home page

2024 ఎన్నికలకు ముందే బిజెపి ఉమ్మడి పౌర స్మృతి చట్టం తెస్తే..

అయిదుగురు ముఖ్యమంత్రుల నోట అదే మాట

 | 
Uniform civil code

అస్సాం తో ప్రారంభం అయింది-ముగింపు ఎక్కుడో?

 

భారతదేశానికి కొత్త రాజకీయ ప్రయోగ శాలగా మార్చన బిజెపి ముస్లిం వ్యతిరేక ప్రచారంలో ముందడుగులో ఉంది. త్రిపుల్ తలాఖ్ తో మొదలు పెట్టింది. ముస్లిం మహిళల స్వావలంబన కోసమే తమ పార్టీ పుట్టినట్లు ప్రచారం చేస్తూ వస్తోంది. కాషాయీకరణ పేరిట విద్యారంగంలో మార్పులు చేర్పులు చేసింది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ మార్పునకు పునాది వేసింది. ఇప్పుడు కొత్త రూపంలో రాజకీయ చదరంగం మొదలు పెట్టింది.

 

దశల వారీగా సివిల్‌ కోడ్‌ అమల్లోకి!

రంగం సిద్ధం చేస్తున్న బీజేపీ

ఉత్తరాఖండ్‌లో ఏకంగా పైలట్‌ ప్రాజెక్టు

ముసాయిదా రూపకల్పనకు కమిటీ

'స్మృతి'పై పది రోజుల కింద అమిత్‌ షా సంకేతం

తాజాగా స్వరం పెంచిన 'కమల' సీఎంలు

ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత

రాజ్యాంగవిరుద్ధమన్న ముస్లిం లా బోర్డు

భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదు ఉమ్మడి పౌరస్మృతితోనే బహుభార్యత్వానికి చెక్‌

అసోం సీఎం హిమంత విశ్వశర్మ

ఉద్యోగాలు, వృద్ధిపై దృష్టి పెట్టండి: ఒవైసీ

న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే దేశమంతటా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌-యూసీసీ)ని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందా..?

అధికార బీజేపీ అందుకు రంగం సిద్ధం చేస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే నిజమేననిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉమ్మడి పౌరస్మృతి అమలుపై సంకేతాలిచ్చారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు రంగంలోకి దిగారు. సివిల్‌ కోడ్‌కు అనుకూలంగా స్వరం పెంచారు. అంతేకాదు.. ఉత్తరాఖండ్‌లో ఏకంగా పైలట్‌ ప్రాజెక్టుగానే చేపట్టబోతున్నారు. దీన్ని దశలవారీగా దేశమంతా అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు, మైనారిటీలు.. ముఖ్యంగా ముస్లింల నుంచి దీనిపై గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి ఉమ్మడి పౌరస్మృతి అనేది బీజేపీ అజెండాలో భాగం. గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోఇదే ప్రధాన ప్రచారాంశం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత నెల 22న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్లో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. 'రామాలయ నిర్మాణం, 370 అధికరణ రద్దు, పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ), ట్రిపుల్‌ తలాక్‌ వంటి సమస్యలను పరిష్కరించేశాం. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి కేంద్రీకరంచాల్సిన తరుణం ఆసన్నమైంది. మొదటగా ఉత్తరాఖండ్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. దానికి ముసాయిదా రూపకల్పన జరుగుతోంది. సమయానుకూలంగా అన్నీ జరుగుతాయి' అని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ రెండోసారి సీఎం కాగానే ఈ ఏడాది మార్చి 25న జరిగిన కేబినెట్‌ తొలి భేటీలో సివిల్‌ కోడ్‌ ముసాయిదా తయారీకి నిపుణుల కమిటీని నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. ఇటీవల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోడ్‌ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ అవతరిస్తుందని చెప్పారు. అయితే ఇప్పటికే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమలవుతుండడం గమనార్హం. కాగా.. సివిల్‌ కోడ్‌ ప్రవేశపెట్టాలని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు యోచిస్తున్నట్లు యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తెలిపారు. 'దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండడం తక్షణావసరం. మనిషికో చట్టం ఉన్న వ్యవస్థ నుంచి అందరం బయటకు రావాలి' అని వ్యాఖ్యానించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ కూడా సివిల్‌ కోడ్‌ అమలు సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రారంభించినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ నేతలు దీనిపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈశాన్య భారతానికీ ఇది విస్తరించింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఢిల్లీలో సీఎం ధామీని కలిశాక మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పౌర స్మృతిని తాను బలంగా సమర్థిస్తున్నట్లు ప్రకటించారు.

