జాతీయ గీతంలో 'సింధ్ 'పదం తొలగిస్తే, మేం పాటిస్తాం: సిద్ధిఖీ
మదరసాలలో జాతీయగీతం తప్పనిసరి :యూపి సర్కారు
యూపి ఆదేశాల అమలుకు రంగం సిద్ధం
సింధ్ పదం తొలగించాలని సిఎం యోగికి వినతి
ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్..అన్ని మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని బీజేపీ నేతలు తెలిపారు. అయితే మదర్సాలలో జాతీయ గీతం పాడాలనే విధానంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే మహమ్మదాబాద్ కు చెందిన మౌలానా అన్వర్ హుస్సేన్ సిద్ధిఖీ అనే వ్యక్తి.. ఈ ఉత్తర్వులను స్వీకరిస్తూనే సీఎంకు ఓ విన్నపం చేశారు. జనగణమనలో సింధ్ పదాన్ని తొలగించాలని సీఎంని కోరారు. పాకిస్తాన్ లోని ప్రాంతాన్ని కీర్తిస్తూ జాతీయగీతం ఆలపించలేమని తెలిపారు." జాతీయ గీతంలో సింధ్ అనే పదం ఉంటుంది. ప్రస్తుతం సింధ్ ప్రాంతం పాకిస్తాన్ లో ఉంది. పాక్ తో మన సంబంధాలు చెడిపోయిన వేళ ఆ దేశంలోని సింధ్ ప్రాంతానికి పొగుడుతూ జనగణమన పాడలేము. ప్రభుత్వం ఆ పదాన్ని తొలగిస్తే మేము గర్వంగా జాతీయ గీతం పాడతాం" అని మౌల్వీ సిద్ధిఖీ తెలిపారు. సింధ్ పదాన్ని జాతీయగీతంలో నుంచి తొలగించి, ఆ స్థానంలో వేరే పదాన్ని చేర్చాలని సిద్ధిఖీ డిమాండ్ చేశారు. హిందూ-ముస్లిం, గుడి-మసీద్ లాంటివాటిని మించి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని యోగిని అభ్యర్థించారు మౌల్వీ సిద్ధిఖీ. ప్రభుత్వం ముస్లింల కోసం ఒక్క చుక్క చమట చిందిస్తే.. రాష్ట్రం, దేశం కోసం ముస్లింలు ప్రాణం పెట్టేస్తారని అన్నారు. యోగి ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.
ఇక,వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసిన యోగి ఆదిత్యనాథ్ అంతే దూకుడుగా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే మసీదులపై లౌడ్ స్పీకర్ల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయంటూ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విమర్శలు రావడంతో అన్ని ప్రార్ధనా స్ధలాలపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది యోగి సర్కార్. అయితే ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు కావడం లేదన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి.