ప్రాంతీయ పార్టీలదే హవా!
కాంగ్రెస్ పార్టీ కి అంత సీను లేదు: రీజనల్ పార్టీలు
- బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేనే లేదు
- కాషాయదళం ఆగడాలకు కాంగ్రెసే కారణం
- దేశంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవా
- ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం
- కాంగ్రెస్ స్థితి అర్థం చేసుకోవాలి: జేడీ(ఎస్)
- మాతో కలిసి పనిచేస్తూ ఇదేంమాట?: జేఎంఎం
- లోక్‌సభలో కొట్లాట ప్రాంతీయ పార్టీలదే: ఆర్జేడీ
హైదరాబాద్: 'ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదుర్కొనలేవు
ఆ పార్టీలకు అందుకు అవసరమైన ఐడియాలజీ లేదు' అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రాంతీయ పార్టీలు రగిలిపోతున్నాయి. పలు రాష్ర్టాల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న పార్టీలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. దేశంలో ఈ పరిస్థితికి కాంగ్రెస్ విధానాలే ప్రధాన కారణమని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల చేతగాని తనమే.. దేశంలో బీజేపీ విశృంఖలానికి కారణమని మండిపడుతున్నాయి. వాస్తవంగా బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఏ మాత్రం లేదని ప్రాంతీయ పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇకపై దేశంలో బీజేపీపై పోరులో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర అని, కాంగ్రెస్ వాటి వెంట నడవాల్సిందేనని అంటున్నారు.
కాంగ్రెస్‌కు కాలం చెల్లినట్టేనని, పుంజుకోవడం కష్టమేనని తేల్చిచెప్తున్నారు. దేశంలో మెజారిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఉనికి లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పలు రాష్ర్టాల్లో కనీసం పోరాడే స్థితిలో కూడా కాంగ్రెస్ లేకపోవడం గమనార్హం. రాష్ర్టాల్లో అయినా, దేశంలో అయినా ప్రాంతీయ పార్టీల అండ లేకుండా కాంగ్రెస్‌కి అధికారం సాధ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. యూపీఏ హయాంలో కేంద్రంలో పదేండ్ల పాటు ప్రాంతీయ పార్టీల అండతోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చురకలేస్తున్నారు. ఇప్పటికీ పలు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి అధికారం పంచుకొంటున్న కాంగ్రెస్..మరికొన్ని రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తున్నది.
ప్రాంతీయ పార్టీల హవా
వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. జాతీయ పార్టీగా చెప్పుకొంటున్న కాంగ్రెస్.. కేంద్రంలో సంగతి పక్కన పెడితే రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొలేని దుస్థితికి చేరుకొన్నది. ఈ నేపథ్యంలో కొన్నేండ్లుగా దేశంలో ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతున్నది. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారుతున్నాయి. బలమైన నాయకుడిగా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్నది. దేశానికి నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలు సీఎం కేసీఆర్‌లో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కూటమిగా ఏర్పడి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ సాధించిన ఓట్ల (37.5% ) కంటే ప్రాంతీయ పార్టీలు సాధించిన ఓట్లు (44%) అధికం. కాంగ్రెస్ సాధించింది కేవలం 19.5% మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 301, కాంగ్రెస్ సాధించిన 53 సీట్లను మినహాయిస్తే మిగిలిన పార్టీలు, ప్రాంతీయ శక్తులు కలిసి సాధించిన సీట్లు దాదాపు 190 వరకు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ముఖాముఖి తలపడ్డ గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీని కాంగ్రెస్ ఏమాత్రం నిలువరించలేకపోయింది. ఈ రాష్ర్టాల్లో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. అత్యధిక సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ లాంటి రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ను ఎవరూ బాగుచేసే పరిస్థితి లేదు. ఇక్కడే తేలిపోతున్నది బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ సత్తా ఏమిటో? ప్రాంతీయ శక్తుల దమ్ము ఎంతో?
కాంగ్రెస్ పరిస్థితేమిటో రాహుల్‌గాంధీ అర్థం చేసుకోవాలి
కాంగ్రెస్‌కు అనేక రాష్ర్టాల్లో అడ్రస్ లేదు. పోటీ పడే పరిస్థితులో కూడా లేదు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ అర్థం చేసుకుంటే మంచిది. కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీల ఫోబియా పట్టుకొన్నది. ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదనే విషయం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలియలేదా? బీజేపీని సొంతంగా ఎదుర్కోగలమని గప్పాలు పలుకుతున్న కాంగ్రెస్.. గతంలో ప్రాంతీయ పార్టీల బలంతోనే పదేండ్లు అధికారంలో ఉన్నది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే ప్రాంతీయ పార్టీల విలువ, వాటికున్న ఐడియాలజీ అర్థమవుతుంది.
– హెచ్‌డీ కుమారస్వామి, జేడీ (ఎస్)నేత
ఐడియాలజీ లేదు కాబట్టే.. ప్రభుత్వంలో ఉన్నారా?
ప్రాంతీయ పార్టీలతో కలిసి అధికారం పంచుకోవచ్చు. కానీ ఆ పార్టీలకు ఐడియాలజీ లేదనడం ఏమిటో..? జార్ఖండ్‌లో కాంగ్రెస్ మాతో కలిసి ప్రభుత్వంలో ఉన్నది. కానీ రాహుల్‌గాంధీ ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదంటున్నారు. మాకు స్ట్రాంగ్ ఐడియాలజీ ఉన్నది కాబట్టే ప్రభుత్వంలో ఉన్నాం.
– సుప్రియో భట్టాచార్య, జేఎంఎం
లోక్‌స్‌భలో బీజేపీని ఎదుర్కొంటున్నది ప్రాంతీయ పార్టీలే
బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉన్నదని రాహుల్‌గాంధీ చెప్తున్నారు. ఇప్పుడు లోక్‌సభలో ఎక్కువ బలం ఉన్న ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్నాయి. ఇది చాలదా..? బీజేపీని ఎదుర్కొనే సత్తా ఎవరికున్నదో చెప్పడానికి? రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఆ పార్టీలకు ఐడియాలజీ లేనప్పుడు ఎందుకు కలిసి పని చేస్తున్నారో చెప్పాలి. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు వింతగా, అనాలోచితంగా ఉన్నాయి.
– మనోజ్‌కుమార్ ఝా, ఆర్జేడీ
.