home page

ఆదానీ కోసం కేంద్రం అబద్ధాలు

బొగ్గు కొరత అంటూ కొత్త రాగాలు:

కొరత పేరిట కొనుగోలు భారం

 | 
Lies by centre
అంతర్జాతీయ కొనుగోళ్లు ఎవరి లబ్ధికి?
దిగుమతి నిర్ణయం.. అదానీ కంపెనీకే లాభం
కేంద్రం వైఖరిపై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ, జూలై 25: నిన్నటివరకు.. పలు రాష్ర్టాల్లో బొగ్గుకొరత.. ఫలితంగా విద్యుత్తు కోతలు.. కేంద్రం ఒత్తిడితో ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ బొగ్గు దిగుమతి చేసుకోక తప్పని సంకటస్థితి. సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని రాష్ర్టాలు వాదించినా.. దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ ఇబ్బంది పెట్టిన కేంద్రం.. ఇప్పుడు నిజం ఒప్పుకోకతప్పలేదు. బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ పార్లమెంటు సాక్షిగా దేశంలో బొగ్గు కొరతే లేదంటూ ఒక్కముక్కలో తేల్చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉత్పత్తి పెరిగిందనీ స్పష్టంచేశారు. మరి ఎందుకోసం పలు రాష్ర్టాల్లో విద్యుత్తు కొరతను సృష్టించారని, దాన్ని బూచిగా చూపి ఎందుకు అడ్డగోలు ధరకు బొగ్గు దిగుమతికి గేట్లెత్తారని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎన్టీపీసీ బొగ్గు దిగుమతి కాంట్రాక్టుల్లో అదానీకి చెందిన కంపెనీయే లాభపడిందన్న వార్తలు గణా ంకాలతో సహా బయటపడడం విస్మయపరుస్తున్నది.
రాజ్యసభలో ఎంపీ సీఎం రమేశ్‌ ప్రశ్నకు మంత్రి ప్రహ్లాద్‌ సోమవారం సమాధానమిస్తూ.. కొన్ని లెక్కలు ప్రకటించారు. 2020-21లో దేశంలో 716.083 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యిందని, 2021-22లో 778.19 ఎంటీలకు పెరిగిందని సెలవిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (జూన్‌ 22 నాటికి) 204.876 ఎంటీల ఉత్పత్తి అయ్యిందని, గత ఏడాది ఇదే కాలానికి ఉత్పత్తి 156.11 ఎంటీలుగా ఉందని పోల్చిచూపారు. ఎంపీ రమేశ్‌ కేంద్రం ముందు పలు ప్రశ్నలుంచారు. దేశంలో బొగ్గు కొరత ఉందా? ఫలితంగా ఏదైనా రాష్ట్రం లేదా యూటీ బొగ్గు కొరత ఎదుర్కొన్నదా? మూడేండ్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న బొగ్గు ఎంత? బొగ్గు ఉత్పత్తి మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలను పరిశీలించేందుకు కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఆ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయా? వివరాలు తెలుపాల్సిందిగా కోరారు. మంత్రి వీటిలో ఏ ఒక్కదానికీ సమగ్రంగా సమాధానం ఇవ్వలేదు. కొరత లేదని చెప్పి ముక్తసరి సమాధానంతో సరిపెట్టారు.
కొరత లేనప్పుడు దిగుమతులెందుకు?
బొగ్గు కొరత సమస్య నివారణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 76 మిలియన్‌ టన్నుల బొగ్గు దిగుమతికి ప్రణాళిక ఖరారు చేసిందన్న వార్తల మాటేమిటి? ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ 15 ఎంటీలు, ఎన్టీపీసీ, దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ ఉమ్మడిగా 23 ఎంటీలు దిగుమతి చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. రాష్ర్టాల విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలు, స్వతంత్ర విద్యుత్తు తయారీదారులు మరో 38 ఎంటీలు చేసుకొంటున్నాయని మింట్‌ పత్రిక రాసింది. దిగుమతి బొగ్గుతో తయారు చేసే విద్యుత్తు ధరపై రెండు కంపెనీలకైతే యూనిట్‌కు 50-60 పైసలు, మిగతా వాటికైతే 50-80 పైసలు పెరగొచ్చని కూడా ఆ పత్రిక ఒక అధికారిని ఉటంకిస్తూ రాసింది. సెప్టెంబర్‌ దాకా వేచి చూస్తే కానీ సంక్షోభం సమసిందీ లేనిదీ చెప్పలేమని సదరు అధికారి సెలవిచ్చారు. వింత ఏంటంటే జూన్‌లో కోల్‌ ఇండియా చరిత్రలోనే ప్రప్రథమంగా 2.416 ఎంటీల బొగ్గు కోసం అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించింది. కొరత, సంక్షోభం లేకపోతే ఈ టెండర్‌ దేనికి?
