home page

పాలనవేరు, పార్లమెంటులో సంఖ్యా బలం వేరు

ఢిల్లీ లో ఖాన్ మార్కెట్ ప్రత్యేక వేరు

 | 
Bjp

నైతికత లోపించిన అధికారం
పార్లమెంటులో సంఖ్యాబలం అధికారంలో ఒక రూపం మాత్రమే. 

అధికారం అనేది పౌర సమాజంలో, భావజాల రంగంలో, సంస్కృతిలో కూడా ఇమిడి ఉంటుంది. విస్తారమైన పౌర సమాజాన్ని బీజేపీ నియంత్రించలేకపోతున్నది. అదే ఆ పార్టీ అసహనానికి కారణం. ఖాన్‌ మార్కెట్‌ అనేది ఢిల్లీలో ఉన్నతవర్గాలు వెళ్లే షాపింగ్‌ కాంప్లెక్స్‌. తన రాజకీయ ప్రత్యర్థులను మోదీ ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్స్‌ అని అభివర్ణించడానికి కారణం- ఆ వర్గాలు ఇప్పటికీ బీజేపీ నియంత్రణలో లేవు.

బీజేపీకి సంఖ్యాబలం ఉన్నది. అయినంతమాత్రాన ప్రజా బాహుళ్య సమ్మతి లభించదు. రాజకీయ సమాజంపై బీజేపీకి నియంత్రణ ఉన్నది. కానీ పౌర సమాజంపై ఉన్నదా? లేదనవచ్చు. తన అనుకూల భావనను, నైతిక, మేధోపర ఆధిపత్యాన్ని సాధించేవరకు బీజేపీ బలప్రయోగం ద్వారా పాలనను కొనసాగిస్తూనే ఉంటుంది.

బీజేపీ తన అభీష్టాన్ని ప్రజలపైన, బృందాలపైన, వ్యవస్థలపైన రుద్దగలదు. రాష్ట్ర ప్రభుత్వాలను, వ్యాపారాలను అస్థిరపరచగలదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ ఆదాయపన్ను శాఖ ద్వారా వ్యక్తులను సంస్థలను వేధించవచ్చు. బీజేపీ ప్రభుత్వం ఈ పనిని తరచూ చేస్తూనే ఉన్నది. శాసన, కార్యనిర్వాహక శాఖలు బీజేపీతో మమేకమై ఉన్నాయి. కానీ న్యాయవ్యవస్థ, మీడియా బీజేపీకి భిన్నంగా వ్యవహరించలేకపోతున్నాయి. అయితే ఇదంతా ఒక కోణం మాత్రమే.

అధికారం, ఆధిపత్యం వేర్వేరు. న్యాయబద్ధమైన ఆధిపత్యానికి, బలప్రయోగంతో కూడిన అధికారానికి గల తేడాను బీజేపీ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నది. ‘చట్టబద్ధమైన అధికారం అంటే, బలాన్ని ప్రయోగించేవారు దాన్ని న్యాయబద్ధమని భావిస్తారు. ఎవరిపై ప్రయోగిస్తారో వారు కూడా దానిని సరైందనే అనుకుంటారు’- అని ఆధునిక సామాజిక శాస్ర్తానికి పునాది వేసినవారిలో ఒకరైన మాక్స్‌ వెబర్‌ అన్నారు. అధికారం అంటే ఒక వ్యక్తి లేదా బృందం తమ లక్ష్యాలను సాధించడానికి ఇతరుల అడ్డంకుల మధ్య ఉపయోగించేది. ఇతరుల సమ్మతితో నిమిత్తం లేకుండా అపరిమిత అధికారాన్ని ప్రయోగించడమే బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న పని. ఇది ప్రజలు తమ సమ్మతితో ప్రభుత్వ ఆదేశాలను ఆచరించడం కాదు. జనాకర్షణ గల నాయకులు లేదా వారి భావజాలం మూలంగా కూడా ప్రజలు లేదా సంస్థలు తమ సమ్మతిని కలిగి ఉండవచ్చు. జనాకర్షణ గల నాయకుడు మోదీ ప్రధానిగా ఉన్నప్పటికీ బీజేపీ తమ నిర్ణయాల అమలుకు బలప్రయోగాన్ని ఆశ్రయించవలసి వస్తున్నది. ఇది బలహీనతను సూచిస్తున్నదే తప్ప శక్తిని కాదు.

ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే నెహ్రూ, ఇందిరాగాంధీ అధికారాన్ని, ఆధిపత్యాన్ని పోల్చిచూడాలి. నెహ్రూకు ఆధిపత్యం, న్యాయబద్ధమైన అధికారం రెండూ ఉన్నాయి. ఈ సంపూర్ణ అధికారం ఆయనను, కాంగ్రెస్‌ పార్టీని అత్యంత శక్తిమంతంగా మార్చాయి. నెహ్రూ హయాంలో ప్రభుత్వం తమ నిర్ణయాలను, భావాలను అమలుచేయడానికి బలప్రయోగాన్ని అతి పరిమితస్థాయిలో చేసింది. హైదరాబాద్‌ రాజ్యంపై పోలీసు చర్య, ఈశాన్యంలో వేర్పాటువాదాన్ని నిర్మూలించడానికి సైనిక చర్య వంటి కొన్ని ఉదంతాలను మినహాయిస్తే, నెహ్రూ పాలన ఎక్కువగా ప్రజల సమ్మతితో సాగిందనీ, బలప్రయోగం తక్కువని చెప్పవచ్చు. కానీ ఇందిరాగాంధీ పాలనను ఈ విధమైనదిగా చెప్పలేం. ఇందిరాగాంధీ 1971 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ (352 సీట్లు) సాధించారు.

