మధుర, కాశీలో మసీదు స్థలాలు బలవంతంగా లాక్కుంటే....
బాబ్రీ మసీదు కక్షీదారు హెచ్చరిక
ప్రార్ధనా స్థలాలు చట్టం పరిధిలోనే ఉండాలి
లక్నో: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమికి ఆనుకుని ఉన్న షాహి ఈద్గా మసీదు ను 'బలవంతంగా' లాక్కునే ప్రయత్నం చేస్తే ఆందోళనకు దిగుతామని రామజన్మభూమి బాబ్రీ మసీదు టైటిల్ సూట్స్‌లోని ముస్లిం కక్షిదారుల్లో ఒకరైన హాజీ మెహబూబ్ శుక్రవారంనాడు హెచ్చరించారు.
జ్ఞానవాపి మసీదు, ఈద్గా మసీదు అంశాలపై ఎలాంటి హెచ్చరికలకు తాము లొంగేది లేదని, కాషాయ సంస్థలు వాటిని బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే నిరసనలు తెలుపుతామని, దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభిస్తామని ఆయన అయోధ్యలో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల జ్ఞానవాపి మసీదు, మధురలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ పక్కా వ్యూహంతో చేస్తున్న కుట్రగా ఆయన ఆరోపించారు. ''ముస్లింలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి మాత్రం భయపడేది లేదు. మా హక్కుల కోసం పోరాడతాం'' అని మెహబూబూ అన్నారు. జ్ఞానవాపి మసీదులో శివలింగంగా చెబుతున్న వస్తువు నిజానికి ఒక ఫౌంటైన్ అని ఆయన చెప్పారు.