home page

లక్ష మెదళ్ళను కదిలించిన కాళోజీ కలం ధిక్కారం

తెలంగాణ కవితకు చిరునామా

 | 
Kaloji

సెప్టెంబర్ 9 కాళోజి జయంతి

ఒక్క సిరా తో లక్ష మెదళ్ళను
 కదిలించిన ధిక్కారస్వరం!
 రచన: వడ్డేపల్లి మల్లేశము 9014206412
 

        ధిక్కార స్వరాన్ని వినిపించి, ప్రజా పక్షాన నిలిచి తెలంగాణ యాసను నిజమైన భాషగా నినదించి మన భాషకు పట్టాభిషేకం కట్టిన భాషా చరిత్రకారుడు kaloji. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ జయంతి రోజైన సెప్టెంబర్ 9 ని ఇకనుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
    కాళోజీ ప్రజాకవి ఎలా కాగలిగాడు:-

     ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగునే ప్రామాణికమైన భాష అని గత ప్రభుత్వాలు నిర్ణయించడం ఒక విధంగా తెలంగాణ భాష యాస లను అగౌరవ పరచడం అని నినదించిన కాలోజి రాష్ట్రంలో చలామణిలో ఉన్న అన్ని మాండలికాలకు చారిత్రక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రశ్నించేవాడు. తెలంగాణ భాష అన్న యాస అన్న అపారమైన అభిమానం ఉన్న kaloji తన రచనలన్నీ  మాండలికం లోనే కొనసాగించాడు.
       ఏ కవికైనా ఉండాల్సిన మూడు లక్షణాలను కాలోజి నుండి మనం గ్రహించవచ్చు. ప్రస్తుతం రచనలు చేస్తున్న ఆధునిక కవులు అప్పుడప్పుడు ఈ కవితా లక్షణాలను విస్మరిస్తున్న ప్పటికీ అర్థవంతమైన సాహిత్యమైనా మానవతా కోణం లేనప్పుడు అది  నిరర్థక మే.1 సరళ భాష2 దిక్కార స్వరం3 మానవతావాదం.
 జనం భాషను ఎంచుకుని ప్రజల భాషలో రాశాడు కనుకనే రచన నా గొడవ ప్రజలకు దగ్గరయింది. సామాన్య ప్రజల కష్టాలను వర్ణించిన నా గొడవ ప్రజలభాషలో లేకుంటే అది ఎవరికీ పట్టక పోయేది.
      వేమన శతకం లోని పద్యాలు ప్రజా జీవితానికి దర్పణం పట్టినట్లు, వీరి సరళమైన భాష వల్ల వేమన లాగే ప్రజాకవి కాగలిగాడు." నాది పలుకుబడుల భాష బడి పలుకుల భాష కాదు అని గ్రాంథిక భాషను దిక్కరించి ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత భాషలోనే రాయాలని సూచించేవారు. "తెలుగు భాషలో ఒక ప్రాంతం వారి భాషకు ఆధిపత్యము లభించి మిగతా ప్రాంతాల భాష హీనంగా చూడటం  అంగీకారం కాదని, రెండున్నర జిల్లాలది దండి భాష అయినప్పుడు తక్కినోళ్లకె ప్రత్యేకంగా రాజ్యం కావాల్సిందే అని కోరడంలో తప్పులేదు "అని అన్నాడు.

