madhu vachanam

రెండు కళ్ల విశిష్టాద్వైతం!

ఇది పూర్తిగా వైద్య విద్య ఎం బి బి ఎస్ లో శరీర నిర్మాణ శాస్త్రపాఠం- అనాటమీ-తెలుగు మీడియంలో ఉంటే- ఎలా ఉంటుందో అన్న ఊహకు- ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్నకు మధ్య జరిగిన సంఘర్షణ. కొందరికి అర్థం కావచ్చు. కొందరికి అర్థం కాకపోవచ్చు. అయితే-అర్థమయినవారికి, అర్థంకానివారికి కూడా శరీర నిర్మాణంలో మాత్రం తేడా ఉండదు కాబట్టి అందరూ తెలుసుకుంటే-

విజ్ఞానానికి విజ్ఞానం!
విచిత్రానికి విచిత్రం!
వినోదానికి వినోదం!
ఆశ్చర్యానికి ఆశ్చర్యం!

సహజంగా మనిషికి రెండు కళ్లే ఉంటాయి. కానీ చూసే చూపు మాత్రం ఒకటిగానే ఉంటుంది. ఉదాహరణకు మనకు రెండు కళ్లు ఉన్నాయని, మనచేతిలో ఉన్న ఒక పుస్తకం రెండుగా కనబడదు. అలాగే రెండు చెవులున్నా వినే శబ్దం ఒకటే. అయితే ఇవన్నీ మామూలు నరమానవులకు. కొందరికి కొన్ని మానవాతీత శక్తులుంటాయి. వారికి ఏకకాలంలో రెండు కళ్లల్లో రెండు వేరు వేరు దృశ్యాలు దృగ్గోచరమవుతాయి. రెండు చెవుల్లో ఏ చెవికి ఆ చెవి విడి విడిగా వేరు వేరు శబ్దాలను ఏకకాలంలో వింటాయి. వీటిని పురాణాల్లో అతీన్ద్రియ శక్తులు అన్నారు. ఆధునిక మహాభారతంలో ఎవరి పురాణం వారిది కాబట్టి ఆ శక్తుల మనుగడను కూడా గుర్తించాల్సిందే. కాదనడానికి వీల్లేదు. పైగా మన కళ్లముందే నడిచే ఉదాహరణలున్నప్పుడు ఒప్పుకోకుండా ఎలా ఉండగలం?

అయితే ఇక్కడ ఒక చిక్కుంది. రెండు కళ్లు-రెండు దృశ్యాలు; రెండు చెవులు- రెండు శబ్దాలకే ఇది పరిమితమయితే ఏవో శక్తులు అని నమస్కరించి వదిలేయవచ్చు. రెండు నాలుకలు- వేల మాటలు;
ఒక మనసు- లక్ష వైరుధ్యాలు;
ఒక మనిషి- లోపల వేల మనుషులు;
ఒక మెదడు- కోట్ల పరస్పర విరుద్ధ ఆలోచనలు- ఉన్న మనుషులు ఎక్కువయ్యేసరికి అనాటమీ ప్రొఫెసర్లకు పాఠాలు తిరగరాయలేక బాగా ఇబ్బందిగా ఉంది. అలాగని చూస్తూ చూస్తూ వదిలేయనూ లేరు. ఆధునిక శరీర నిర్మాణానికి వీలుగా అనాటమీ పాఠాలను అప్ డేట్ చేయకపోతే భవిష్యత్ తరాలు అనాటమీ ప్రొఫెసర్లను క్షమించవు.

రెండు నాలుకలు భౌతికంగా కనిపిస్తాయా? పాములా ఒక నాలుకే చివర రెండుగా చీలి ఉంటుందా? రెండు కళ్లు ఒక దృశ్యాన్ని కాకుండా రెండు, మూడు, నాలుగు. . . వెయ్యి దృశ్యాలను ఒకేసారి చూసే మనుషుల కనుగుడ్లు, రెటీనా, ఆ రెటీనాతో మెదడుకు కనెక్ట్ అయిన నాడులు దేనికవిగా మామూలువారికంటే ఎక్కువగా ఉంటాయా? ఇలాంటివారికి కన్నీళ్లు వచ్చినప్పుడు మామూలు మగ్గు కాకుండా రిజర్వాయర్ అవసరమవుతుందా? అన్నవి లోతుగా పరిశోధించి, సిద్ధాంతీకరించకపోతే నేత్ర వైద్య విద్యకు పెద్ద దృష్టిలోపంగా మిగిలిపోదా? ఒక్క నాలుక- వంద నాలుకలుగాచీలి మాటలు వ్యక్తం కావడాన్ని అనాటమీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేయకపోతే – చెవి ముక్కు గొంతు – ఈ ఎన్ టీ- డాక్టర్ల వైద్యానికి చెవి ముక్కు గొంతు ముసేసినట్లు కాదా?

ఆధ్యాత్మికంలో కూడా ఈ ఒకటి- రెండు సిద్ధాంతాలమీద వేల ఏళ్లు రాద్ధాంతాలు జరిగాయి. ద్వి అంటే రెండు; అ ద్వి అంటే రెండు కానిది- అంటే ఒకటి. అదే అద్వైత సిద్ధాంతం. ఇందులో మళ్లీ విశిష్టాద్వైతం వేరు. అసాధారణ శరీరనిర్మాణమున్నవారి దృష్టిలో రెండు కానిది ఒకటే కానక్కర్లేదు. రెండు కానిది మూడు, నాలుగు . . . వేలు . . . లక్ష . . .ఎన్నయినా కావచ్చు. అద్వైతమంటే ఇదే అని వారంటే ఏ వ్యాకరణవేత్త, ఆధ్యాత్మికవేత్త కనీసం కాదనికూడా అనలేడు. అదే వ్యాకరణసిద్ధాంతంలో ఉన్న సంక్లిష్టత. మనకెలా కావాలో అలా అన్వయం సాధించుకోవచ్చు. పండితులు ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడంతో నిమిత్తం లేదు.

ఆధ్యాత్మిక విశిష్టాద్వైతానికి- ఆధునిక రాజకీయ విశిష్టాద్వైతానికి అర్థాన్వయంలో అంతర్గతంగా లోతయిన సంబంధముంది. కాకపోతే ఎవరికి ఏ అర్థం కావాలో ఆ అర్థమే తీసుకోవచ్చు. నిజానికి ఆధునిక విశిష్టాద్వైత సూత్రాల ప్రకారం ప్రతిమాటకు దాని అసలు అర్థం కాక, వ్యతిరేకార్థంలో వేయి మాటలు పుట్టించాలి. ఆ వేల మాటలను చెప్పీ చెప్పకుండా చేతల్లో చేసి చూపించాలి. ఇదంతా చదివిన తరువాత అద్వైత, విశిష్టాద్వైత, ఆధునిక మహా విశిష్టాద్వైత భావనలమీద క్లారిటీ వస్తే బాధ్యత నాది కాదు. రాకపోతే వీటి మీద సర్వ హక్కులు ఉన్నవారు మనమధ్యే ఉన్నారు. వారిని సంప్రదించగలరు.

-పమిడికాల్వ మధుసూదన్