ఇంత మెజారిటీ, పార్టీలో ఎదురులేని స్థాయి ఉన్నప్పటికీ, ఆమె ఆధిపత్యం బలహీనపడింది. బలప్రయోగం తరచూ జరుగుతూ, చివరికి ఎమర్జెన్సీకి దారితీసింది. తదుపరి ఎన్నికల్లో తన జనాకర్షణను కోల్పోయారు. ఇదే సూత్రం ఆమె కుమారుడు, లోక్‌సభలో 4 వందలకు పైగా సీట్లు తెచ్చుకున్న రాజీవ్‌గాంధీకి కూడా వర్తిస్తుంది. ఆయనకు సంపూర్ణ రాజకీయ అధికారం లభించింది, కానీ అదంతా నీరుగారిపోయింది. షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆయన బుల్‌డోజ్‌ చేశారు. శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపారు. అయోధ్య వివాదాస్పద కట్టడం గేట్లు తెరువడానికి అనుమతించారు. ఈ ఉదంతాల వల్ల తెలుస్తున్నదేమంటే- ఇందిరాగాంధీకి, రాజీవ్‌కు లోక్‌సభలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ, పలు రాష్ర్టాలు వారి పట్టులో ఉన్నప్పటికీ, నిరంతరం సాఫీగా పాలించడానికి నైతికశక్తి కానీ, సమ్మతి కానీ వారికి లేదు.

బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రంతో పాటు రాష్ర్టాలు భారీగా అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బుల్‌డోజర్‌ బల ప్రయోగానికి ప్రతీక. బుల్‌డోజర్‌ను వాడటమనేది ప్రభుత్వానికి ప్రజల ఆమోదం లేదని వెల్లడిస్తున్నది. భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరించడం రాజ్యాధికారానికి నిదర్శనం. కానీ ఈ చర్య ప్రభుత్వం పట్ల పౌరుల అయిష్టతను వెల్లడిస్తుంది. ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా హింసాయుత నిరసనలలో పాల్గొన్నవారు సాయుధ దళాలలో చేరికకు అనర్హులవుతారని ప్రకటించడం వల్ల నిరసనలు ప్రస్తుతానికి చల్లారి ఉండవచ్చు. కానీ ఇది పౌరులను హేతుబద్ధంగా ఒప్పించలేకపోవడాన్ని సూచిస్తున్నది. విద్యార్థులు హిజాబ్‌ ధరించకూడదని ఒత్తిడి చేయడం బీజేపీకి అధికారపరమైన ఆమోదనీయత లేకపోవడాన్ని వెల్లడిస్తున్నది. ఇవన్నీ బీజేపీ పాలనకు నైతికబద్ధత లేదనడానికి నిదర్శనాలు.

వాస్తవానికి అన్ని ప్రభుత్వాలు సమ్మతిని, బలప్రయోగాన్ని అనుసరిస్తాయి. ప్రముఖ ఇటాలియన్‌ తత్వవేత్త గ్రామ్‌సీ ప్రకారం- అధిపత్యం అనేది ఇతర వర్గాలపై ఆర్థిక, రాజకీయ, నైతిక, మేధోరంగాల్లో ఒక వర్గం నాయకత్వం పొందడానికి దోహదపడుతుంది. బీజేపీ తన ఆధికారాన్ని రాజకీయరంగంలో, కొంతమేరకు ఆర్థికరంగంలో సాధించింది. కానీ జన బాహుళ్యంలోని నైతికరంగంలో, మేధోరంగంలో కానీ మనస్సుల్లో కానీ స్థానం సంపాదించలేదు. ఇది సాధ్యమయ్యేవరకు బీజేపీ అసహనంగానూ, కంపిస్తూనూ ఉంటుంది. ఎందుకంటే- ప్రజలను బలం ద్వారా గానే కాదు, భావజాలం ద్వారానూ పాలించవలసి ఉంటుంది.

బీజేపీకి సంఖ్యాబలం ఉన్నది. అయినంతమాత్రాన ప్రజా బాహుళ్య సమ్మతి లభించదు. రాజకీయ సమాజంపై బీజేపీకి నియంత్రణ ఉన్నది. కానీ పౌర సమాజంపై ఉన్నదా? లేదనవచ్చు. తన అనుకూల భావనను, నైతిక, మేధోపర ఆధిపత్యాన్ని సాధించేవరకు బీజేపీ బలప్రయోగం ద్వారా పాలనను కొనసాగిస్తూనే ఉంటుంది.
(వ్యాసకర్త: ‘ఇండియా టుడే’ హిందీ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌. మీడియా సామాజిక శాస్త్రంపై పలు పుస్తకాలు రాశారు)