home page

శ్రీ లంకలో కొనసాగుతున్న అనిశ్ఛితి:పారిపోయిన అధ్యక్షుడు

లంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే రాజీనామా 

 | 
లంక
ఎం కోటేశ్వరరావు
ఆర్ధికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో శనివారం నాడు (2022 జూలై 9) జరిగిన అనూహ్య పరిణామాల్లో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికారిక నివాసం నుంచి పారిపోయినట్లు వార్తలు రాగా, ప్రధాని రనిల్‌ విక్రమ సింఘే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. విక్రమ సింఘే ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు వార్తలు. ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ గొటబయ రాజీనామా కోరుతూ శనివారం నాడు ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన పూర్వరంగంలో రాజధాని కొలంబో, ఇతర అనేక ప్రాంతాలలో పోలీసులు శుక్రవారం రాత్రి కర్ఫ్యూ విధించటాన్ని అనేక మంది వ్యతిరేకించటంతో శనివారం ఉదయం సడలించారు. పోలీసు ఆంక్షలను ఖాతరు చేయకుండా వేలాది మంది గొటబయ నివాసంలో ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే ప్రజల ఆగ్రహాన్ని పసిగట్టిన గొటబయ శుక్రవారం రాత్రే ఒక సైనిక కేంద్రానికి వెళ్లి తలదాచుకున్నట్లు చెబుతున్నారు. ఇది రాసిన సమయానికి ఎక్కడ ఉన్నదీ నిర్దారణ కాలేదు, రాజీనామా బాటలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కొద్ది వారాల క్రితం గొటబయ సోదరుడు, ప్రధానిగా ఉన్న మహింద రాజపక్స నివాసం ఎదుట నిరసన ప్రదర్శనల కారణంగా రాజీనామా చేసి ట్రింకోమలీలోని మిలిటరీ నౌకా కేంద్రంలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.
అసాధారణమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో మార్చి 15 నుంచి ప్రారంభమైన ప్రజల ఆందోళన తీవ్రతరం అవుతున్నది. గొటబయ కుటుంబపాలన, అనుసరించిన విధానాలు దేశాన్ని అన్ని విధాలుగా అస్తవ్యస్తం గావించాయి. ప్రజల నిరసనలు ప్రారంభమైన తరువాత వేగంగా మారిన అనేక పరిణామాల్లో ప్రభుత్వం ఐఎంఎఫ్‌కు, అమెరికాకు మరింత దగ్గరైంది. గతంలో అప్పులిచ్చి, కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న చైనా చేతుల్లోకి లంక వెళ్లిందని ఊరూవాడా టాంటాం వేసిన మీడియా మారుతున్న పరిణామాల గురించి మౌనం దాల్చింది. అంతేకాదు ముస్లిం విద్వేషాన్ని విపరీతంగా రెచ్చగొట్టిన లంక పాలకులు ఇప్పుడు చమురు కోసం అరబ్బు దేశాలకు దగ్గర అవుతున్నారు. వారి షరతులకు సలాం అంటున్నారు. ” సార్థక ప్రజాస్వామిక పాలన ”ను ప్రోత్సహించే పేరుతో ”అంతర్జాతీయ అభివృద్ధికోసం పని చేసే అమెరికా సంస్థ( యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. జూన్‌ చివరిలో ప్రధాని రానిల్‌ విక్రమ సింఘే ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఇందుకు గాను 5.7 కోట్ల డాలర్లను గ్రాంటుగా అమెరికా ఇవ్వనుంది, 2026వరకు ఈ పధకం కొనసాగుతుంది. గతంలో 2011లో మహింద రాజపక్సే ప్రభుత్వం కూడా ఇదే సంస్థ నుంచి రెండు పధకాలను అమలు జరిపిందని విక్రమ సింఘే గుర్తు చేశాడు.
2019లో శిరిసేన-విక్రమ సింఘే ప్రభుత్వం అమెరికాకు చెందిన మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌(ఎంసిసి) నుంచి 48 కోట్ల డాలర్లు గ్రాంటుగా తీసుకొనేందుకు ముందుకు రాగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గొటబయ సోదరులు వ్యతిరేకించారు. ఈ మొత్తంతో కొలంబో నగరంలో ట్రాఫిక్‌, బస్‌ సర్వీసులు, దేశంలో కొన్ని రోడ్లను మెరుగుపరిచేందుకు పూనుకుంటామని అప్పుడు చెప్పారు. ఈ గ్రాంటు తీసుకుంటే దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగులుతుందని, ఈ పేరుతో ఎంసిసి ప్రాజెక్టులకు అనేక పన్ను రాయితీలు ఇచ్చే ప్రమాదకరమైన షరతు దాగుందుని ప్రతిపక్షం పేర్కొన్నది. తరువాత అధికారానికి వచ్చిన గొటబయ సర్కార్‌ ఎంసిసితో ఒప్పందంపై సంతకాలను జాప్యం చేసింది. 2021 నవంబరులో సంతకాలు చేసేది లేదని చెప్పగా ఆ పధకాన్ని రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆ సొమ్ము గనుక తీసుకొని ఉంటే ఇప్పుడు వచ్చిన విదేశీమారకద్రవ్య సంక్షోభాన్ని కొంత మేరకు అధిగమించి ఉండేవారమని అమెరికా మద్దతుదారులు చెబుతున్నారు.
