home page

ఈ ఉన్మాది సీఎంగా ఉంటే ఏపికి రాలేనేమో?: రఘురామ

'అభిమానులను హింసించారనే వెనకడుగు వేసా'

 | 
Raghu
ఈ ఉన్మాది సీఎం ఉండగా ఏపీలో అడుగుపెట్టలేనేమో
నన్ను అభిమానించే వారి కోసమే వెనక్కి తగ్గాను
ఎంతోమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఈ ఉన్మాది ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఆంధ్రప్రదేశ్ రాగలనని అనుకోవడం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చి, పోలీసులు ఈ ముఖ్యమంత్రి అదుపు ఆజ్ఞలలో లేనప్పుడే, తాను ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టగలనని భావిస్తున్నట్లు చెప్పారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను ఎందుకు పాల్గొనలేదన్న విషయంపై రఘురామకృష్ణం రాజు వివరణ ఇచ్చారు. ఎంతోమంది తనని అభిమానించి, ప్రేమించే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. ఎంపీని ఏమీ చేయం... కానీ మిమ్మల్ని ఉతికేస్తాం అంటూ తన అభిమానులను పోలీసులు బెదిరించారని చెప్పుకొచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చదువుకునే యువకులను పోలీసుల అదుపులోకి తీసుకుని కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకువెళ్లినట్టు వారి తండ్రి తనకు ఫోన్ చేసి వాపోయారని రఘురామ వెల్లడించారు. చదువుకుని ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లవలసిన వారిపై కేసులు నమోదైతే వారికి భవిష్యత్తు ఇబ్బందులు తప్పవని తాను భావించానన్నారు.
ఒక్కొక్కరుగా తన అభిమానులు, పోలీసులు తమను పెడుతున్న ఇబ్బందులను వివరిస్తూ , ఫోన్లు చేయడంతో ఏమీ చేయాలో పాలు పోక వెనుదిరిగినట్లు తెలిపారు. తనను అభిమానులను పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం ప్రాంతాలలో అదుపులో తీసుకొని పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. తన కారణంగా పోలీసుల చేత చిత్రహింసలకు గురైన వారందరూ తనను క్షమించాలని రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. 
ఎంపీ బ్రతకడానికి వీలులేని పరిస్థితి
దేశంలో ఒక ఎంపీ బ్రతకడానికి వీలులేని పరిస్థితులు నెలకొన్నాయనీ రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సామాన్య పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశం అంతా ఇలాగే ఉందా? అని ప్రశ్నించిన ఆయన... ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అలాగే ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేదన్న ఆయన, ఓటు వేసి అధికారాన్ని కట్టబెట్టినందుకు, మన బ్రతుకులు తాకట్టు పెట్టినట్టు అయిందన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఒక మంచి పని చేశారని, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన పెట్టారని పేర్కొన్నారు. 
 ఎంపీలు అంటే రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే వారిని ప్రజలు అనుకుంటారని కానీ చట్టాలు చేసే ఒక ఎంపీకే సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. సాక్షి దినపత్రిక ప్లానింగ్ లో భాగంగా కొంతమంది పెయిడ్ కళాకారులు, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనవద్దని ఆందోళన నిర్వహించారన్నారు. ఈ వ్యవహారాన్ని పీఎంఓకి నివేదించి, ఆహ్వానితుల జాబితాలో తన పేరు లేకుండా కుట్ర చేసినట్లు స్పష్టమవుతుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
ప్రివలేజ్ హక్కులు... నేతి బీరకాయలో నెయ్యి మాదిరే
పార్లమెంటరీ వ్యవస్థలో ఎంపీల ప్రివలేజీ హక్కులన్నది నేతి బీరకాయలో నెయ్యి అన్న చందం మాదిరిగానే తయారైందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రోటో కాల్ ఉల్లంఘనల పై ఇప్పటికే పది సార్లు లేఖలు రాశాననీ, అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పారు. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అహ్వానితుల జాబితా లో స్థానిక ఎంపీ వివరాల గురించి చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాని దేనని పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమ వేదిక మీద కూర్చునే వారి జాబితాలో తన పేరు ఉండదని సకల శాఖ మంత్రి ముందే చెప్పినట్లు తెలిసిందన్నారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనన ని, బెట్టింగులను కూడా కట్టారని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో తాను పాల్గొనకపోతే తనకు ఎక్కడ అహంకారం ఉందని ప్రధానమంత్రి ఎక్కడ భావిస్తారో నన్న ఆందోళన ఉండేదని, కానీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానితుల జాబితాలోని తన పేరు లేకపోవడంతో ఆ బాధ తొలగిపోయిందన్నారు.
తనకు జరిగిన అన్యాయం దేశంలో ఎవరికీ జరగలేదు
పార్లమెంటరీ లా జస్టిస్, పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యుడినైన తనకు జరిగిన అన్యాయం ఈ దేశంలో ఎవ్వరికీ జరగలేదని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పరిటాల రవీంద్ర, వైయస్ వివేకానంద రెడ్డి హత్యల్లోనూ పోలీసులను వాడారన్న ఆయన, తన ఇంటి వద్ద ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ గా చెప్పుకునే ఒక వ్యక్తిని సోమవారం ఉదయం సిఆర్పిఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతన్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారని వెల్లడించారు. సదరు వ్యక్తిని ఐడి కార్డు అడగగా, ఐడి కార్డ్ తెచ్చుకోలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన, తన హత్యకు పోలీసుల్ని వాడారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.. గతంలోనూ తన ఇంటి వద్ద ఒక వ్యక్తి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా ఇప్పటివరకు దానిపై ఎటువంటి పురోగతి లేదని చెప్పారు. తన ఇంటి వద్ద సిఆర్పిఎఫ్ పోలీసులకు దొరికిపోయిన కానిస్టేబుల్ గురించి, ఇప్పటివరకు ఆంధ్ర పోలీసులు క్లయిం చేయలేదని వెల్లడించారు. సీతారామాంజనేయులు నేతృత్వంలో ఏదో కట్టు కథ చెప్పి అతని తీసుకువెళ్తారేమోనన్న అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. అయినా తన ఇంటి వద్ద ఇంటలిజెన్స్ పోలీసులను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.. తన కదిలికలపై నిఘా పెట్టల్సిన అవసరం ఏమొచ్చిందనీ నిలదీశారు. ఇదే విషయమై తాను కోర్టును కూడా ఆశ్రయించానున్నట్లు తెలిపారు. తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా అని విరుచుక పడ్డారు.
విజయ సాయి తండ్రి చరిత్ర ఇదిగో...
విజయసాయి రెడ్డి తండ్రి సుందర రామిరెడ్డి 1945లోనే తాళ్లపూడి గ్రామంలో సొంత సోదరుడిని, మరొక సోదరునితో కలిసి హత్య చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ హత్యా నేరంలో ఇద్దరికీ ఉరిశిక్ష పడగా, ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందన్నారు.. మైనర్ అయిన సుందరరామిరెడ్డి జైల్లోనే విద్యాభ్యాసం చేశారని తెలిపారు. విజయసాయిరెడ్డి జీన్స్ లోనే క్రిమినల్ మనస్తత్వం ఉన్నదని పేర్కొన్నారు.