అన్ని మతాలు సమానం:బిజెపి
నుపుర్ శర్మ,నవీన్ జిందాల్ సస్పెండ్
టీవి డిబేట్ ఫలితంగా కాన్పూర్ లో ఉద్రిక్తత
వీరిద్దరికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఓ టీవీ డిబేట్‌లో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా కాన్పూర్‌ను అట్టుడికించాయి.
నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో కాన్పూర్‌లోని ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా పరేడ్ మార్కెట్‌లో షాపులను బంద్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ అల్లర్లు జరిగాయి. ఇందులో సుమారు 20 మంది పోలీసు సిబ్బంది సహా మొత్తం 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి సుమారు 1,500 మందిపై కేసు నమోదైనట్టు యూపీ పోలీసులు తెలిపారు.
మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ అన్ని మతాలను, తెగలను సమానంగా ఆదరిస్తుందని, గౌరవిస్తుందని స్పష్టం చేసింది. ఒక తెగ లేదా మతాన్ని అగౌరవపరిచే భావజాలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని వివరించింది. అలాంటి వాటిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించింది. అలాంటి తత్వాన్ని లేదా వ్యక్తులను బీజేపీ ప్రమోట్ చేయదని తెలిపింది. మన దేశ పౌరుడు ఏ మతాన్ని అయిన స్వేచ్ఛగా ఎంచుకునే, ఆచరించే హక్కును రాజ్యాంగం కల్పించిందని వివరించింది. ఈ స్వేచ్ఛను తాము గౌరవిస్తామని తెలిపింది. భారత సమైక్యత, సమగ్రతను, బహుళత్వాన్ని గౌరవిస్తూ దేశ అభివృద్ధి వైపు నడిపించడానికి పార్టీ కట్టుబడి ఉన్నదని వివరించింది.
గత వారం ఓ టీవీ డిబేట్‌లో నుపుర్ శర్మ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్తను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లిం గ్రూపులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. అదే వివాదం రగులుతుండగా నవీన్ కుమార్ జిందాల్ ట్విట్టర్‌లో ప్రవక్త గురించి ఓ ట్వీట్ చేశారు. ఇది కూడా తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. దీంతో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. కానీ, వీరి చర్యలపై ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహానికి లోనై ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, బీజేపీ కఠిన నిర్ణయం తీసుకుంది.