తాజాగా గొటబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గంముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగపరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్ధిక లబ్ది లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. మన దేశం చేసిన నగదు, వస్తు సహాయానికి గాను ప్రతిఫలంగా అదానీ కంపెనీకి ఒక విద్యుత్‌ ప్రాజెక్టును అప్పగించే విధంగా స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు వచ్చిన అంశం తెలిసినదే. ఇక అమెరికా షరతులకు సంబంధించి వచ్చిన వార్తల ప్రకారం ఐఎంఎఫ్‌ షరతులను లంక సర్కార్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌లను తెరవెనుక నుంచి నడిపించే ధనికదేశాల్లో అమెరికాది నాయకత్వ స్థానం అన్నది తెలిసిందే. సంస్కరణల పేరుతో వాటి పెత్తనాన్ని రుద్దటం అనేక దేశాల్లో చూస్తున్నాము. లంకలో కూడా అదే జరగనుంది. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30నాటికి పదిరోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశంలో జూన్‌ నాటికి పన్నెండు నెలల్లో ద్రవ్యోల్బణం 54.6శాతానికి, ఆహార వస్తువుల ధరలు 80.1శాతం పెరిగాయి. చమురును సరఫరా చేయాలంటే తమకు ముందుగానే డబ్బు చెల్లించాలని లేదా శ్రీలంకేతర దేశాల బాంకుల నుంచి హామీ ఇప్పించాలని అమ్మకందారులు అంటున్నారు.
చమురును ఏదో విధంగా సంపాదించాలనే వత్తిడి కారణంగా గతంలో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టినదాన్ని దిగమింగి అప్పుగా ముడిచమురు, గాస్‌ ఇప్పించాలంటూ కతార్‌కు గొటబయ సర్కార్‌ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. కతార్‌ను మంచి చేసుకొనేందుకు లంకలో పనిచేస్తున్న కతార్‌ ఛారిటీ అనే కతార్‌ ప్రభుత్వ సంస్థ మీద నిషేధాన్ని వెనక్కు తీసుకుంది.2019లో జరిగిన ఉగ్రవాద చర్యలకు ముస్లింలే కారణమని, వారికి కతార్‌ ఛారిటీ నిధులు అందచేసిందని ప్రభుత్వం విమర్శించింది. సదరు సంస్థ నిధులను ప్రభుత్వం స్థంభింపచేసింది. అంతే కాదు కరోనా కారణంగా మరణించిన ముస్లింల శవాలను ఖననం చేస్తే భూమి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని గొటబయ సర్కార్‌ నిషేధం విధించింది.
శ్రీలంక ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ కతార్‌ సర్కార్‌ కరుణించలేదు. ఐఎంఎఫ్‌తో చేసుకొనే ఒప్పందాన్ని బట్టి తాము వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్‌ ప్రభుత్వం కూడా సాయానికి సిద్దం అంటూనే తమ సంగతి కూడా తేల్చాలని మెలికపెట్టింది. తాము చమురు సరఫరాకు అవసరమైన 360 కోట్ల డాలర్లు ఇస్తామని, దానికి గాను చెల్లించే వడ్డీ బదులు చమురు తవ్వకాలకు గాను లంకలో కొంత ప్రాంతాన్ని తమ అప్పగించాలని షరతు పెట్టగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. నెలకు 30 కోట్ల డాలర్ల చొప్పున 12నెలల్లో రుణం ఇస్తామని, దాన్ని ఐదు సంవత్సరాల విరామం తరువాత పదిహేను సంవత్సరాల్లో చెల్లించాలని ఒమన్‌ ప్రతిపాదించింది. దీని సంగతి కూడా తేలిస్తే తాము చమురు కొనుగోలుకు రుణం ఇస్తామని లంకలో ఒమన్‌ రాయబారి స్పష్టం చేశారు.ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవటమా లేదా అన్నది లంక సర్కార్‌ ఇష్టమని దాని కంటే ముందు ఇప్పటికే రుణాలు ఇచ్చిన దేశాలు, సంస్థల రుణాల చెల్లింపుల పునర్వ్వస్థీకరణ సంగతేమిటన్న ప్రశ్న ముందుకు వచ్చింది. తమ రుణాల చెల్లింపుల గడువులో ఎలాంటి మార్పుకు అంగీకరించేది లేదని చైనా చెబుతున్నట్లు వార్తలు. ఐఎంఎఫ్‌, అమెరికా ప్రభావంలోకి లంక వెళ్లిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది సహజంగానే చైనా లేదా మరొక దేశానికి అనుమానాలు తలెత్తుతాయి.మన దేశం రష్యా నుంచి చౌక ధరలకు ముడిచమురు కొనుగోలు చేసి శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇబ్బందుల నుంచి ఆదుకొనేందుకు నాలుగు వందల కోట్ల డాలర్లను రుణంగా ఇచ్చింది. అందువలన భారత్‌ కూడా అప్పు తీర్చమని గట్టిగా అడుగుతుందా లేక వాయిదా వేయాలంటే అదానీ, అంబానీల వంటి వారికి దొడ్డిదారిన మరికొన్ని ప్రాజెక్టులను అప్పగించాలని డిమాండ్‌ చేస్తుందా అన్నది ప్రశ్న.