home page

దురాక్రమణుల చేతిలో ధ్వంసం ఇప్పుడు ఏం చేస్తాం: సద్గురు

వివాదాల కన్నా పరిష్కారం మిన్న

 | 
Vasudev

ధ్వంసం అయిన వాటి గురించి చర్చ దండగ: వాసు దేవ్   

        

న్యూఢిల్లీ:దురాక్రమణల కాలంలో ధ్వంసమైన హిందూ ఆలయాల గురించి ఇప్పుడు మాట్లాడటం దండగ అని సద్గురు వాసుదేవ్ అన్నారు.
 
 చరిత్రను ఇప్పుడు తిరిగి రాయలేం కదా అని అన్నారు. దురాక్రమణల కాలంలో వేలాది ఆలయాలను నేలమట్టం చేశారని, అప్పుడు వాటిని రక్షించలేకపోయామని వివరించారు. కాబట్టి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం దండగ అని తెలిపారు.

ఈ వివాదాలపై హిందూ, ముస్లిం కమ్యూనిటీలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదాహరణకు రెండు మూడు ఐకానిక్ సైట్లు ఉంటే వాటిని సెటిల్ చేసుకోవాలని వివరించారు. అంతేగానీ, ఒక్కోసారి ఒక్కో ఆలయం గురించి చర్చించి వివాదాన్ని పొడిగిస్తూ రెండు వర్గాల మధ్య అనవసరమైన శత్రుత్వాన్ని సజీవంగా ఉంచడం సరికాదని అన్నారు. అందుకు బదులు ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని ఎంచుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. అంతేకానీ, హిందూ, ముస్లింలు అనే కోణంలో ఆలోచనలు చేయరాదని వివరించారు. కాగా, జ్ఞానవాపి మసీదు వివాదం గురించి తాను అన్ని వివరాలు తెలుసుకోలేదని, కాబట్టి, దానిపై వ్యాఖ్యానించబోనని చెప్పారు.

భారత్ ఇప్పుడు కీలక ఘట్టంలో ఉన్నదని, ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ప్రపంచంలో మన దేశాన్ని ఏ శక్తీ ఆపలేదని సద్గురు అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చడాన్ని వదులుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాదు, ప్రజలు, న్యూస్ ఏజెన్సీలు ఈ వివాదాలను పక్కనపెట్టి.. వాటికి పరిష్కారాల గురించి చర్చించాలని వివరించారు.

ప్రపంచంలో పరిష్కార సాధ్యం కానీ వివాదమేదీ లేదని సద్గురు అన్నారు. ప్రజల గుండెల్లో బాధ ఉన్నప్పుడు కూర్చుని చర్చించుకోవడానికి బదులు అంతంలేని వాదనలు చేయకూడదని వివరించారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారిని వీటికి దూరంగా ఉంచాలని తెలిపారు. ఈ అంశాలు వారికి పొలిటికల్ మైలేజీగా మారకుండా చూడాలని వివరించారు.

హిందీ వర్సెస్ దక్షిణాది భాషల వివాదంపై ఆయన మాట్లాడుతూ, దేశంలో అన్ని భాషాలకు సమాన ప్రాధాన్యత ఉన్నదని సద్గురు చెప్పారు. నిజం చెప్పాలంటే.. హిందీ కంటే కూడా దక్షిణాది భాషల్లోనే ఎక్కువ సాహిత్యం ఉన్నదని వివరించారు. భారత్ ఒక ప్రత్యేక దేశం అని, అది ఏ ఒక్క అంశం ప్రాతిపదికన ఏర్పడలేదని తెలిపారు. రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పడినప్పుడే అన్ని భాషలను గౌరవించాలనే హామీ చాలా సహజమైనదని వివరించారు. అంతేకానీ, ఒక భాష ఎక్కువ మంది మాట్లాడతారని చెప్పి మౌలిక సూత్రాలను భంగం చేయరాదని తెలిపారు.