home page

దేశానికి దిక్సూచి కెసిఆర్

ప్రత్యామ్నాయ పథంలో కొత్త శకం 

 | 
kumaracswamy kcr

ఇది భారత చరిత్ర నిరూపించిన సత్యం  

★ ఇండియా రియాక్ట్స్

★ ఇది భారత చరిత్ర నిరూపించిన సత్యం

★ ప్రతి సంక్షోభ సమయంలోనూ స్పందించిన ప్రజానీకం

★ నియంతృత్వానికి సామూహిక ధిక్కారంతో జవాబు

★ సీఎం కేసీఆర్‌ విజన్‌పై దేశమంతా ఆసక్తి

★ ఇందిర అహంకారాన్ని అణచిన భారతీయులు

★ కాంగ్రెస్‌ను దింపి జనతాపార్టీకి పట్టాభిషేకం

★ కాంగ్రెస్‌, బీజేపీని కాదని యునైటెడ్‌ ఫ్రంట్‌కు పట్టం

★ నేడు మోదీ, బీజేపీదీ నాటి కాంగ్రెస్‌ వైఖరే

★ ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం దేశం చూపు

స్వతంత్ర భారతంలో రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడల్లా దేశం రియాక్ట్‌ అవుతూనే ఉన్నది. ప్రత్యామ్నాయం వచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. చరిత్రే ఇందుకు సాక్ష్యం. ఏకపక్ష నియంతృత్వ ధోరణిని దేశం ఎన్నడూ అంగీకరించలేదు. ఓ పార్టీకి తిరుగేలేదని అభిప్రాయం కలిగిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో దాన్ని కూల్చి కొత్త నాయకత్వాన్ని ఆదరించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌, వీపీ సింగ్‌, వాజపేయి లాంటి నేతలు అలాంటి పరిస్థితుల నుంచే వచ్చి దేశానికి నాయకత్వం వహించారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌కు కూడా ప్రజలు అలాంటి పరిస్థితుల్లోనే బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు సరిగ్గా దేశంలో అదే రాజకీయ శూన్యత కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్ది దేశాన్ని మళ్లీ ప్రగతి పట్టాలెక్కించే నాయకత్వం కావాలి. కోట్లమంది ఆకాంక్షలకు వాస్తవరూపం ఇచ్చే నేత కావాలి. ప్రజల కష్టాలకు సరైన పరిష్కారాలు చూపే నాయకుడు రావాలని దేశం కోరుకొంటున్నది.

*****

మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు ప్రత్యామ్నాయం చూపే నాయకత్వ శక్తి కోసం దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. కేంద్రంలో బీజేపీ అసమర్థ, నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన ప్రధాన పక్షం కాంగ్రెస్‌ కాడి దిం చేసింది. అనేక జాతీ య, ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పటికే మోదీకి జడిసి పక్కకు తప్పుకొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కాంతిపుంజంలా కనిపిస్తున్న నేత ఒక్కరే.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈ పేరు మూడు దశాబ్దాలుగా దేశ ప్రజలకు సుపరిచితమే. లక్ష్య సాధనకోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడని పోరాట యోధుడిగా తెలంగాణ ఉద్యమ కాలంలో భారతీయులందరికీ కేసీఆర్‌ ఒక చైతన్యమూర్తి. తెలంగాణ ముఖ్యమంత్రిగా గొప్ప దార్శనికత ఉన్న పాలకుడిగా నేడు ప్రగతి ప్రదాత. అందుకే దేశమంతా ఇప్పుడు కేసీఆర్‌ వైపు చూస్తున్నది. ఆయన చెప్పేది వింటున్నది. ఆలోచిస్తున్నది. మోదీకి, బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం కేసీఆరే అన్న నిర్ధారణకు వస్తున్నది. 140 కోట్ల మంది ఆకాంక్షలను వాస్తవంలోకి తెచ్చేందుకు కేసీఆర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ ముక్త్‌ భారత్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ మాడల్‌ను చూపుతూ దేశానికి ఎలాంటి ప్రభుత్వం కావాలో చెప్పకనే చెప్తున్నారు. దేశానికి కొత్త దిశ, దశను చూపడానికి తాను సిద్ధంచేసిన బ్లూప్రింట్‌పై అనేక రంగాల నిపుణులతో చర్చోపచర్చలు జరిపారు. టీఎంసీ, ఆప్‌, ఎస్పీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ అధినేతలకు తన లక్ష్యాలను వివరించి ముందుకు సాగుతున్నారు. గ తంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం జరిగింది? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవతరణ, ఏకీకరణ, అధికార సాధన ఎలా సాధ్యమైంది? కొన్ని ఉదాహరణలు..

