home page

ప్రాంతీయ పార్టీలను మింగేస్తున్న భారతీయ జనతా పార్టీ

ప్రమాదం నుంచి బయటపడ్డ  నితీశ్ కుమార్ 

 | 
Bjp
నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ అంటే ఎన్డీఏ. ఈ కూటమే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తోంది. దేశంలో సంకీర్ణ రాజకీయాల శకం వచ్చిన తర్వాత కూటముల రాజకీయాలు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఏర్పాటయ్యాయి. నడుస్తోంది సంకీర్ణ ప్రభుత్వమే కానీ.. బీజేపీకి గత రెండు విడతలుగా సంపూర్ణ మెజార్టీ రావడంతో ఆ పార్టీ పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎన్డీఏలో పార్టీల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తోంది. ఇప్పుడు జేడీయూ కూడాగుడ్ బై చెప్పడంతో ఎన్డీఏలో చెప్పుకోదగ్గ పార్టీనే లేకుండా పోయింది. అయితే అలా వెల్లిపోయిన పార్టీలు కూడా క్రమంగా బీజేపీ రాజకీయాల కారణంగా ఉనికి కోల్పోతూండటం అసలు ట్విస్ట్ అనుకోవాలి.

పూర్తిగా కనుమరుగైన ఎన్డీఏలోని పార్టీలు

ఒకప్పుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీలు ఎన్డీఏలో ఉండేవి. పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, అన్నాడీఎంకే, లోక్ జనశక్తి , 2014లో టీడీపీ కూడా ఉండేది. అయితే ఇప్పుడు బీజేపీతో జట్టులో ఉన్న ఇతర పార్టీలు ఏవీ ఆ పార్టీతో సుదీర్ఘంగా నడుస్తున్నవి కావు. బలం ఉన్నవి కావు. ప్రస్తతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఉన్న పార్టీ ఏది అంటే.. శివసేన చీలిక గ్రూపు మాత్రమే. పన్నెండు మంది శివసేన ఎంపీలు విడిగా ఏర్పడి ఎన్డీఏలో భాగమయ్యారు. దాదాపుగా పాతికేళ్ల పాటు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీ ధాటికి కకావికలం అయిపోయింది. ఉనికి సమస్యలో పడింది.

బీజేపీ దెబ్బకు  ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం 

శివసేన మాత్రమే కాదు.. అకాలీదళ్‌దీ అదే పరిస్థితి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. కానీ ఆ పార్టీ మెరుగుపడలేదు. అన్నాడీఎంకే కూడా బీజేపీ రాజకీయ చదరంగంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఇక రాంవిలాస్ పాశ్వాన్ చనిపోయాక.. ఆయన పార్టీ లోక్ జనశక్తి చిన్నాభిన్నమైంది. ఆయన కుమారుడ్ని.. బాబాయ్‌ను విడదీసి..బాబాయ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంది. ఇప్పుడా పార్టీకి ఉనికి కష్టంగామారింది. తాజాగా జేడీయూ పరిస్థితి కూడా అదే. బీహార్‌లో జేడీయూ ఒకప్పుడు మేజర్ పార్టీ. బీజేపీ పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకునేది. ఇప్పుడు జేడీయూ అల్ప స్థానానికి పడిపోయింది. రేపోమాపో షిండే తరహాలో ఆయనపై ఓ నేతను ప్రయోగిస్తారన్న ప్రచారం జరగడంతో ఆర్జేడీని పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్.
బీజేపీతో పొత్తులు పెట్టుకోని పార్టీలకూ గండమే !
కానీ దీన్ని బీజేపీ లైట్ తీసుకుంటోంది. తాము బీహార్ మొత్తం విస్తరించడానికి ఇంత కన్నా మార్గం ఏముంటుందని అనుకుంటోంది. అయితే బీజేపీతో పొత్తులో శిఖరంలాగా ప్రారంభమైన జేడీయూ ఇప్పుడు అంతర్ధాన సమస్యను ఎదుర్కొంటోంది. ఒక్క జేడీయూనే కాదు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ ఇలా నిర్వీర్యం అవుతూనే ఉన్నాయి. అయితే పొత్తు పెట్టుకుంటేనే ఇలానా.. పొత్తు పెట్టుకోకపోతే వదిలేస్తారా అంటే.. బీజేపీకి అలాంటి శషభిషలేమీ ఉండవని ప్రస్తుత రాజకీయ పరిణామాలే చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కానీ.. ఇతర చోట్ల కానీ బీజేపీ దెబ్బకు కుదేలైపోతున్న పార్టీలే దానికి ఉదాహరణ. మొత్తానికి బీజేపీతో పెట్టుకున్నా.. పెట్టుకోకున్నా ప్రాంతీయ పార్టీలు పెను గండాన్ని ఎదుర్కోవడం ఖాయమే.