home page

ఉచితాలు అనవసరం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక లో  వెల్లడి

 | 

రాష్ట్రాల ప్రాధాన్యత లను మార్చుకునే వీలుంది

రాష్ట్రాలు ప్రాధాన్యాలు మార్చుకోవాలన్న నివేదిక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: ''రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదు. ఉచిత పథకాలు ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం మనకూ తప్పదు'' ..అంటూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రధానితో భేటీలో ఆందోళన వ్యక్తం చేసి పదిహేను రోజులైనా కాలేదు.. తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇదే తరహాలో నివేదిక ఇచ్చింది. రాష్ట్రాలు ప్రకటిస్తున్న పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, వ్యవసాయ రుణమాఫీ వంటి ఆర్థికంగా అలివిగాని హామీలు అందోళన కలిగిస్తున్నాయని అందులో పేర్కొంది. ఎస్‌బీఐ తన నివేదికలో తెలంగాణను ఉదాహరణగా తీసుకుని ప్రస్తావించడం గమనార్హం.

తెలంగాణ రెవెన్యూ ఆదాయంలో 35 శాతం మేర జనాకర్షక పథకాలకే ఖర్చవుతోందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఇది ఎక్కువ కాలం సాధ్యం కాదని.. ఆర్థిక విపత్తుకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒక్క తెలంగాణే కాదు.. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాలు తమ రెవెన్యూ ఆదాయంలో 5 నుంచి 19 శాతం దాకా ఉచిత/జనాకర్షక పథకాలకే ఖర్చు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల సొంత పన్ను ఆదాయాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఆ ఖర్చు ఏకంగా 63 శాతం దాకా కూడా ఉంటున్నట్టు ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది.

కొన్ని సందర్భాల్లో కేంద్రం నుంచి వచ్చే జీఎస్టీ ఆదాయం పలు రాష్ట్రాల పన్ను ఆదాయంలో ఐదో వంతు దాకా ఉంటోందని.. దాంట్లో అధిక భాగం ఉచితాలకే ఖర్చవుతోందని ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతిఘోష్‌ పేర్కొన్నారు. కాగా.. 2017లో పాత పన్ను విధానం నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానానికి మారినందుకుగాను అప్పట్నుంచీ రాష్ట్రాలకు కేంద్రం 'జీఎస్టీ పరిహారం' ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ విధానం ఈ ఏడాది జూన్‌తో ముగుస్తున్నందున.. రాష్ట్రాలు తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా ఖర్చుకు సంబంధించిన ప్రాధాన్యాలను హేతుబద్ధీకరించుకోవాలని ఎస్‌బీఐ నివేదిక సూచించింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని.. సవరించిన అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 18 రాష్ట్రాల సగటు ఆర్థికలోటు 50 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4 శాతాన్ని దాటినట్టు పేర్కొంది. జీఎ్‌సడీపీలో నాలుగు శాతానికి పైగా ఆర్థిక లోటుతో.. ఆరు రాష్ట్రాల పరిస్థితి ప్రమాదం అంచున ఉన్నట్టు హెచ్చరించింది. అలాగే.. ఏడు రాష్ట్రాల ఆర్థికలోటు వాటి బడ్జెట్‌ లక్ష్యాలను మించిపోగా.. 11 రాష్ట్రాలు మాత్రం ఆర్థికలోటును బడ్జెట్‌ లక్ష్యాలకు దిగువన లేదా సమానంగా ఉంచగలిగినట్టు ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, అసోం, బిహార్‌ రాష్ట్రాలు బడ్జెట్‌ అంచనాలకు మించి ఆర్థికలోటును ఎదుర్కొంటున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో.. ఏపీ, అసోం, గుజరాత్‌, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు జీఎ్‌సడీపీ వృద్ధిని.. స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ) కన్నా ఎక్కువగా చూపుతున్నట్టు పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న గణాంకాల మధ్య తేడాల గురించి ప్రస్తావించింది. 17 రాష్ట్రాల జీఎ్‌సడీపీ జీడీపీ కన్నా ఎక్కువగా ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే, ఇలాంటి తేడాలు గతంలోనూ ఉండేవని అభిప్రాయపడింది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇచ్చే విధానాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాల్సిందిగా పలు రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నట్టు నివేదికలో వెల్లడించింది.