home page

బిజెపి మార్గదర్శకాలు జారీ

మహ్మద్ ప్రవక్త పై తలెత్తిన వివాదంతో జాగ్రత్తలు 

 | 
Bjp

మీడియాతో మాటలకు మార్గ నిర్దేశం 

మహ్మద్ ప్రవక్త పై తలెత్తిన వివాదాన్ని ఇంతటితో ఆపేందుకు భవిష్యత్ లో టీవీ షోల్లో పాల్గొనే తమ పార్టీ నేతల కోసం బీజేపీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని తప్పకుండా పాటించాల్సిందేనని సూచించింది.

ఇటీవల బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ ఓ టీవీ షోలో పాల్గొని, మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై ఇప్పటికే బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలు రూపొందించింది.

బీజేపీ అధికారికంగా ప్రకటించిన పార్టీ ప్రతినిధులు, ప్యానలిస్టులు మాత్రమే టీవీ షోల్లో పాల్గొనాలని చెప్పింది. టీవీ షోల్లో పాల్గొనాల్సిన వారి పేర్లను బీజేపీ మీడియా సెల్ ప్రకటిస్తుందని పేర్కొంది. టీవీ షోల్లో పాల్గొనే బీజేపీ ప్రతినిధులు మతపర చిహ్నాల గురించి మాట్లాడవద్దని చెప్పింది. అలాగే, భాషాపరంగా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాలని పేర్కొంది. మాట్లాడుతోన్న సమయంలో భావోద్వేగాలకు గురికావద్దని, రెచ్చిపోయి మాట్లాడవద్దని సూచించింది.

పార్టీ భావజాలాన్ని, ఆదర్శాలను ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేయవద్దని పేర్కొంది. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ బీజేపీ ప్రతినిధులు సంయమనం పాటించాలని చెప్పింది. అలాగే, టీవీ షోలకు వెళ్లే ముందు ఏ అంశంపై మాట్లాడుతున్నామన్న విషయంలో పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ఆ విషయంపై పార్టీ విధానం ఎలా ఉందో తెలుసుకోవాలని బీజేపీ సూచించింది. కాగా, నురూప్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగానూ బీజేపీపై విమర్శలు వస్తున్నాయి. దీంతో తమ పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.