home page

స్విస్ బ్యాంకుల్లో 50 శాతం పెరిగిన భారతీయుల నిధులు

14 ఏళ్ళలో ఇదే ఎక్కువగా నమోదు

 | 
Swiss bank

ఏడాదిలో 50 శాతం పెరుగుదల 

ఏడాదిలోనే 50 శాతం పెరిగిన భారతీయుల సొమ్ము
 గుప్త నిధులకు స్వర్గధామంగా పరిగణించే స్విస్‌ బ్యాంక్‌ల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము గణనీయంగా పెరిగింది.
మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్‌ బ్యాంక్‌ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 3.83 బిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లకు (రూ.30,500 కోట్లు) చేరినట్టు స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌ గురువారం విడుదల చేసిన వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం 14 ఏండ్ల గరిష్టం. 2020లో 2.55 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లున్న (రూ.20,700 కోట్లు) ఈ సొమ్ము నిరుడు భారీగా 50 శాతం పెరగడం గమనార్హం. 2006లో రికార్డుస్థాయిలో 6.5 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌ల నిధులు నమోదైన తర్వాత క్రమేపీ తగ్గుముఖం పడుతూ, 2017, 2020, 2021 సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చినట్టు స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) డాటా ద్వారా వెల్లడవుతున్నది.
సేవింగ్స్‌ ఖాతాల్లో రూ.4,800 కోట్లు
స్విస్‌ బ్యాంక్‌ల్లోని పొదుపు, డిపాజిట్‌ ఖాతాల్లో భారతీయ ఖాతాదారులు దాచుకున్న సొమ్ము ఏడేండ్ల గరిష్ఠం రూ.4,800 కోట్లకు పెరిగింది. 2021 ముగిసేనాటికి స్విస్‌ బ్యాంక్‌లు వాటి భారతీయ ఖాతాదారులకు 3,831.91 మిలియన్‌ ఫ్రాంక్‌ల మొత్తం చెల్లించాల్సి ఉందని, అందులో 602.03 మిలియన్‌ ఫ్రాంక్‌లు కస్టమర్‌ డిపాజిట్లుకాగా, ఇతర బ్యాంక్‌ల ద్వారా కలిగిఉన్న డబ్బు 1,225 మిలియన్‌ ఫ్రాంక్‌లు, ట్రస్టుల ద్వారా దాచుకున్న 3 మిలియన్‌ ఫ్రాంక్‌లు ఉన్నాయి. స్విస్‌లో భారతీయులు దాచిన సంపదలో అత్యధికంగా బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఫైనాన్షియల్‌ పత్రాల రూపంలో ఉంది. వీటి విలువ 2,002 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లు.
ఇవి అధికారిక లెక్కలు మాత్రమే
స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌లు ఎస్‌ఎన్‌బీకి అందించిన అధికారిక గణాంకాల ప్రకారం మాత్రమే రూ. 30,500 కోట్ల సొమ్ము భారతీయుల ఖాతాల్లో ఉంది. కానీ ఆ దేశంలో భారతీయులు భారీగా పోగేసిన నల్లధనంపై వివరాలు కాదు. థర్డ్‌ కంట్రీ సంస్థల పేర్లతో భారతీయులు, ఎన్నారైలు, ఇతరులకు ఉన్న సొమ్ము ఈ డాటాలో వెల్లడి కాలేదు.