home page

ఢిల్లీలో మళ్ళీ మొదటికి బుల్డోజర్ రాజకీయాలు

షాహీన్ బాగ్ లో ఉద్రిక్తత: స్తంభించిన ట్రాఫిక్

 | 
Bulldozing rules

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో వార్తల్లో నిలిచిన ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ (Shaheen Bagh) ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దక్షిణ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎస్‌డీఎంసీ) చర్యలు ప్రారంభించినా చిట్టచివరికి కూల్చివేతలు ప్రారంభం లేకుండా ముగింపు పలికారు. కూల్చే ప్రయత్నాలలోభాగంగా నేడు ఈ ప్రాంతానికి బుల్డోజర్లను తీసుకొచ్చారు. అయితే ఈ కూల్చివేతను అడ్డుకుంటూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో షాహీన్‌బాగ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి పంపించేశారు.

దిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎస్‌డీఎంసీ ఇటీవల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే షాహీన్‌బాగ్ వద్ద కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇటీవల జహంగీర్‌పురి వద్ద జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని షాహీన్‌బాగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతల కోసం వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు.

ఈ ఉదయం షాహీన్‌బాగ్‌కు బుల్డోజర్లు, జేసీబీలను తరలించారు. అయితే వీటిని చూసిన స్థానికులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ మద్దతుదారులు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్‌ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను తాము ఇప్పటికే తొలగించామని, అయినా బుల్డోజర్లను పంపించిన భాజపా రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

ఇటీవల జహంగీర్‌పురిలోనూ అక్రమ కట్టడాల కూల్చివేతకు ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టగా.. అక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో సుప్రీంకోర్టు కలగజేసుకుని ఆ ప్రాంతంలో నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది.