నాలుగేళ్ళలో 85 వేల రైతులకు భరోసా
రాజుగా మారిన రైతు
★ అన్నదాత కుటుంబానికి అండగా
★ రైతుబీమాతో సీఎం ఆర్థిక భరోసా
★ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
★ నేటితో పథకానికి నాలుగేండ్లు
★ 85 వేల కుటుంబాలకు బాసట
★ రూ.4,290 కోట్ల పరిహారం చెల్లింపు
★ పథకం పరిధిలోకి మరో 3 లక్షలు
★ రూ.1,446 కోట్ల ప్రీమియం
చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం
పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత్త జీవితాన్ని ఇస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నేటి (సోమవారం)తో నాలుగేండ్లు పూర్తిచేసుకొంటున్న ఈ పథకం కింద 18 నుంచి 59 ఏండ్ల వయసున్న రైతు పేరిట కనీసం కుంట భూమి ఉండి ఏ కారణంతో మరణించినా ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతున్నది.
ఇలా గత నాలుగేండ్లలో వివిధ కారణాలతో మరణించిన 85,804 మంది రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తగా రూ.4,290 కోట్ల పరిహారం చెల్లించింది. ఈ పథకం కోసం ఎల్‌ఐసీకి రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏటా ఒక్కో రైతు తరఫున రూ.4 వేలు చొప్పున గత నాలుగేండ్లలో రూ.4,367 కోట్ల ప్రీమియం చెల్లించింది. ఏటా ప్రీమియం పెరుగుతుండటంతో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతున్నది. ఈ ఏడాది 37.76 లక్షల మంది రైతుల కోసం రూ.1,446 కోట్ల ప్రీమియంను చెల్లించనున్నది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది రైతులు కొత్తగా రైతుబీమా పథకం పరిధిలోకి రావడం గమనార్హం.