madhu vachanam

మధు వచనం- చెప్పుకోదగ్గ చెప్పు కథలు

ఒక రాణిని నిలబెట్టుటలో….ఒరిగిన నరకంఠాలెన్నో?

ఒక రాజు కొడుకు ఒక ఊరిబడిలో చదువుతున్నాడు. న విష్ణు పృథివీ పతిః – అని వాక్కు. రాజు అక్షరాలా దైవం అని అర్థం. దైవమయిన రాజుకొడుకు కూడా దైవమే అవుతాడుకానీ, దయ్యం కాడు కదా? ఈ అబ్బాయేమో శుద్ధ బుద్ధావతారం. పొట్ట పొడవకూడదుకాబట్టి వాడికి అక్షరాలు వంటబట్టలేదు. వాడి అజ్ఞానంతో అయ్యవారి ఫ్రస్ట్రేషన్ ఒక పట్టాన కంట్రోల్ కావడం లేదు. దాంతో రాజుకొడుకును కొట్టాల్సిన ప్రతిసారి వాడిని కొట్టడం రాజునుకొట్టడంతో సమానమయిన నేరంగా భావించి, ఆ నేరనివారణార్థం కూలికి తెచ్చిన పిల్లలను కూర్చోబెట్టేవారట. దుర్వాసుడికి దూరపు బంధువు అయిన ఆ అయ్యవారు రాజుకొడుకు తప్పులు చెప్పిన ప్రతిసారి కూలీకి కూర్చున్న పిల్లల వీపు విమానం మోత మోగించేవాడట. కొన్నాళ్ల తరువాత రోజూ ఒళ్ళు వాచేలా దెబ్బలు తింటున్న ఈ పిల్లలను అమాయకంగా రాజుకొడుకు అడిగాడట. ఒరేయ్! బుద్ధిగా చదువుకోకుండా దెబ్బలెందుకు తింటార్రా? అని. అది విని అయ్యవారు తనను తాను రక్తం కారేలా కొట్టుకుంటుంటే – కూలికి వచ్చిన పిల్లలే ఎంత చెడ్డా అయ్యవారే!అయ్యోపాపం! అని అడ్డుకుని ఓదార్చారట.

ఈ కథ నిజంగా జరిగిందో లేదోకానీ, బాగా ప్రచారంలో ఉంది.

లండన్ లో రాణి గారు చెప్పులు లేదా బూట్లు వేసుకోవాలంటే పెద్ద తతంగమని ఒక ఆంగ్ల పత్రిక పెద్ద వ్యాసాన్ని ప్రచురించింది. చెప్పులో, బూట్లో వేసుకోవాలంటే ముందు కొనుక్కోవాలి కదా? మనలాంటి అల్పులయితే బాటాకు వెళ్లి 999 రూపాయల 99 పైసలు పెట్టి చెప్పులు కొంటాం. ఆమె సాక్షాత్తు గ్రేట్ బ్రిటన్ కు రాణి. ఆమె చిల్లరఖర్చులకు బ్రిటన్ ప్రభుత్వమే పౌండ్లకు పౌండ్లు ఇస్తున్నా, మనం అమీర్ పేట్ సర్కిల్లో కొన్నట్లు లండన్ బకింగ్హామ్ ప్యాలెస్ పక్కన హైడ్ పార్క్ రోడ్లో ఆమె చెప్పుల షాపుకు వెళ్ళలేదు. రాణివాసం రూల్స్ వెళ్ళడానికి ఒప్పుకోవు. కాళ్ళున్న తరువాత చెప్పులు వేసుకోకతప్పదు.ఈ సమస్యకు అంతః పురం ఒక అద్భుతమయిన ఐడియా కనిపెట్టింది. రాజుగారి కొడుకు బదులు వేరే పిల్లలు దెబ్బలు తింటున్నట్లు- రాణిగారి చెప్పులు, బూట్ల సెలెక్షను, కొనుగోలు, ట్రయల్ కు ఒక వ్యక్తిని నియమించింది. 27 ఏళ్లుగా ఆమె కాలి చెప్పులు, బూట్ల పర్యవేక్షకుడిగా ఒకడే ఉన్నాడు. అంతకుముందు ఇద్దరు ముగ్గురు పనిచేశారు.

