“జాజిపూల పందిరి” ఆవిష్కరణ

ఈ నెల పదవ తేదీన కాకినాడ NFCL రోడ్ లోని ‘శేఫాలిక’ లో డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారు రచించిన ‘జాజిపూల పందిరి’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమమం జరిగింది. సాధారణ ఆవిష్కరణలకు విభిన్నంగా యువపాఠకుల సమీక్షలతో,వాడ్రేవు సుందరరావు గారి అధ్యక్షతన వినూత్నంగా జరిగింది.రవిశంకర్ ఆదిరరాజు జాజిపూల బుట్టలో నుంచి పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాడ్రేవు అమృత పూర్ణ,పులగుర్త సాయి మల్లిక పుస్తకంలోని కాలమ్స్ ని చక్కగా విశ్లేషించారు. తిరుమాని నిర్మల,వాడ్రేవు రాధిక గార్లు నిత్యజీవితంలోకి ఈ జాజిపూల పందిరి సౌరభాలను ఎలా అనుభవంలోకి తెచ్చుకోవచ్చో, రచయిత్రి అందించిన జీవన సూత్రాలను వివరించారు.

వాడ్రేవు వీరలక్ష్మీదేవి రచించిన ‘ఉత్సవ సౌరభం’ కథా సంకలనం పై శ్రీ కస్తూరి మురళీశంకర్ ప్రసంగించారు.
ఈవిడే రచించిన మరో వ్యాసాల సమాహారం ‘భారతీయ నవలా దర్శనం ‘ పై పలువురు సమీక్షకులు మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ భాషలలో గల అరవై నవలపై రచయిత్రి రాసిన సమగ్ర వ్యాసాల సాహితీ ప్రయోజనం అపూర్వం అంటూ ప్రశంసించారు. రచయిత్రి వందన సమర్పణతో సభ ముగిసింది.ఆద్యంతం రసవత్తరంగా సాగిన సభకు కాకినాడ లోని పలువురు సాహితీప్రియులు హాజరు అయ్యారు.