రాష్ట్రపతి ద్రౌపది తో బాబు భేటీ
రాష్ట్రపతి ని కలిసిన టిడిపి బృందం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.
సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో కూడా ఆయన హాజరుకానున్నారు. ముందుగా రాష్ట్రపతి ముర్ముని కలిసిన ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా ముర్ము బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేశామన్నారు. టీడీపీ ఆమెకు బేషరతుగా మద్దతునిచ్చిందని, తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఆమెకు ఓటు వేశారని తెలిపారు. తర్వాత ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశానికి హాజరుకానున్నట్టు తెలిపారు.
భారత రాష్ట్రపతిగా ముర్ము ఎన్నికయ్యే ముందు గత నెల 12న ఆమె అమరావతిని సందర్శించినప్పుడు, తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఓ స్టార్ హోటల్‌లో ఆమెకు పరిచయం చేయడం జరిగిందన్నారు. ఆమె జీవితం అసాధారణమైనదని, కలిసిన తర్వాత తెలిసిందని ముర్ముపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
సాదాసీదా జీవితాన్ని గడిపే ఆమె సమాజంలోని అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాయుడు కొనియాడారు. ముర్ము వంటి గొప్ప గిరిజన నాయకురాలికి మద్దతునిచ్చినందుకు టిడిపి పార్టీ గర్వపడుతుందని, అటువంటి మహిళ రాష్ట్రపతి భవన్ లో కొలువు తీరడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముర్ము ఈ స్థాయికి ఎదిగిన తీరును ఆయన గుర్తు చేస్తూ, అణగారిన వర్గాల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రం ఒడిషాలోని పేద కుటుంబంలో జన్మించిన ఆమె, పంచాయితీ నాయకురాలిగా తన రాజకీయ జీవిత ప్రస్థానం ప్రారంభించి ఉన్నత స్థాయికి చేరుకుందన్నారు.ఎటువంటి రాజకీయ భేషజాలు లేకుండా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతు తెలియజేసినందుకు ఈ సందర్భంగా ముర్ము, చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ఆశలకు అనుగుణంగా తాను ఎదుగుతానన్న నమ్మకం ఉందని, సామాజిక న్యాయం పట్ల తాను నిబద్ధతతో మాటకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఇదొక శుభ తరుణమని అభివర్ణిస్తూ ఆంధ్రప్రదేశ్ అనేక అంశాల్లో ప్రత్యేకతను చాటుకుందని ముర్ము అన్నారు.
ఇదిలా ఉండగా, సాయంత్రం మోదీ అధ్యక్షతన జరగనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి భవన్‌కు హాజరయ్యారు. భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ ప్రచారం పేరుతో వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది.