home page

ఉమ్మడి పౌర స్మృతి చట్టం: వ్యతిరేకిస్తున్న నితీష్ జెడియు

దేశవ్యాప్తంగా బిజెపి కొత్త రాజకీయం

 | 
నితీష్ కుమార్

అమిత్ షా బాటలో బిజెపి ముఖ్యమంత్రులు

న్యూఢిల్లీ : దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతిని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నది. దీని గురించి రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రస్తావించగా, ఆయనకు వత్తాసుగా బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరి తరువాత ఒకరు ప్రకటనలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జై రామ్‌ ఠాగూర్‌ సోమవారం చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అదే సమయంలో బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి బిజెపి నేతల డిమాండ్‌ను వ్యతిరేకించారు. జెడి(యు) సీనియర్‌ నాయకుడు ఉపేంద్ర కుష్వాహ మాట్లాడుతూ, నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బీహార్‌లో ఉమ్మడి పౌర స్మృతిని అనుమతించే ప్రశ్నే లేదన్నారు. సిద్థాంతాలపై తమ పార్టీ రాజీపడబోదని, ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందేనని ఆయన అన్నారు. అంతకుముందు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జై రామ్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాల్సిందేనని వాదించారు. ఢిల్లీలోని హిమాచల్‌ భవన్‌లో మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

అంతకుముందు ఉత్తరాఖండ్ సీఎం ధామి తమ రాష్ట్రం లో ఉమ్మడి పౌర స్మృతి చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ప్రసాద్ మౌర్య కూడా యూపీలో కొత్త చట్టం తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు.