాహన రాజ్యం కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు పరిమితమయింది. కాకపోతే, నేటి గజరాత్ లో కొంత భాగానికి కూడా విస్తరించి ఉండింది. విశాల భూభాగాన్ని అక్రమించిన మరొక దక్షిణాది రాజ్యం చోళ రాజ్యం. ఈ రాజులు సముద్రాలను జయించి, ఆగ్రేయాసియా దాకా తమ పలుకుబడిని విస్తరింపచేసుకున్నా, దేశంలో వింధ్యపర్వాతాలు దాటి వెళ్లి ఉత్తరాదిని జయించలేదు. భారతదేశచరిత్రలో ఉత్తరాది వాళ్లు దక్షిణాన్ని జయించారు తప్ప దక్షిణాది వీరుడెవరూ ఉత్తర భారతంలో జండా పాతలేకపోయారు. ఆధునిక కాలంలో బాగా ప్రజాదరణ ఉన్న ఎంజి రామచంద్రన్, ఎన్టీరామారావు లు కూడా ప్రాంతీయ రాజకీయాలకే పరిమితమయ్యారు. ఎన్టీఆర్ రామారావు ఒక సారి ‘భారతదేశం పార్టీ’ అని జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినా జాతీయ రాజకీయ నాయకుడు కాలేకపోయారు. అలాగే తెలుగు రాష్ట్రాలు రెండుయ్యాక, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడయ్యారు తప్ప ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఫుల్ టైమ్ పాంత్ర పోషించిందెపుడూ లేదు.ఆల్ ఇండియా అని పేరులో తగిలించుకున్న ఎఐడిఎంకె ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడులో బలంగా ఉన్నపుడు కూడా నేషనల్ పొలిటీషన్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ఇపుడు దేశ రాజకీయాల్లో నేషనల్ పొలిటీషన్ రోల్ పోషిస్తున్న వ్యక్తి ఒక్కరే ఆయన హైదరాబాద్ అసదుద్దీన్ ఒవైసీ. దేశ రాజకీయాల్లో కాకపోయినా, హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ఎఐఎంఐఎం తరఫున ఆయన దేశమంతా తిరుగుతూ ‘సొంత పార్టీ జాతీయ నాయకుడు’ అయ్యారు. ఇలా కాకుండా, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రకోసం, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కెసిఆర్.
కెసిఆర్ కు అనుకూల పరిస్థితులు
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి అవసరమయిన ప్రధాని కావాలనుకున్నవాళ్లు ప్రాంతీయ పార్టీలలో చాలా మంది ఉన్నారు. శరద్ పవార్, ములాయం సింగ్, మాయావతి, మమతా బెనర్జీ వగైరా. దేశంలో మోదీ రాజకీయాధ్యాయం మొదలయ్యాక, వీళ్లంతా రాష్ట్ర రాజకీయాల్లోనే కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. వీళ్లందరూ తమ రాష్ట్రాల్లో సొంత పార్టీలను బిజెపి ముప్పు నుంచి కాపాడుకునేందుకు 24x7 అప్రమత్తంగా ఉండే పరిస్థితి మోదీ సృష్టించారు. అందువల్ల వీళ్లు జాతీయ రాజకీయాల్లో పాత్రదొరికితే పోషిస్తారేమో తప్ప ఫుల్ టైం పొలిటీషన్ అయ్యే అవకాశం లేదు. ఇలాంటి అవకాశం ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మాత్రమే ఉంది. ఎందుకంటే, ఇక్కడ ప్రతిపక్షాల నుంచి ముప్పు కనిపించడం లేదు. బిజెపి ఇపుడిపుడే పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ ను పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్ల దేశంలో ఏ నాయకుడికి రాని ఒక అరుదైన అవకాశం పవర్ లో ఉండగానే కెసిఆర్ కు వచ్చింది. ఆయన పార్టీ పవర్ లో ఉన్నపుడే కుమారుడు కెటిఆర్ కి యుద్ధవిద్యలన్నీ నేర్పించి వారసుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అవకాశం శరద్ పవార్ కి రానే లేదు. ములాయం సింగ్ వారసుడిని తయారుచేసుకున్నా, తాను రిటైరై పోయారు. ఆర్జేడిలో ఇదే పరిస్థితి. మమతా బెనర్జీకి వారుసులే లేరు. తమిళనాడులో పవర్ లో ఉన్నపుడే కరుణానిధి కూడా వారుసునిగా స్టాలిన్ తీర్చిదిద్దినా , తమిళ నేతలకు నేషనల్ పొలిటిషన్ కావాలనే యాంబిషన్ బాగా తక్కువు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కి కూడా జాతీయ రాజకీయాల్లో మోజున్నట్లు కనిపించదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ నాయకుడుయ్యే అన్ని యోగ్యతలున్నవాడు. కాకపోతే, ఆయనకు ఢిల్లీని న్యూఢీలీ నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి యోగ్యతలున్నా వనరులు, సమయం తక్కువ. ఇక టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, 2019 ఎన్నికల ముందు ఒక ప్రయత్నం చేశారు. దెబ్బతిన్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో టిడిపిని పవర్ లోకి తెచ్చుకోవడమే ఆయన ప్రాధాన్యత. అలాంటపుడు జాతీయ రాజకీయాలవైపు కన్నెత్తి చూడకపోవచ్చు.
కాబట్టి ఒక్క కెసిఆర్ మాత్రమే ఫుల్ టైం నేషనల్ పొలిటీషన్ కాగలరు. ప్రభుత్వ బాధ్యతలను కొడుకు కెటిఆర్ కు అప్పగించి చాలా కాలమయింది. ఆయన తీరుబడిగా ఫుల్ టైం నేషనల్ పొలిటీషన్ అయ్యేందుకు అవకాశమే కాదు, వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయి. తాను ఢిల్లీలోనే మకాం వేసినా రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ నడుస్తుందనేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకేనేమో ఆయన ఫుల్ టైం నేషనల్ పొలిటీషన్ పాత్ర పోషించేందుకు అడ్డంకులెదురవుతున్నా ప్రయత్నిస్తూనే ఉన్నారు.