home page

బైబై మోడీ: మోత మోస్తున్న నెట్!

సోషల్ మీడియాలో మండిపడ్డ నెటిజన్లు 

 | 
మోడీ

ఇదే ఈనాటి  ట్విట్టర్లో  ట్రెండింగ్ 

ట్విట్టర్‌లో హోరెత్తుతున్న నిరసన

దేశాన్ని లూటీ చేశారని విరుచుకుపడుతున్న నెటిజన్లు
మత విద్వేషాలు పెరగడంపై ఆగ్రహం 

 ప్రధాని నరేంద్రమోడీ పాలనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహవేశాలు, నిరసనలు, అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి.

బిజెపి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో నెటిజనులు మండిపడుతున్నారు. కేంద్ర విధానాలను ఎండగడుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేటర్ల సేవలో తరిస్తున్న 'బిజెపి పాలన మాకొద్దు.. బై మోడీ' అంటూ హాష్‌ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇదే దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. గత వారంలో కూడా ఇదే విధంగా నెటిజనులు మోడీ పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడిలో పెద్దఎత్తున పోస్టులు పెట్టారు. ఇది కూడా దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారడమే కాకుండా..ట్విట్టర్‌లో సరికొత్తరి కార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.

తాజాగా గురువారం కూడా నెటిజన్‌లు మోడీ పాలనపై రెచ్చిపోయి పెద్దఎత్తున కామెంట్లు పెట్టారు. ఇందులో ప్రధానంగా దేశాన్ని పాలించడంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శలు. ఆరోపణలు వెల్లువెత్తాయి. మోడీ అసమర్థ పాలన కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమయిందని ఆరోపిస్తూ నెటిజన్లు తమ ట్వీట్లతో చెలరేగిపోయారు. దేశాన్ని లూటీ చేసి విదేశాల్లో దాచుకుంటున్న వారి నుంచి నల్ల ధనాన్ని తీసుకొస్తానన్న మోడీ.. అందుకు విరుద్దంగా పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తిరిగి అలాంటి వారికే మేలు చేకూర్చే విధంగా మోడీ పాలన సాగిస్తూ..దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని పేర్కొంటూ తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. సబ్‌కా సాత్.సబ్‌కా వికాస్ అనేది కేవలం నినాదానికే పరిమితమైందని...అసలు మోడీ పాలనలో ఏ వర్గానికి మేలు జరగడం లేదని వ్యాఖ్యానించారు. కాగా మోడీ పాలనపై నెటిజనులు ట్విట్టర్ వేదికగా చేస్తున్న ఆరోపణలు ట్రెండింగ్‌గా మారడంతో రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సైతం తమ ట్వీట్ల వాడి.వేడిని మరింతగా పెంచారు. మోడీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. దాదాపు యాభై వేలకు పైగా ట్వీట్లు చేశారని తెలుస్తోంది. మోడీ పాలనలో కొత్త ఉద్యోగాల మాటను అటు పక్కన బెడితే ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక్కటొక్కటిగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్, డీజిల్ పెట్రోల్ ధరలు మొదలుకొని ద్రవ్యోల్బణం దాకా, దేశంలో సృష్టిస్తున్న మత విద్వేషాలు విధానాల మీద నెటిజన్లు విమర్శలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి ఖర్చులను రెట్టింపు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కూడా మోడీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా బిజెపి సర్కారు భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ.. దేశానికి పాలించే నాయకుడు కావాలి కానీ... పబ్లిసిటీ కోసం పాటుపడే నాయకుడు వద్దంటూ ట్వీట్ చేశారు. అదానీ బంధాన్ని, కార్పొరేట్ల కోసం వారి బాగు కోసం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెట్టారు. అలాగే ఇటీవల శ్రీలంకలో అదానీ కంపెనీలకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు మోడీ నిర్వహించిన మధ్యవర్తిత్వ అంశంతో పాటు దేశంలో బొగ్గు కృత్రిమ కొరత సృష్టించి ఆస్ట్రేలియాలో ఉన్న ఆదాయాన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకున్న నిర్ణయాలను కూడా ట్విట్టర్‌లో ప్రస్తావించారు.