మేం అంగీకరించం: పర్సనల్‌ లా బోర్డు

ఉమ్మడి పౌరస్మృతి అమలు యోచనపై అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తీవ్రంగా మండిపడింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, మైనారిటీలకు వ్యతిరేకమని.. ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, సీపీఎం, ఇతర విపక్షాలు కూడా వ్యతిరేకించాయి. బిహార్‌లో పాలక ఎన్‌డీఏ మిత్రపక్షం జేడీయూ సైతం కోడ్‌ను వ్యతిరేకించింది. రాష్ట్రంలో సీఎం నితీశ్‌కుమార్‌ సారథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా జీవిస్తున్నారని.. దీని అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదని జేడీయూ పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌ ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్థిక సంక్షోభం, విద్యుత్‌ కొరత, నిరుద్యోగం వంటి సమస్యలు ఉండగా.. సివిల్‌ కోడ్‌పై మక్కువెందుకని ధ్వజమెత్తారు. ఆదేశిక సూత్రాల్లో సంపూర్ణ మద్య నిషేధం గురించి కూడా చెప్పారని, దాని సంగతేంటని ప్రశ్నించారు. ఏమిటీ ఉమ్మడి పౌరస్మృతి?రాజ్యాంగంలోని 44వ అధికరణ ఉమ్మడి పౌరస్మృతి గురించి చెబుతోంది. మతాలు, కులాలు, లింగభేదాలకు అతీతంగా అందరికీ సమానంగా ఒకటే చట్టం ఉండాలని సూచిస్తోంది. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యవహారాల్లో ఉమ్మడిగా అందరికీ ఒకే విధమైన చట్టాలు అమలు కావాలని పేర్కొంటోంది. 2015లో సుప్రీంకోర్టు కూడా దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. ఆదేశిక సూత్రాల్లో సైతం దీనిని అమలు చేయాలని ఉందని సమర్థకులు అంటారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో.. ముఖ్యంగా నాగాలాండ్‌, మిజోరంలో గిరిజన సంప్రదాయాలు అమల్లో ఉన్నాయని, అక్కడ ఉమ్మడి పౌర స్మృతి ఎలా సాధ్యమన్న వాదన వినపడుతోంది.

భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదు: హిమంత

దేశవ్యాప్తంగా తక్షణం ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలు చేయాల్సిన అవసరం అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ అన్నారు. తన భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదని, బహుభార్యత్వం సమస్యకు ఉమ్మడి పౌరస్మృతితోనే పరిష్కారం దొరుకుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడారు. ''నేను కలిసిన ముస్లింలందరూ యూసీసీ అమలు చేయాలని కోరారు. ముస్లిం మహిళలకు సమాజంలో తగిన గౌరవం దక్కాలంటే యూసీసీని అమలు చేయాల్సిందే. నాకు, నా కుటుంబ సభ్యులకు యూసీసీ ఉంటే, ముస్లిం మహిళలకూ ఉండాల్సిందే. అప్పుడే వారికి రక్షణ'' అని హిమంత వ్యాఖ్యానించారు. కాగా యూసీసీ అంశంపై మజ్లిస్‌ చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విలేకరుల సమావేశంలో స్పందించారు. ''యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక వృద్ధి పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇటువంటి సమస్యలపై ముందు దృష్టి పెట్టండి. యూసీసీపై కాదు'' అని ఒవైసీ సూచించారు. అలాగే గోవాలో హిందూ మహిళ 30 ఏళ్ల వరకు మగబిడ్డకు జన్మ ఇవ్వకపోతే, ఆమె భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు గోవా సివిల్‌ కోడ్‌ అనుమతి ఇస్తుందని, దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ఒవైసీ ప్రశ్నించారు.