vasudha rani vasthumaarpidi

కాకిబొడ్డు-కథలు రచయిత-చిరంజీవి వర్మ

కొడికూరా-చేపల పులుసు ‘ అంటూ పతంజలి శాస్త్రి గారి ముందుమాటతో మొదలైన పుస్తకం.ఈ కథల సాఫల్యం గురించి చెపుతూ శాస్త్రిగారు “కొన్ని పాత ఛాయా చిత్రాలు చూసినప్పుడు కలిగే ఆసక్తి, తెలియకుండా పెదాల్ని విప్పే చిరునవ్వు వంటివి”ఈ కథలు అని తేల్చారు.

వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారు ‘కథాచిరంజీవం’ అంటూ మీరు ఇలాంటి కథలే రాయండి మిగతాది మేము చూసుకుంటాం అంటూ వర్మగారికి భరోసాని,ఆశీర్వదాన్ని ఇచ్చారు.

‘పరదా చూసిన వెలుగు నీడలు ఈ కథలు’ అంటూ నండూరి రాజగోపాల్ గారు ఈ కథల్లోని గుట్టుమట్లను విప్పారు.

ఐతే తమదైన ఈ రాజుల సామ్రాజ్యంలోకి ప్రవేశించటానికి మన మెదళ్లను కొంత సమాయత్తం చేసుకోవాలని ‘సమవుజ్జి’ కథ చడవుతుండగా నాకు అర్ధం అయ్యింది.చిన్నతనంలో కె వై ఎన్ పతంజలి గారి ‘గోపాత్రుడు’ ‘రాజుగారు వారి వీరబొబ్బిలి’ గుర్తుచేసుకున్నా ,సునిశితమైన వ్యంగ్యం ప్రత్యేకతగా గల సాహిత్యం అది.

రెండవ కథ ‘ అహం బ్రహ్మాస్మి’ దగ్గర నుంచి వర్మగారు అర్ధం అయ్యారు నాకు. పెద్దకథలను చదవవటానికి అంతగా ఇష్టపడని నేను ఎత్తిన కథను వదలకుండా చదివేశాను.సత్తి బాబుగారి వేదాంతం అర్ధం చేసికోవటానికి ఆ ఊరి వారిలాగా నాకూ చాలా సమయమే పట్టింది.బురద చిమ్మిన కారుపై రాయి విసిరిన పిల్లాణ్ణి చేరతీసినదాకా ఆయన మెట్టవేదాంతి అనే అనుకున్నాను.చివరిదాకా తాయిలం దాచి ఉంచటం వర్మగారి అద్భుతమైన టెక్నిక్ ప్రతి కథలోనూ అది ప్రస్ఫుటం అయింది.

‘ఆట’ ,,’ఏనిమిషానికి’ కథలలో అంబర్ సైకిల్ ని, విల్లు అంబుల్ని వాడిన పద్ధతి కాదేదీ కథకు అనర్హం అనిపించింది.ఆ కథల్లో అవే ముఖ్య భూమికలు.

‘జ్ఞాపిక’ కథ చిరంజీవి వర్మ గారికి ఈ కథల తాలూకూ వాస్తవం తో ఉన్న అనుబంధం తెలిపి మన మనసులు కూడా కొంచెం భారం అయ్యేలా చేసింది. చిన్నప్పుడు అమ్మమ్మా వాళ్ళు కాగితాలు ,మెంతులు నాన బెట్టి చేటలు అలికిన దృశ్యాలు గుర్తుకు వచ్చాయి.

‘భ్రమ’ కథని ఒక్కసారి చదివితే చాలదు రెండవ సారి చదివినా కూడా మనంకూడా అంతా మన భ్రమే అనుకోలేం పెద పరశురామరాజు గారి పాలేరు వెంకడిలా రేణుకకి అసలు విషయం తెలుసేమోనని అనుమానిస్తాం.

‘ఏనిమిషానికి’ కథలో మట్ట ,పుచ్చు వార్లకి ఆపేర్లు ఎందుకు వచ్చాయో చెప్పిన వైనం, ఆ కథలో త్రిలోచనరాజు తోటలో ప్రతి అంశాన్ని వివరించిన వైనం కథా రచయిత నైసర్గికత పట్ల కూడా ఎటువంటి అవగాహన కలిగి ఉండాలో తెలుస్తుంది.

‘మరాద్దప్పేరు’ కథ తీసుకున్న మలుపు అమోఘం ఆ కథకి నేను అలాంటి ముగింపు ఊహించనే లేదు.

‘శిక్ష ‘కథ భార్యని అమితంగా ప్రేమించే భర్త నిస్సహాయతకు
అద్దం పట్టే కథ అమాయక బాలుడు చిరంజీవి తెలియకుండా చేసిన మంచి పని పర్యవసానం మనకి కంటిచెమ్మ కలిగిస్తుంది.

దాట్ల దేవదనంరాజు గారి ‘ఒకానొక ఆత్మీయరాగాలాపన’,కె ఎన్ మురళీ శంకర్ ‘మిత్రవాక్యం’ తో ఈ రాచరికపుటంతఃపురాల కథలు ముగిస్తాయి.

ఐతే ఇందులోని పాత్రలు, పరిసరాలు, పరిస్థితులు , మానవీయ కోణాలు, దాస్టీకాలు ,దోపిడీ కొన్ని రోజులు మన వెంటే ఉండి.ఆలోచింప చేస్తాయి. మరిన్ని అనుభవాలు మనవి అవ్వటమే కదా నిజమైన సాహిత్య ప్రయోజనం.ఈ ప్రయత్నంలో చిరంజీవి వర్మ గారు కృతకృత్యులు అయ్యారు.అభినందనలు వారికి.