ap cs lv subramanyam

టీటీడీ అధికారులతో సీఎస్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే  ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం గురించి ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. ఈ విషయంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక అందచేస్తామని తెలిపారు. దేవాదాయ శాఖకు చెందిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమగ్ర వివరాలను సేకరించాలని ఆదేశాలు ఇచ్చామని, ఆలయాల్లో అన్యమతస్తులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల పవిత్రత కాపాడటమే లక్ష్యంగా అవసరమైతే నివాస గృహాల్లో ఆకస్మిత తనిఖీలు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

బస్సు టికెట్లలో అన్యమత ప్రచార ఘటనలు జరగడం బాధాకరమని, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. మరోవైపు అన్నమాచార్యుల తాళపత్ర గ్రంధాలను సమాజానికి ఉపయోగపడేలా తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు తిరుమల మ్యూజియం సేవలను మరింత మెరుగ్గా అందించడంపై చర్చించామని ఆయన తెలిపారు. ఇక ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో రూ.5కోట్ల కుంభకోణంపై సీఎస్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సెప్టెంబర్‌ 30 నుంచి జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనపై కూడా టీటీడీ అధికారులతో చర్చించారు. అంతకు ముందు ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు.