home page

ఫోర్త్ ఎస్టేట్ వారియర్ గోయెంకా

రాంనాధ్ గోయెంకా జయంతి నేడు

 | 
Ramnath goenka

Journalisn of courage is the tag line of this tiger. Never compromised

పత్రికే పుత్రిక!

మీ తాతకి..
అమ్మకే దిక్కు లేదు
నువ్వెంత..
ఇలా దేశాధినేతనే
ధిక్కరించిన ధీరోదాత్తుడు..
విధాత రాతల కంటే  ఖచ్చితంగా 
వార్తలను సంధించిన 
విలుకాడు
మేతగాళ్లకు కీలెరిగి
వాతలు పెట్టి 
వారి తలరాతలనే మార్చిన 
గజ ఈతగాడు..
రామనాథ నామధేయుడతడు
కలమే బాణమై..
నిజాయితీ ప్రాణమై..
అవినీతిని ఏరిపారేయడమే
తెలిసిన కోణమై..!

పుట్టుకతో పాత్రికేయుడు కాదు
కాని ఎందరో 
పాత్రికేయులకు 
ఆయన నీడే పుట్టుక..
ఆంధ్రలో ప్రభవించి..
దినమణిగా ప్రకాశించి
ఇండియాలో ఎక్స్ప్రెస్ లా 
దూసుకెళ్లి..
భారతీయ జర్నలిజం 
పితామహుడై..
దేశంలోనే పేరెన్నికగన్న మహామహుడై..
వెలుగొందిన కలం వీరుడు..
సిద్ధాంతాల శూరుడు!

అవి అక్షరాలా..
అక్షరాల అణుబాంబులు..
దినపత్రికలా..ఘనపత్రికలు..
గోయంకా మానస పుత్రికలు..
అవినీతిపై ఎక్కుపెట్టిన అస్త్రాలు..
రామనాధుని అమ్ములపొది నుంచి దూసుకొచ్చిన శస్త్రాలు
జాతి  చరితను 
పొదువుకున్న దస్త్రాలు..
భావి తరాలు చదివి 
నేర్చుకోదగిన శాస్త్రాలు..!

అవినీతిని సహించని కలం
వేధింపులకు వెరవని విధం..
తెలిసింది రాయడమే నైజం..
అది ఎప్పుడూ నిజం..
మరదే..గోయెంకా మార్కు జర్నలిజం..!

బోఫోర్స్ గన్నుపైనా ఎక్కుపెట్టిన గన్ను..
సాక్ష్యమే లక్ష్యమై 
స్విట్జర్లాండుకూ చేరిన కన్ను
రాసే వాడికి దన్ను..
వార్నింగిచ్చినది రాజీవైనా
చూపని వెన్ను..
అదే..అదే..రామనాధుని తీరుతెన్ను..!
కక్షతో కార్యాలయాలపై దాడులు చేసినా..
హస్తినలో బీగాలే వేయించినా
తెల్లారేపాటికి విహంగాల్లో పత్రికలు..
రాజకీయుల గావుకేకలు..
హాట్ కేకులు..!

గోయెంకా 
ఒక చరిత..
నిబద్ధత.. సంబద్ధత..
సచ్చీలత..పారదర్శకత..
ప్రజాసంక్షేమం..
ఉద్యోగుల క్షేమం..
ఇహమై పరమై..
బతికి ఉండగనే పరమాత్మై..
జర్నలిజానికి తానే జీవాత్మై..!

నాలాంటి ఎందరో జర్నలిస్టులకు

అన్నదాత..ఉద్యోగ ప్రదాత...

పాత్రికేయ జాతిపిత..
స్ఫూర్తిదాత...
ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు
రామనాధ్ గోయంకా జయంతి సందర్భంగా 
నివాళి అర్పిస్తూ..
    
 ఎలిశెట్టి సురేష్ కుమార్