home page

కొత్త రాజ్యసభ సభ్యులలో 40శాతం మందికి నేరచరిత్ర

ఏడిఆర్ నివేదికలో వెలుగు చూసిన వైనం

 | 
Rs

ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల్లో 40 శాతం ఎంపీలకు నేరచరిత్ర ఉందనీ, ఇందులో 12 శాతం ఎంపీలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్టు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (Association of Democratic Reforms) తెలిపాయి.

వీరిలో ఎక్కువ మంచి హత్య, మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాయి. అభ్యర్థులు నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన 57 మంది సభ్యుల్లో 23 మంది (దాదాపు 40 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్లు, అలాగే.. 12 మందిపై (21 శాతం) హత్య, హత్యా యత్నం, దొంగతనం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేర కేసులున్నట్లు ఏడీఆర్‌ తెలిపింది.

పార్టీల వారీగా ఇచ్చిన నివేదిక ప్రకారం.. కాగా, బీజేపీ నుంచి ఎన్నికైన 22 మంది రాజ్యసభ సభ్యుల్లో 9 మందికి, 9 మంది కాంగ్రెస్‌ ఎంపీల్లో నలుగురికి, టీఆర్‌ఎస్‌, ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎంపీలు, వైఎస్‌ఆర్పీ, డీఎంకే, ఏఐడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఎస్‌హెచ్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ నుంచి ఒక్కో ఎంపీకి నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్‌ వివరించింది.

రాష్ట్రాల పరంగా చూస్తే.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆరుగురు, మహారాష్ట్ర, బీహార్‌ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానా నుంచి ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లు నివేదిక పేర్కొంది. ఈ నెలలో రాజ్యసభకు ఎన్నికైన మొత్తం 57 మంది ఎంపీల స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (Association of Democratic Reforms) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ తెలిపాయి. ఈ నివేదికల్లో పేర్కోన్న 57 మంది ఎంపీలలో 23 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారని నివేదిక తెలిపింది.

కొత్తగా ఎన్నికైన 57 మంది ఎంపీల చర, స్థిరాస్తులను విశ్లేషిస్తూ.. వారిలో 53 మంది (93 శాతం) మిలియనర్లని తెలిపింది. మొదటి మూడు సంపన్న అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థ సారధి మొత్తం ₹ 1,500 కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారని నివేదిక పేర్కొంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ మాజీ నాయకుడు కపిల్ సిబల్ నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ ₹ 608 కోట్లకు పై మాటే. ఇక.. పంజాబ్ నుండి కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ ₹ 498 కోట్ల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు. 2022లో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల సగటు ఆస్తుల విలువ ₹ 154.27 కోట్లు అని నివేదిక పేర్కొంది.