home page

రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై సీఎం జగన్ సమీక్ష

ఎమ్మెల్యే క్వార్టర్స్, అఫీషియల్ భవనాలు సిద్ధచేయండి

 | 
jagan

పురపాలక శాఖ పై సీఎం సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కరకట్ట, రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులను ముమ్మరం చేయాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం..అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వీటిలో నియమాలు, నిబంధనలు, ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కోసం ఇప్పటివరకు సుమారు 6 వేల 791 ఎకరాలు గుర్తించినట్లు అధికారులు ..సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోచ్‌ల డిజైన్, స్టేషన్లలో ఉండే సౌకర్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

టీడ్కో ఇళ్లపై రానున్న రోజుల్లో మరింత ఖర్చు చేస్తామని సమీక్షలో సీఎం జగన్‌ చెప్పారు. కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా ఇళ్ల ప్లాన్ చేస్తున్నామన్నారు. మన ప్రభుత్వం వచ్చాక టిడ్కో ఇళ్లకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఇళ్లనూ నిర్మించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు సీఎం జగన్. ఎక్కడా గుంతలు లేకుండా ఉండాలని ఆదేశించారు. నాడు-నేడు కింద వీటిని బాగు చేయాలన్నారు. జూన్ నాటికి రోడ్ల పనులు పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు.

జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం ఆరా తీశారు. వీలైనన్నీ మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేయాలన్నారు సీఎం. ఇందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని స్పష్టం చేశారు. క్లీన్‌ ఏపీపై కూడా సీఎం రివ్యూ చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఈనెల 22 నాటికి 8 లక్షల చెత్త డబ్బాలను పంపిణీ చేస్తామన్నారు.

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌,సీఎస్ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.