home page

ఒక్క అవకాశం ఇవ్వండి: కేజ్రీవాల్

గుజరాత్ లో పర్యటన లో ప్రజలకు పిలుపు

 | 
Kejriwal

భరూచ్: మరికొన్ని నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే రంగంలోకి దిగారు. గుజరాత్ లో సుపరిపాలన అందిస్తానని,  ఓ అవకాశం ఇవ్వాలని కోరారు.  

పంజాబ్‌లో 'ఆప్' ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ఢిల్లీ సీఎం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కర్నాటక,గుజరాత్‌పై కేజ్రీ వాల్ దృష్టిసారించారు.

భరూచ్‌లో ఆదివారం నిర్వహించిన ఆదివాసీ సంకల్ప్ మహాసమ్మేళన్‌లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గుజరాత్ విషయంలో తమ పార్టీ ఆందోళన చెందాల్సిందేమీ లేదని బీజేపీ నేత ఒకరు చెప్పారని, కానీ తాను ఆరున్నర కోట్ల మంది గుజరాత్ ప్రజలకు చెబుతున్నానని, బీజేపీ దురహంకారానికి బ్రేక్ వేద్దామని అన్నారు. ఈసారి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తమ ప్రభుత్వ పనితీరు నచ్చకుంటే ఆ తర్వాతి ఎన్నికల్లో తనను తరిమి కొట్టాలని కేజ్రీవాల్ అన్నారు. తాను చాలా నిజాయతీపరుడినని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. వీరు తనపై ఎన్నో ఎంక్వైరీలు వేసినా ఏమీ కనుగొనలేకపోయారని బీజేపీని ఉద్దేశించి అన్నారు.

గుజరాత్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న ఊహాగానాలపై ఢిల్లీ సీఎం స్పందిస్తూ.. తన చెవిన కూడా ఈ వార్తలు పడ్డాయని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని చూసి బీజేపీ భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించారు. తమకు ఎలాంటి సమయం ఇవ్వకుండా దెబ్బకొట్టాలని అనుకుంటోందని అన్నారు. డిసెంబరు వరకు తమకు సమయం ఇస్తే పూర్తి మెజారిటీ వస్తుందని వారు భావిస్తున్నారని అన్నారు. అయితే, భగవంతుడు తమతోనే ఉన్నాడని, ఎన్నికలు ఇప్పుడు నిర్వహించినా, ఆరు నెలల తర్వాత జరిపినా తామే గెలుస్తామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.