madhu vachanam

ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికితే నలుపు తెలుపవుతోంది!

చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో నేర్పించిన పద్యం.

“ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపేగాని తెలుపుగాదు;
కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా పలుకదు
విశ్వదాభిరామ వినురవేమ!”

ఎప్పుడో మూడు వందల సంవత్సరాలకిందట లోకసంచారం చేస్తూ వేమన్న చెప్పిన పద్యమిది. ఇప్పుడు రోజులు మారాయి. రంగులు మార్చుకునే, వేషాలు వేసుకునే, రోషాలు పూసుకునే, ఊసరవెల్లికి ఉచితసలహాలు ఇవ్వదగ్గ రూపాలు మార్చుకునే రోజులొచ్చాయి. ఇందులో మంచిని చూసేవారు మంచిదంటారు. చెడును వెతికేవారు చెడు అంటారు. మంచి చెడ్డ నిజానికి భాషలో విడదీయరాని పదాలు.

భారతదేశ నగరాల్లో మగవారి మేకప్ వస్తువుల మార్కెట్ ప్రస్తుతం ఏటా 5వేల కోట్ల రూపాయలు. అదే మహిళల మేకప్ వస్తువుల మార్కెట్ విలువ ఏటా 40 వేల కోట్ల రూపాయలు. ఎందుకో మగవారు ఈ విషయంలో బాగా వెనకబడిపోయారు. ఈ అంకెల ప్రకారం అయితే మగవారు ఇంకో వందేళ్లు రోజూ మేకప్ తిని తాగి పూసుకోగలిగితే మహిళలను దాటగలరేమో చూడాలి. అసలే సవాలక్ష వివక్ష చర్చలరోజులివి. మహిళను దాటాలని అనుకోవడమే తప్పు.

మగవారి మేకప్ వస్తువులు అంటే ఇదివరకు షేవింగ్ క్రీమ్ ఒక్కటే ఉండేదట. ఇప్పుడు ఆఫ్టర్ షేవ్ లు , మొయిశ్చరైజర్లు , ఫెయిర్ నెస్ క్రీములు, పౌడర్లు , జుట్టు రంగులు , చర్మ సౌందర్య పరిరక్షణ సన్ క్రీములు , పెర్ఫ్యూములు . . . ఇలా వింటే మహిళలే స్పృహదప్పిపడిపోయే మగవారి మేకప్ వస్తువులు మార్కెట్లలో ఉన్నాయట. ఇంకా పల్లెల్లో మగవారు మగవారిగానే ఉన్నా, నగరాల్లో మగవారు మారిపోయారని తాజా సౌందర్య సాధనాల అమ్మకాల గణాంకాలు చెబుతున్నాయి.

భారతదేశంలో వర్ణ వ్యవస్థ మీద ఎన్ని చర్చోపచర్చలు ఉంటాయో – శరీర వర్ణం మీద కూడా అన్ని చర్చలు ఉంటాయి. రంగు, రూపం, పొడువు, పొట్టి మన ఎంపిక కాదు. మన చేతుల్లో ఏమీ ఉండదు. కానీ ఏ పెళ్లి ప్రకటన అయినా- అమ్మాయి కారు తెలుపు; బస్సు తెలుపు అబ్బాయి కావలెను అనే ఉంటుంది. చలి ప్రాంతాల్లో పుట్టేవారు తెల్లగా ఉంటారు. ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యేవారు కాస్త నల్లగా ఉంటారు. ఇంతకు మించి ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు. రంగును ప్రభావితంచేసే ఇంకొన్ని విషయాలు ఉంటాయిగానీ, అవి పెద్దగా చర్చించాల్సిన విషయాలు కాదు. ఎంత చర్చించినా నలుపు తెలుపు కాదు; ఒక వేళ చర్చను ఎక్కువగా పూసుకుంటే తెలుపు నలుపు అయినా కావచ్చు.

నలుపును తెలుపు చేసుకోవడానికి మనదేశంలో పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. బ్లాక్ మనీని వైట్ చేసుకునే తాపత్రయంకూడా ఇందులో భాగమేనంటారు ఆదాయపుపన్ను వారు- అది వేరే విషయం. వివిధ రకాల మీడియా వేదికలు పెరిగినతరువాత ఈ నలుపు- తెలుపు స్పృహ, వివక్ష తగ్గాల్సింది పోయి- ఇంకా పెరుగుతోంది.
ఒక అంతర్జాతీయ మేకప్ వస్తువుల కంపెనీ ప్రకటన ట్యాగ్ లైన్-
Because you worth it man! – అని.

