నీతిఆయోగ్ సమావేశానికి కేసిఆర్, నితీష్ గైర్హాజరు
17 వ కౌన్సిల్ సమావేశంలో పలు నిర్ణయాలు
Updated: Aug 7, 2022, 16:44 IST
| 
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రారంభమైంది. ఇందులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు నేటి నీతి ఆయోగ్ సమావేశం ఎజెండాలో ఉన్నాయి. అయితే, నీతి ఆయోగ్ ఏడో సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కీలక నేతలైన తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌లు మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. జులై 2019లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత పాలకమండలి సభ్యులు మళ్లీ భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ భేటీని భౌతికంగా నిర్వహించ లేదు. ఇదిలాఉంటే, నీతీ ఆయోగ్ సమావేశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ ప్రణాళిక మండలికి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన నీతిఆయోగ్‌లో నీతి లేదని, దాని వల్ల ఎవరికీ మేలు జరగడం లేదని విమర్శించారు. నీతిఆయోగ్‌ను నిరర్థకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నేడు దిల్లీలో జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోవిడ్ బారినపడి ఇటీవలే కోలుకున్న బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మాత్రం ఈ భేటీకి హాజరు కాలేదు.