అంతా హడావుడి వ్యవహారం..
జూన్‌ నెలకు ముందు.. విదేశాల నుంచి స్వల్పకాలిక, మధ్యకాలిక అవసరాలకు బొగ్గు దిగుమతి చేసుకొనేందుకు రెండు అంతర్జాతీయ టెండర్లకు కోల్‌ ఇండియా బోర్డు అనుమతి మంజూరు చేసింది. మొదటి దానికి ఏదసాల పేర్లు సూచించారు. రెండోదానికీ అదీ లేదు. అంటే ఏ దేశం నుంచి దొరికితే ఆ దేశం నుంచి బొగ్గు కొనేయాలి అన్నమాట. కొరతే లేకపోతే హడావిడి దేనికి? అంతర్జాతీయ మార్కెట్లో ఉరుకులు పరుగులు దేనికి? మే 18న విద్యుత్తు శాఖ విద్యుత్తు కంపెనీలకు ఓ తాఖీదు జారీచేసింది. మే 31 లోగా 12 మిలియన్‌ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవాలని.. అలా చేస్తేనే జూన్‌ 15 నాటికి బొగ్గు అందుతుందని, లేదంటే కంపెనీలు అదనంగా 15 శాతం దిగుమతులకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది.
బూచిగా విద్యుత్తు సంక్షోభం
ఈ వేసవిలో జార్ఖండ్‌, పంజాబ్‌, ఒడిశా, బీహార్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలు బొగ్గు అందుబాటులో లేని కారణంగా విద్యుత్తు కోతలు విధించాయి. విద్యుత్తు కొరత 5.24 గిగావాట్ల నుంచి 10.77 గిగావాట్లకు చేరుకున్నది. ప్రధాన కారణం బొగ్గు కొరత తప్ప మరోటి కాదు. కొరత నివారించేందుకే రైళ్లను బొగ్గు రవాణాకు మళ్లించిన మాట నిజంకాదా? ఇవన్నీ రహస్యాలేమీ కావు. గత మే నెలలో ఢిల్లీ చరిత్రలో రికార్డు స్థాయిలో 6,194 మెగావాట్ల డిమాండ్‌ ఏర్పడింది. ఏప్రిల్‌లో ఆ రికార్డు కూడా బద్దలై 6,197కు చేరుకుంది. ఇదంతా బొగ్గు కొరత కారణంగా, ప్రణాళిక లేకపోవడం కారణంగా తలెత్తిన సంక్షోభం. మరి మంత్రి ఈ బాదరబందీ గురించి ఏమీ చెప్పకుండా అన్ని అడ్డంకులను చాపకిందకు తోసి సమస్య లేదని సమాధానమిచ్చారు.
దిగుమతి కాంట్రాక్టుల్లో సింహభాగం అదానీకే..
బొగ్గు సమస్యకు దిగుమతులే పరిష్కారమని సర్కారు కొరడా ఝళిపించింది. ఈ దిగుమతులతో ఎవరికి లాభమంటే ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి పోతున్న అదానీకే అని చెప్పుకోవాలి. దిగుమతుల వల్ల విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 11% పెరిగాయని బ్లూంబెర్గ్‌ తెలిపింది. ఇందులో సింహభాగం అదానీ గ్రూప్‌దే. ప్రభుత్వరంగ ఎన్టీపీసీ 20 ఎంటీల బొగ్గు దిగుమతి చేసుకొంటే.. అందులో 17.3 ఎంటీలు అదానీ కంపెనీ సరఫరా చేసిందే. బొగ్గు దిగుమతి వల్ల అదానీ గ్రూప్‌కు రెండు రకాలుగా లాభం. ఒకటి బొగ్గు కొనుగోలు.. రెండు అదానీ రేవుల ద్వారా బొగ్గు రవాణా కావడం. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ బాగా లాభాలు ఆర్జించబోతున్నట్టు బ్లూంబెర్గ్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్టు డెనిస్‌ వోంగ్‌ పేర్కొన్నారు. విద్యుత్తు సంస్థలతో పకడ్బందీ కాంట్రాక్టుల ద్వారా ఆర్డరు పట్టుకోగలిగే స్థితిలో ఉండటం, బలమైన రవాణా నెట్‌వర్క్‌ కలిగి ఉన్న కారణంగా ఇది సాధ్యమవుతున్నదని ఆమె వివరించారు.