జేపీ నేతృత్వంలో జనతా పార్టీ
--------------------------------- 
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ రూపంలో జాతికి కొత్త మార్గదర్శనం లభించింది. అప్పటి భారతీయ లోక్‌దళ్‌, సోషలిస్టు పార్టీ, భారతీయ జనసంఘ్‌ వంటి విపక్ష పార్టీలన్నింటినీ ఒకత్రాటిపైకి తెచ్చి జనతా పార్టీని ఏర్పాటుచేశారు. ఇందిరాగాంధీని 1978లో గద్దె దింపి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర పార్టీగా జనతా పార్టీ చరిత్రకు సృష్టించింది. కాంగ్రెసేతర తొలి ప్రధానిగా మొరార్జీ దేశాయ్‌ వినుతికెక్కారు.

ఎన్టీఆర్‌ హయాంలో నేషనల్‌ ఫ్రంట్‌
--------------------------------- 
అంతర్గత విభేదాలతో ప్రజలు ఆవకాశం ఇచ్చినా నిలుపుకోలేక జనతా పార్టీ ప్రభుత్వం రెండేండ్లకే 1980లో కుప్పకూలింది. ఆ తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆప్పుడు పాత జనసంఘ్‌ భారతీయ జనతాపార్టీగా, భారతీయ లోక్‌దళ్‌.. లోక్‌దళ్‌ పార్టీగా రూపాంతరం చెందాయి. ప్రధాని ఇందిరాగాంధీ 1984లో హత్యకు గురి కావడంతో సానుభూతి పవనాలతో ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ వేవ్‌ పని చేయలేదు. సినీ నటుడు ఎన్టీఆర్‌ నేతృత్వంలో 1983లో అవతరించిన టీడీపీ 30 లోక్‌సభ స్థానాలు గెలుచుకొని లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ పోషించిన తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీ నిలిచింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రెండోసారి ప్రాం తీయ పార్టీలను ఏకం చేసి నేషనల్‌ ఫ్రంట్‌గా ఏర్పాటుచేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కింది. ఎన్టీఆర్‌ చైర్మన్‌గా అవతరించిన నేషనల్‌ ఫ్రంట్‌ 1989లో కాంగ్రెస్‌ను గద్దె దింపి అధికారంలోకి వచ్చింది.

కాంగ్రెస్‌, బీజేపీయేతర యునైటెడ్‌ ఫ్రంట్‌
--------------------------------- 
1996లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీయేతర యునైటెడ్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. దక్షిణాది నుంచి దేశ ప్రధాని అయిన రెండోవ్యక్తిగా దేవెగౌడ చరిత్రలో నిలిచారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటులోనూ ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషించాయి.

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్డీయే
--------------------------------- 
1998లో బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ఏర్పడింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఎన్డీయే, 1998 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నది. ఆ తర్వాత ఇదే కూటమి ప్రధాని మోదీ నాయకత్వంలో తిరిగి 2014 నుంచి వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.

అర్జెంటీనా, గ్రీస్‌లో జరిగింది ఇదేగా..
--------------------------------- 
ప్రపంచ రాజకీయాల్లోనూ ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అర్జెంటీనాలో జుంటోస్‌ పొరెల్‌ కాంబియో పార్టీ నేత మౌరిసియో మాక్రీ 2015లో ప్రజలకు అంతులేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఎడాపెడా అప్పులు చేసి అనుయాయులకు ఆస్తులు దోచిపెట్టారు. అధికారంలో తానే ఉండాలని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి చేయని కుట్రలేదు. దీంతో ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. ప్రజాగ్రహాన్ని చూసి విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. 2019 ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. అల్బర్టో ఫెర్నాండెజ్‌ అధ్యక్షుడయ్యారు. గ్రీస్‌ మాజీ అధ్యక్షుడు అలెక్సిస్‌ సిప్రాస్‌ గద్దె దిగడానికి కూడా నియతృత్వ పాలనపై ప్రజల తిరుగుబాట్లే కారణం. ఉగాండా పాలకుడు ఈదీ అమీన్‌, చిలీ మాజీ అధ్యక్షుడు అగస్టో పినోచెట్‌ ఏ పరిస్థితుల్లో గద్దె దిగారో జగద్విదితమే. మోదీ సర్కారుకూ అదే పరిస్థితి వస్తుందని రాజకీయ పండితులు బల్లగుద్ది చెప్తున్నారు.

రాజీవ్‌ అనంతరం దారిచూపిన పీవీ
--------------------------------- 
1991లో ఎన్నికల ప్రచారం మధ్యలోనే కాంగ్రెస్‌ అధినేత రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. రాజకీయాల నుంచి రిటైర్‌ కావాలనుకొని హైదరాబాద్‌కు పయనం అయిన పీవీ నరసింహారావు అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టి, ఆ తర్వాత దక్షిణ భారతం నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నిరూపించిన పీవీ, మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేండ్లపాటు నడిపించి రికార్డు సృష్టించారు.
 ఇది సామాన్యుడి మాట