home page

జూలై 1నుంచి కొత్త చట్టాలు రోజుకు 12గంటల పనివిధానం

కార్మికులకు అందీ అందని చట్టాలు 

 | 
Labour laws
 దేశంలో కొత్త కార్మిక చట్టాలను వచ్చే నెల 1 నుంచే ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది. ఒక వేళ ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల పని వేళలు, ఉద్యోగుల ఈపీఎఫ్ వాటా, అన్ని కటింగులు పోగా వారి చేతికి అందే వేతనం వంటి అంశాల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి.

కార్యాలయాల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పనిచేసి, మిగతా మూడు రోజులు సెలవులు (వీక్ ఆఫ్‌లు) పొందే అవకాశం ఉంది. అయితే, వారం రోజుల్లో చేసే పని గంటల్లో మాత్రం మార్పులు లేవు.

అంటే, ఉద్యోగి రోజుకు 10-12 గంటలు కూడాకార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. వారం రోజుల్లో ఉద్యోగులు చేయాల్సిన పని గంటలను తగ్గిస్తున్నట్లు కొత్త చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనలేదు. దీంతో వారానికి మూడు సెలవులు కావాలనుకుంటే మిగిలిన నాలుగు రోజులు దాదాపు 12 గంటల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రతి త్రైమాసికంలో ఓవర్‌టైమ్ పని గంటల గరిష్ఠ పరిమితి 125 గంటలకు పెంచనున్నారు. ప్రస్తుతం గరిష్ఠంగా 50 గంటలు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది

కొత్త కార్మిక చట్టాల ద్వారా రాబోతున్న మరో కీలక మార్పు ఏంటంటే.. ఉద్యోగి స్థూల (గ్రాస్) వేతనంలో మూల వేతనం (బేసిక్ సాలరీ) 50 శాతం ఉండాలి. దీంతో ఉద్యోగి, యాజమాన్య పీఎఫ్ వాటా పెరుగుతుంది. వేతనంలో అన్ని కోతలు పోగా ఉద్యోగికి చేతికి వచ్చే జీతం మరింత తగ్గుతుంది. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి చేతికి వచ్చే వేతనం తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగికి అందే నగదు పెరుగుతుంది. దీంతో పదవీ విరమణ చేసిన అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారు జీవించవచ్చని కేంద్ర సర్కారు భావిస్తోంది.

ఉద్యోగుల సెలవుల నిబంధనలనూ హేతుబద్ధీకరించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. సంవత్సరంలో ఉద్యోగికి ఉండే సెలవుల విషయంలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏదైనా సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు ఆర్జిత సెలవులు వంటివి పొందాలంటే ప్రస్తుతం 240 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆర్జిత సెలవులు పొందగలుగుతారు. అయితే, కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు ఉద్యోగి సంస్థలో చేరిన 180 రోజుల తర్వాతి నుంచి ఆర్జిత సెలవులు పొందవచ్చు.

అలాగే, ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోం)కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. కాగా, కేంద్రం కార్మిక చట్టాలను నాలుగు కోడ్ (సంహిత)లుగా విభజించింది. అవి.. వేతన కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, కార్యాలయాల్లో వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన కోడ్, సామాజిక భద్రత కోడ్. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు ఈ కోడ్‌ల కింద నబంధనలను రూపొందించాయి. వాటిని పార్లమెంటు కూడా ఆమోదించింది.