ktr comments on Ap capital amaravathi

మాకు మీకు అదే తేడా.. అమరావతిపై కేటీఆర్ కామెంట్స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ మంత్రులు కామెంట్లు చేస్తూనే వున్నారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కోడిపందేల్లో పాల్గొని తనదైన రీతిలో ఏపీ రాజకీయాలను విశ్లేషించారు. పనిలో పనిగా చంద్రబాబుని తూర్పారబట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వంతు వచ్చినట్టుంది. అమరావతి ఆందోళనలు, మూడు రాజధానుల అంశంపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.అమరావతిలో రాజధాని మారుస్తామంటే ఆందోళనలు చేస్తున్నారని… తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల విభజన పూర్తిచేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. జిల్లాలను విడగొట్టడం సాధారణ విషయం కాదని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా సీఎం కేసీయార్ వ్యవహరించారని ఆయన చెప్పుకొచ్చారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఎక్కడా చిన్న ఆందోళనలు, పోలీసుల బందోబస్తు లేకుండా కేసీఆర్ విజయవంతంగా, సమర్థవంతంగా  పరిపాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.ఏపీలో రాజధాని మార్పుపై ఇంత ఆందోళన, వ్యతిరేకత ఎందుకు వస్తోందో ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో రాజధాని అంశంపై ఆందోళనలు, నిరసనలతో రచ్చరచ్చగా మారింది. పోలీసుల చర్యలను కోర్టు సైతం తప్పుబట్టింది. ఇవాళ్టికి 32వ రోజుకి రాజధాని రైతుల ఆందోళన చేరుకుంది. తాజాగా కేటీయార్ వ్యాఖ్యలు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ చర్చకు దారితీశాయి.