     తెలంగాణ భాషాభిమాని:-
^^^^^^^^^^^^^^^^^^^^
      ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి గా పనిచేసిన రాయప్రోలు సుబ్బారావు గారు తెలంగాణ యాస భాషలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. గైర్ ముల్కీ అయిన సుబ్బారావు తెలంగాణ భాషను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించిన  కాళోజీ ప్రతిస్పందన ఇది.
" లే మావిచిగురు లను  లెస్సగా మెసేవు
  రుతు రాజు వచ్చెననిఅతి సంభ్రమంతోడ
 మావి కొమ్మ ల్మీద మైమరచి పాడేవు
 తిన్న తిండేవ్వా రిదే కోకిలా
  పాడుపాటెవ్వా రిదే కోకిల "అని చురకలంటించారు.
 మాతృభాషపట్ల  నిర్లక్ష్యంతో పరభాష మోజులో ఉన్న వారిని ఉద్దేశించి
" తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
 సంకోచ పడి యేదవు సంగతేమిటిరా
 అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
 సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?
 1942 లో రాసిన ఈ కవిత ఇప్పటికీ మనకు వర్తిస్తుంది. తల్లి భాషను అగౌరవపరిచే సంస్కారాన్ని వీడాలని అన్యభాషను భుజాలపై
 మోషే వైఖరిని ఎండగట్టాలని కాలోజి ఏనాడో చెప్పాడు.
        మానవతావాది kaloji:-
      *****************
     శ్రీ శ్రీ  చే  ప్రశంసించ బడిన కాళోజి అసలైన మానవతావాది. ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే కాలోజినా గొడవ కు సామాన్య మనిషి కేంద్రం. మానవుని కేంద్రం చేసుకోకుండా సమాజ విశ్లేషణ చేయలేమని భావించిన protagoras తత్వవేత్త తో ప్రారంభమైన మానవతావాదం క్రమంగా పరిణామము చెంది అనేక రూపాలుగా మారిపోయింది. మానవతావాదం అన్ని కోణాలను విలీనం చేసుకున్న kaloji తన ఆత్మకథలో
" నానాఇజాల అడుగున చూడ నా ఇజం దే అగుపడు జాడ" అని మానవుడే అన్నిటికి కొలమానం అనే భావనను  ప్రోటాగారస్
 స్వీకరించగా, ప్రశ్నించే భావం ఉన్న వాడే మనిషి అనే దోరణిని ఎం.ఎన్.రాయ్ నుంచి గ్రహించాడు kaloji.
         ఇజాలు ముఖ్యం కావని, మానవుని మూర్తిమత్వ వికాసానికి దోహద పడకపోతే నిరర్ధకమని హెచ్చరించాడు.
      మనిషి -సమాజం- కాళోజి:-
      ***********************
        మనిషిని సాటి మనిషిగా చూడగలిగేది నిజమైన సమాజమని ఈ క్రమములో ప్రజాస్వామిక పౌర హక్కులకు భంగం వాటిల్లితే సహించే వాడు కాదు. సభలు సమావేశాల సందర్భంలో అడ్డుకున్న, అభ్యంతర పెట్టిన పోలీసు వారిని నిక్కచ్చిగా మందలించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.  కాళోజీని  హింసా వాది, ఉగ్రవాది అని కొందరు విమర్శిస్తే తన "నా గొడవలో" స్పష్టమైన వివరణ ఇచ్చాడు. హింస తప్పు, రాజ్యహింస తప్పు ,ప్రతి హింస తప్పు కాదు అని చెప్పారు. కాలోజి తాత్విక దృష్టి లో అన్యాయాలను ఎదిరించే ప్రతివాడు 
 చైతన్య శీలి. తిరుగుబాటు అనే బతుకు బాట గా మనుషులు మారడానికి ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్తూ  "ఆత్మకథలో"
" అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
 అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి
 అన్యాయాన్నెదిరించినవాడే నాకు ఆరాధ్యుడు" అంటాడు.
     కాలోజీ ప్రజాస్వామిక తాత్వికత:-
    ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
    భారతదేశంలోని సామ్యవాదులు అయినా ఎం.ఎన్.రాయ్, జయప్రకాష్నారాయణ వలె పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యాన్ని ఆదరించారు kaloji. ప్రజాస్వామిక విలువల పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే
 ప్రజాస్వామిక దార్శనికుడు వోల్టేరును
 తనలో జీర్ణించుకు న్నాడు.
  " నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించక పోవచ్చు. కానీ నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే నీ హక్కు కోసం అవసరమైతే నా జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతాను"
                               ----వోల్టేరు
    నేటి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయా ?ఒక్కసారి పరిశీలించండి.
     సమాజంలో  ప్రజల మధ్యన ఉన్న అంతరాలను వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ పుట్టుక ఒకే విధమైనా... జీవనవిధానంలో ఇంత తేడా ఎందుకని క్రింది రూపంలో ప్రశ్నించాడు.
1 అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒకచోట
2 హంసతూలికా లోక చోట అలిగిన దేహాలు ఒకచోట
      శ్రీశ్రీ వలనే మాత్రాఛందస్సులో మొదటి రచనలు చేసినప్పటికీ ఈ భూమిపై జరిగే అవకతవకలు, అన్యాయాలు, ఆవేదన కలిగించగా గేయాలు రాసి కవితలు వినిపించి సభలలో ఉపన్యాసాలతో ఉర్రూతలూగించే వారు.
        తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కాళోజి చేసిన కృషి ఎనలేనిది. తెలంగాణ ప్రజా సంస్కృతికి భాషకు విఘాతం కలిగినప్పుడు అలా తన స్వరాన్ని వినిపించే అణగారిన వర్గాల కోసం గళమెత్తి ప్రశ్నించేవాడు. తెలుగు ప్రజల పౌర హక్కుల కోసం ,ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మరిచి నప్పుడల్లా చురకలంటించారు .
      సామ్యవాద స్థాపనే లక్ష్యంగా పోరాడిన యోధుడు జయప్రకాష్ నారాయణ గూర్చి kaloji" పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని కీర్తించాడు". ఇవే మాటలు కాలోజి జీవితానికి కూడా వర్తిస్తాయి అనడంలో సందేహం లేదు. తన జీవితాంతం బడుగు జనుల కు బాసటగా భాషా పలుకుబడుల పరిరక్షణకు ఉద్యమకర్త గా పనిచేసిన కాలోజీ తెలంగాణ సామాజిక కవి అనడంలో అతిశయోక్తి లేదు..అందుకే ఆయన జయంతి sep9ని తెలంగాణ భాషాదినోత్సవంగా ఊరూరా,వాడవాడలా జరపాలి.

( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత, కవి, రచయిత)