రాణిగారు చెప్పులు, బూట్లు కొనాలనుకున్నప్పుడు ఈ ఇన్ ఛార్జ్ కే చెప్పాలి. చెప్పగానే ఈయన చెప్పులవేటలో పడతాడు. రంగులు , సైజ్ , చర్మం నాణ్యత , మన్నిక అన్నీ చూసి ఒక శుభముహూర్తాన ప్యాలెస్ లోకి పాదరక్షల ప్రవేశం చేయిస్తాడు. రాణి గారి పాదం సైజ్ ఉన్న ఒక మహిళకు ముందు ప్రీ ట్రయల్ గా తొడుగుతాడు. ఆమె ట్రయల్ గా భిన్న రకాలుగా అవివేసుకుని నడుస్తుంది. గుచ్చుకోకుండా , ఇబ్బందిలేకుండా అంతా సవ్యంగా ఉందని ఈ ఎక్స్పర్ట్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు అంతఃపురం ఆ చెప్పులను కొంటుంది. పొరపాటున రాణిగారు చెప్పులతో ఏమాత్రం ఇబ్బంది పడ్డారని తెలిసినా ఈ ఇంచార్జ్ పై ప్రాణాలు పైనే పోతాయి.

రాణి గారి ముందు నిలుచోవడానికి ఒక ఫార్మల్ పద్దతి , డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆమె మన ముందుకు వచ్చినప్పుడు మనం అనగా అల్పులం ఒక కాలు ఎక్కువగా , ఒక కాలు ఒక మోస్తరు వంచి తల కొద్దిగా కిందికి వంచి , చెయ్యి విరిగి కట్టుకున్నప్పుడు పెట్టుకున్నట్లుగా కుడి చేయి వంచి పొట్టమీద పెట్టుకుని అభివాదం చేయాలి. లేకపోతే రాణిగారు కుడి చెయ్యి విరిచి ఎడమచేతిలో పెడతారేమో? నా కాళ్ళమీద నేను నిలబడలేని అశక్తుడను, దయచేసి నా పొట్టమీద కొట్టవద్దు- అని ఇందులో అంతరార్థమేమో? రాణిగారు షేక్ హ్యాండ్ ఇస్తేనే మనం ఇవ్వాలి . ఆ ఇవ్వడానికి కూడా మన వేళ్ళు , అరచేయి ఎంత ముందుకు వెళ్లాలో శ్రీనివాసరామానుజన్ కు కూడా అర్థంకాని లెక్కలున్నాయి. ఇక రాణి గారు ఎవరినయినా భోజనానికి అంతః పురానికి పిలిస్తే అది మాటలు చెప్పలేని సందర్భం. నెత్తిన జుట్టు నుండి కాలిగోటి వరకు అన్నీ రాణివాసం పద్దతిలోనే ఉండాలి. ఆమె నవ్వితేనే మనం నవ్వాలి. ఆమె లేచినప్పుడు మనం కూర్చోకూడదు. ఆమె కూర్చున్నప్పుడు మనం లేవకూడదు. ఆమె ఏడ్చినప్పుడు మనం నవ్వకూడదు. ఆమె రెడ్ కార్పెట్ మీద ఉన్నప్పుడు పురుగులమయిన మనం పక్కన నిలుచుని ఉండాలి. ఆమె కారెక్కే దాకా మనం గంభీరంగా వీడ్కోలు చెప్పాలి. ఆమె చెయ్యి ఊపితే మనం 45 డిగ్రీల నుండి 90 డిగ్రీల కోణంలో మైనస్ పది డిగ్రీల చలిలో టాటా చెబుతూ చెయ్యి ఊపాలి.

అతిగా ఉన్నా మనక్కూడా ఇవే ఇష్టం. సారి, థాంక్స్ , నెవెర్ మైండ్ , షిట్ , బుల్ షిట్ , కోట్ , బూటు , టై . . . అన్నీ మనకు వాళ్ళు నేర్పినవి. మనం ఇష్టంగా నేర్చుకున్నవి.

అయినా కందకులేని దురద కత్తికెందుకు? బ్రిటిషర్లు ఇష్టంగా పాటిస్తున్నారు. ఈడ్చి కొడితే మన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జనాభాలో బ్రిటన్ దేశజనాభా మూడో వంతు కూడా ఉండదు. అయినా వారికింత గోరోజనమా? అంటే వారి మర్యాదలు వారివి. మనదగ్గర ఒక వార్డు మెంబరు టయోటా ఫార్చ్యూనర్లో దిగితేనే అడుగులకు మడుగులొత్తుతున్నాం. అలాంటిది రవి అస్తమించని బిరుదు బిళ్ళ చాలాకాలం మెడలో వేసుకుని తిరిగిన గ్రేట్ బ్రిటన్ రాణి ఆ మాత్రం దర్పం ప్రదర్శించకపోతే ఏమి మర్యాదగా ఉంటుంది?

ఈ మర్యాద పైకి ఆమెకు. తాత్వికంగా మనకు మనం చేసుకునే మర్యాద.
ఒకరాణిని నిలబెట్టుటలో ఒరిగిన నరకంఠాలెన్నో?

-పమిడికాల్వ మధుసూదన్