home page

ఏపి ధార్మిక పరిషత్ ఏర్పాటు

సిజీఎఫ్ లో మరో ముగ్గురు సభ్యులు

 | 
Kottu

*అమరావతి:

రూ.25 లక్షల నుండి  కోటి వరకూ ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్టు బోర్డులను ఈ ధార్మిక పరిషత్ ద్వారానే ఏర్పాటు చేయాల్సి ఉంది

పరిమితి లేకుండా సంతృప్తికర స్థాయిలో ధూప దీప నైవేద్య పథకం అమలుకు చర్యలు

ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో అపరిష్కృతంగా ఉన్న  కేసుల సత్వర పరిష్కారానికి  8 మంది అమీనాలను అడిగేందుకు హైకోర్టుకు ప్రతిపాదనలు.
                                                                                                                                                                                   ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ 21 మంది సభ్యులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జి.ఓ.ఎంఎస్.నెం.571 ను ఈ నెల 13 న జారీచేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి చైర్మన్ గాను, దేవాదాయ శాఖ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మరో 18 మంది సభ్యులుగా ఈ ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ధార్మిక పరిషత్ కు విశేష అధికారాలు ఉన్నాయన్నారు. రూ.25 లక్షల లోపు మరియు కోటి పైబడి ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్టు బోర్డులను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే రూ. 25 లక్షల నుండి కోటి  వరకూ ఆధాయం ఉన్న  దేవాలయాలకు ట్రస్టు బోర్డులను  ఈ ధార్మిక పరిషత్ ద్వారానే ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. దేవాలయాల్లో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు మరియు అవినీతికి, అక్రమాలకు పాల్పడే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం,  వారి స్థానంలో మరొకరిని నియమించే అధికారం ఈ ధార్మిక పరిషత్ కు  ఉందన్నారు.  అదే విధంగా  దేవాదాయ, ధర్మాధాయ శాఖ భూములు, ఆస్తులను 11 సంవత్సరాలకు పైబడి లీజును విస్తరించే అధికారం  కూడా ఈ ధార్మిక పరిషత్ కే ఉందని ఆయన తెలిపారు. 

సి.జి.ఎఫ్. కమిటీలో మరో ముగ్గురుకి అవకాశం
సి.జి.ఎఫ్. (కామన్ గుడ్ ఫండ్) కమిటీలో మరో ముగ్గురు సభ్యులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  జి.ఓ.ఎంఎస్.నెం.572 ను ఈ నెల 16 న జారీచేసినట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి చైర్మన్ గాను, దేవాదాయ శాఖ కమిషనర్ సెక్రటరీ & ట్రజరర్ గాను, రెవిన్యూ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ అధికారి సభ్యులుగా ను ఈ కమిటీ ఇప్పటి వరకూ పనిచేస్తున్నదన్నారు.  అయితే ఈ కమిటీలో మరో ముగ్గురు సభ్యులకు ప్రభుత్వం  అవకాశం కల్పించడంతో మొత్తం ఏడుగురు సభ్యులతో ఇకపై ఈ కమిటీ  పనిచేస్తుందన్నారు. ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ కలికి కోదండ రామిరెడ్డి, విశాఖజిల్లా జి.యండాడకు చెందిన  మలిరెడ్డి వెంకట అప్పారావు మరియు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన  కర్రి భాస్కరరావు ను  ఈ  కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించిందని ఆయన తెలిపారు.

సి.జి.ఎప్.కమిటీ పరిధిలోని దేవాలయాల అభివృద్దికి చర్యలు తీసుకోవడంతోపాటు   పలు  దేవాలయాలను ధూప దీప నైవేద్య పథకం క్రిందకు తీసుకువచ్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. అర్హత ఉన్న దేవాలయాలకు పరిమితి లేకుండా సంతృప్తికర స్థాయిలో ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అదేశించారని, వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయానన్నాఈ పథకం క్రిందకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  ఈ పథకం క్రింద  రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1500 దేవాలయాలు ఉన్నాయని మరో 3500 ధరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే అధికారులు ఇప్పటి వరకూ 2,346 ధరఖాస్తులను పరిశీలించి వాటిలో దాదాపు 2200 ధరఖాస్తులు ఈ పథకం మంజూరీకి అర్హత ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 

*ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు….*  
ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో దాదాపు 4,708 కేసులు దీర్ఝకాలికంగా అపరిష్కృతంగా  ఉన్నాయని, అయితే వాటిలో ఇప్పటి వరకూ 722 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన కేసుల పరిష్కారానికి స్థానిక పరిస్థితులు సహకరించడంలేదని, చట్టంలోని లొసుగులు గూడా అందుకు అడ్డంకిగా నిలిచాయని మంత్రి తెలిపారు.  వీటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన 8 మంది అమీనాలను కేటాయించాల్సినదిగా  గౌరవ హైకోర్టును కోరేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ 8 మంది అమీనాలను గౌరవ హైకోర్టు కేటాయిస్తే సాధ్యమైనంత త్వరగా కేసులు అన్నింటినీ పరిష్కరించే అవకాశం ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. అదే విధంగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసులను ఎప్పటి కప్పుడు మానిటర్ చేసేందుకు ఒక అఫీషియల్ వెబ్ సైట్ ను కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు .

ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు
రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో టి.టి.డి తరహాలో అన్నిరకాల సేవలను ఆన్ లైన్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా శ్రీశైలం దేవాలయంలో అమలు పర్చడం జరిగిందని, అదే విధానాన్ని అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో ప్రసాదాల తయారీ
దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో ప్రసాదాలు తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.  ఇటు వంటి విధానాన్ని ఇప్పటికే  టి.టి.డి. అనుసరిస్తున్నదని, అదే విధానాన్ని రాష్ట్రంలోకూడా అమలు పర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.  ఎ.పి. మార్కుఫెడ్ ద్వారా సేంద్రీయ వ్యవసాయ ఉత్పతులను సేకరించి దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.