నెత్తిన జుట్టు లేకపోతే వరినాట్లు నాటినట్లు వెంట్రుకలు నాటుతున్నారు. యూరియా, పురుగులమందులుకూడా వేస్తున్నారు కాబట్టి ఆ వెంట్రుకలు క్షణానికో అంగుళం పెరిగి ఆరోగ్యంగా ఉంటున్నాయి. పుట్టు మచ్చలు పుట్టకముందే మచ్చలేకుండా చెరిపేస్తున్నారు. బట్టతల తలకొట్టుకోవాల్సిన పనేలేదు. కురులు దువ్వి మూడుపాయల జడలు వేసేంతగా వెంట్రుకలను పుట్టిస్తున్నారు. ప్రతిచోటా బ్లాక్ ను వైట్ చేసుకోవడానికి నానా యాతనపడతారు. జుట్టు నెరవగానే నలుపు పులుముతూనే ఉంటారు.
పొట్ట పెరిగితే పొట్టనే పరపర కోయించుకుంటున్నారు. ఆ కోతలో చాలాసార్లు ప్రాణానికి కూడా కోత పెట్టుకుంటున్నారు. మొహం మీద ముడుతలు పడకూడదు. శరీరం మీద ఎండ పడకూడదు. గాలి తగలకూడదు. ఆ సోపు పడదు . ఈ షాంపూ పడదు. ఆ క్రీములే ఉండాలి. ఆవిరి స్నానాలు, ముల్తానీ మట్టి పూతలు, గంధం పొడి పట్టీలు.

విత్ అవుట్ ఆయిల్ , విత్ అవుట్ షుగర్ , విత్ అవుట్ సాల్ట్ , విత్ అవుట్ రైస్ . . . ఏదయినా విత్ అవుటే కావాలి. వయసు 50 దాటాక తరుగుదలే కానీ- పెరుగుదల ఉండదు కాక ఉండదు. కానీ యాంటీ ఏజింగ్ క్రీములు, మందులు , ఆహారాలు కనపడగానే నిముషానికి పదేళ్లు మన వయసు తగ్గుతూ ఉంటుంది.

మొహంలో తేజస్సు, వర్చస్సు, చైతన్యం;
కళ్ళల్లో కాంతి;
మనసులో ఆనందోత్సాహాలు;
మనిషిలో మనిషితాలూకు మానవత్వం రావాలంటే ఎన్ని ఫేషియల్ క్రీములు రాయాలి?
ఎన్ని కోతలు కోయించుకోవాలి?
ఎన్ని ఉపవాసాలుండాలి?
ఎన్ని లేజర్ ట్రీట్ మెంట్లు చేయించుకోవాలి?
ఎవరయినా చెప్పగలరా?
చెప్పి గ్యారెంటీ ఇవ్వగలరా?

చదువు సంధ్యలు;
తెలివి తేటలు;
మేధస్సు విజ్ఞానాలు;
నీతి నియమాలు;
సంస్కారాలు . . . ఏవీ లేకుండా యూ వర్త్ ఇట్ అనగానే క్రీములు పూసుకుని ఊరేగితే- ఆ కంపెనీకి వినియోగదారుడిగా మాత్రమే యూ వర్త్ ఇట్ అవుతావు.

ఇదివరకు రేడియోలో సంస్కృత పాఠానికి ముందు సిగ్నేచర్ ట్యూన్ గా భర్త్రుహరి శ్లోకం వచ్చేది.

“కేయూరాణి న భూషయంతి పురుషం;
హారాన చంద్రోజ్వలా;
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా;
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే;
క్షియంతేఖిల భూషణాని సతతం;
వాగ్ భూషణం భూషణం “-
అని .
నగలు, బొట్లు , జడకట్లు, హారాలు, క్రీములు, పూలు, గంధాలు ఇవేవీ అసలు అలంకారాలేకాదు. పైగా ఇవన్నీ ఎండకు వానకు గాలికి పోయేవి. చక్కటి వాక్కు ఒక్కటే మనిషికి నిజమయిన సంస్కారం, అలంకారం.

లోరెల్ వాడికి ఈ శ్లోకం తెలిస్తే-
యూ డోంట్ వర్త్ ఇట్ మ్యాన్- అని భర్త్రుహరినే తిడుతూ ట్యాగ్ లైన్ రాస్తాడేమో?

-పమిడికాల్వ మధుసూదన్