home page

కెసిఆర్ ' బిఆర్ఎస్' కలనెరవేరేనా?

జాతీయ రాజకీయాలపై పట్టు వస్తుందా?

 | 
Kcr

మన దేశంలో ఇప్పటివరకూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బి.జె.పి. మాత్రమే మనుగడ సాధిస్తూ వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్థి స్థాయిలో విజయం సాధించి సుదీర్ఘకాలం మనుగడ సాగించిన దాఖలాలు లేవు. ఎన్.టి.ఆర్. హయాంలో నేషనల్ ఫ్రంట్ ని స్థాపించినా అదీ ఎక్కువ కాలం కొనసాగలేదనే చెప్పాలి. అయితే, వాజపేయి హయాంలో జయలలిత, మమతా బెనర్జీలాంటివారి మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. కేసీఆర్ కొత్త పార్టీ ఎక్కడ ఎవరి ఓటు బ్యాంకు కొల్లగొట్టి ప్రభావం చూపుతాడు అనేది ప్రశ్న. కనీసం ఒక 100 సీట్లు అన్నా గెలిస్తే కానీ దేశంలో ఒక పార్టీకి గుర్తింపు ఉండదు. పోనీ ఒక 50 సీట్లు అనుకున్నా కేసీఆర్ గారు తెలంగాణ కాకుండా ఏ రాష్ట్రంలో మిగిలిన 34 సీట్లు గెలుస్తారు.

అంటే జగన్ గెలిచిన 20 సీట్లు ఆయన ఖాతాలో వేస్తే, జగన్ ఏ మాత్రం కేసీఆర్ ను అధినాయకుడు అని ఒప్పుకొని 5 ఏళ్ళు ఆయనకు తల వొంచి ఉంటాడు ?. పోనీ అలా జరిగింది అనుకున్నా అది ఒక యూపీఏ, ఎన్డీయే లాంటివి కానీ ఒక వేరే స్వతంత్ర పార్టీ కాలేదు కదా. ఎన్డీయే, యుపిఎ లాటి సమూహం అయితే మళ్ళీ సీట్ల లెక్క వస్తుంది. మళ్ళీ దేవెగౌడ, చంద్రశేఖర్, గుజ్రాల్ కథే కొత్త ఏముంది.

ఇక ప్రస్తుత విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ నినాదంతో ఉద్భవించింది. అప్పుడు వేచి చూసే ధోరణి అంటూ తెలుగుదేశం, ప్రత్యేక తెలంగాణ నినాదానికి మద్ధతిస్తే ఆంధ్రప్రదేశ్ వాసుల ఓట్లను కోల్పోతామన్న భయంతో భారతీయ జనతా పార్టీ, అదే విధానంతో కాంగ్రెస్ పార్టీ చాలా కాలంపాటు తటస్థ వైఖరిని అవలంబించడం టి.ఆర్.ఎస్.కు బలాన్ని చేకూర్చింది. టి.ఆర్.ఎస్.లో కుటుంబ పాలన కొనసాగుతోందనీ, ప్రజలకు కె.సి.ఆర్. అనేక రకాలుగా అన్యాయం చేస్తున్నారనే ప్రచారంతో బి.జె.పి. తెలంగాణలో టి.ఆర్.ఎస్. పతనానికి పాచికలు వేస్తున్నప్పటికీ అవి ఎంతవరకూ నెరవేరతాయన్నది అనుమానాస్పదమే. ఎందుకంటే, టి.ఆర్.ఎస్. పట్ల ప్రజల్లో తర్వాత్తర్వాత కొంత వ్యతిరేకత మొదలైనప్పటికీ, పార్టీ ఉద్భవించిన లక్ష్యమే ప్రత్యేక తెలంగాణ నినాదం, ఈ ప్రాంత అభివృద్ధి కావడంవల్ల ఆ పార్టీ రెండోసారి కూడా విజయాన్ని సాధించగలిగింది. అయితే, 2024లో జరిగే ఎన్నికల్లో ఒకవేళ బి.జె.పి. గెలిస్తే ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో ఆ పార్టీ ఇప్పటికీ స్పష్టంగా ఏమీ చెప్పిన దాఖలాలు లేవు. మరో ముఖ్యమైన విషయమేంటంటే టి.ఆర్.ఎస్.పై ఎదురుదాడి చేయాలంటే కేవలం బండి సంజయ్ వల్ల మాత్రమే సాధ్యం కాదనే చెప్పాలి. కేంద్రమంత్రిగా వున్నప్పటికీ కిషన్ రెడ్డి అడపాదడపా టి.ఆర్.ఎస్. పాలనపై విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. ఇక బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా వుండిపోవడం, చాలాకాలం నుండే అజాత శత్రువుగా పేరున్న ఆయన పెద్దగా ఎవరినీ విమర్శించకపోవడం అందరికీ తెలిసిందే. 

సరిగ్గా ఇదే సమయంలో కె.సి.ఆర్. బి.జె.పి.పై వున్న వ్యతిరేకతతో బీజేపీయేతర కూటమిని సమీకరించి జాతీయ స్థాయిలో పాగా వేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీల అధినేతలనందరినీ కలసి బి.జె.పి. పాలనపట్ల వ్యతిరేకతను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కె.సి.ఆర్ గారు, అయితే భాజపా తో సహా కొన్ని జాతీయ పార్టీలు మాటిమాటికి ప్రాంతీయ పార్టీల వల్ల దేశం అభివృద్ధి చెందదు అని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలు తిప్పికొట్టాలంటే, టి. ఆర్.ఎస్. జాతీయ పార్టీగా అవతరించటమే మార్గమని భావించి వుండొచ్చు. అలా జాతీయ పార్టీగా అవతరించాకా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అక్కడి భావస్వారూప్యత ఉన్న పార్టీలతో చేతులు కలిపి కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అయినా గెలవచ్చు అని భావించి ఉంటారు. దీనికి తోడు కె సీ ఆర్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికవుతారు. ఆయన కుమారుడు కేటీఆర్ ను పార్టీ తెలంగాణ అధ్యక్షునిగాను, తదనంతరం ముఖ్యమంత్రి గానూ గెలిపించవచ్చు.

ఇదిలా వుండగా, మరో పక్కన పార్టీల గెలుపోటములపట్ల జాతకాలు చెప్తూ ప్రశాంత్ కిశోర్ తెరపైకి వచ్చారు. ఆయన అంచనాలు ఎంతవరకూ నిజమయ్యాయనేది ప్రజలకు తెలిసిందే. ఇటీవల ఆయన టి.ఆర్.ఎస్ కు కొన్ని జిల్లాల్లో పట్టు పోతుందని బాంబు పేల్చారు. నిజంగా టి.ఆర్.ఎస్. పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత వుందా, తెలంగాణలో కాంగ్రెస్, బి.జె.పి.ల పరిస్థితి ఏంటి ? అనేది తెలియాలంటే 2024 వరకూ ఆగాల్సిందే.