modi vs local parties, congress vs modi, central party

ఒక్కడిపై 26 మంది మోడీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు

ఒక్కడిపై 26 మంది పడిపోయారు. అంటే ఆ వ్యక్తి చాలా బలవంతుడికిందే లెక్క. ప్రస్తుతం మోడీ టార్గెట్ గా జట్టుకట్టిన దేశంలోని ప్రాంతీయ పార్టీల లక్ష్యం ప్రధాని పదవి నుంచి ఆయన్ను దించి అవకాశాన్ని బట్టి ఆ కుర్చీలో కూర్చోవడమే. ఈ టర్మ్ కూడా మరోసారి మోడీ కుర్చీ ఎక్కితే తమ బతుకులు బస్టాండ్ చేస్తారన్న భయం భిన్న ధృవాలను ఒకే వేదికపైకి చేర్చేలా చేసింది. తమ కలయికకు ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశాభివృద్ధి అనే నినాదం అందమైన ట్యాగ్ లైన్ గా మారింది.ప్రాంతీయ పార్టీల అవకాశ వాదాన్ని దేశ వాసులు ఇంకా మర్చిపోలేదు. చరణ్ సింగ్, మొరార్జీ దేశాయి, విపిసింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐ కె గుజ్రాల్ వంటి వారు ప్రధానులుగా వున్న సమయంలో కానీ సంకీర్ణ ప్రభుత్వాల్లో పివి నరసింహారావు, వాజ్ పేయి సర్కార్ ల పై సొంత ప్రయోజనాలకోసం ప్రాంతీయ పార్టీలు సాగించిన దాష్టికం కళ్ళముందే వారికి కనపడుతుంది. ఎవరికి వారు ప్రధాని పదవి చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికి చర్చనీయంగానే దేశ చరిత్రలో నిలిచి వున్నాయి. ఇప్పుడు కూడా మోడీ వ్యతిరేక టీం గా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల కూటమిలోను ఇప్పుడు అదే దర్శనమిస్తుంది.

మమత నిర్వహించిన ర్యాలీకి 26 పార్టీలకు చెందిన లీడర్లు హాజరయ్యారు. వీరిలో 10 మంది ప్రాంతీయ పార్టీల లీడర్లు అవకాశం దక్కితే ప్రధాని పీఠం ఎక్కాలి లేదా చక్రం తిప్పాలన్న ఉద్దేశ్యమే హిడెన్ ఎజెండా గా కనపడుతుంది. అందుకే ప్రధాని అభ్యర్థి గా తమ నుంచి ఎవరో ప్రకటించడం లేదు కూటమి.ప్రధాని నరేంద్ర మోడీ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా కూడా ఆయన అదే చేశారు. పశ్చిమ బెంగాల్ లో బిజెపి కి చెందిన ఒకే ఒక ఎమ్యెల్యే ఉన్నారని దేశంలోని అన్ని పార్టీలు ఒక్క ఎమ్యెల్యే కోసం ఐక్యమై ర్యాలీ చేశారని విపక్షాల ఐక్యతను ఒక్క చేత్తో తీసిపారేసి ఈ వ్యవహారాన్ని చిన్నది చేసేసారు. తమ ఎమ్యెల్యే సత్య మార్గం లో వెళ్లడం బెంగాల్ సర్కార్ దుర్మార్గాలను నిలదీయడమే వీరి కలవరపాటుకు కారణమని మోడీ తనదైన శైలిలో తీసిపారేశారు.

ఇలా ప్రధాని విపక్షాలకు షాక్ ఇవ్వడం కూడా చర్చనీయమే అయ్యింది.దేశంలో అనేక సమస్యలు ముప్పిరిగొని వున్నాయి. మౌలిక వసతులు సక్రమంగా లేని స్థితి. నిరుద్యోగ సమస్యలు వెంటాడుతున్నాయి. డాలర్ పెరుగుదల రూపాయి క్షీణతతో దేశ ఆర్ధిక పరిస్థితి ఊగిసలాడుతోంది. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుల బతుకులు ఛిద్రం చేస్తుంది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతుంది కానీ దేశంలో ఇంకా విద్యుత్ వెలుగులకు నోచుకోని వేల గ్రామాలు పాలకులను వెక్కిరిస్తున్నాయి. తాగు సాగునీటి సమస్యలు కరాళ నృత్యం చేస్తూ గత ప్రస్తుత ప్రభుత్వాల అసమర్ధతను ఎత్తి చూపుతున్నాయి. ఇవన్నీ రాత్రికి రాత్రి తీరే సమస్యలు కాదు కానీ వీటిని సక్రమంగా విపక్షాలు అడ్రస్ చేయకపోవడం ఒకటైతే మోడీ పెడుతున్న కేసులు, ఈవీఎంలు తేడా కొట్టడం వల్లే ఓడిపోతున్నామని ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు అసలు అజెండా నే మారిపోవడం బెంగాల్ ర్యాలీ లో కనిపిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags: telugupost
Tags: modi vs local parties, congress vs modi, central party