భారతీయులు మింగేస్తున్నారు అడ్డగోలుగా యాంటీబయాటిక్స్

భారతీయులు మింగేస్తున్నారు
అడ్డగోలుగా యాంటీబయాటిక్స్
భారతీయులు యాంటీబయాటిక్స్ మింగేస్తున్నారు . జనం తింటున్నది ఆహారం కాదు.. ఔషధాలు.. అడ్డగోలుగా తెగ తినేస్తున్నారు..
అది కూడా ప్రభుత్వ గుర్తింపులేని ఔషధాలే.. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 500 కోట్ల యాంటీబయాటిక్స్ మాత్రలు మింగారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం అవుతుంది . ఇందులో ప్రైవేటు వైద్యరంగంలోనే 85-90 శాతం మందులు వాడారు.
ఈ దెబ్బకు భారతీయుల్లో యాంటీబయాటిక్ మందులు కూడా పనిచేయని స్థితి ఏర్పడిందని ఇటీవల లాన్సెట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాకు చెందిన బోస్టన్ యూనివర్సిటీ, ఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కలిసి మనదేశంలో యాంటీబయాటిక్ మందుల వాడకంపై ఓ సర్వే నిర్వహించాయి. 500 ఫార్మాస్యూటికల్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను విక్రయిస్తున్న 9000 మంది స్టాకిస్టులతో కూడిన ప్యానల్ 2019లో విక్రయించిన యాంటీబయాటిక్స్‌పై అధ్యయనం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవీ సర్వేలో తేలిన వాస్తవాలు
వినియోగించిన మొత్తం యాంటీబయాటిక్స్‌లో 90 శాతం ప్రైవేటు దవాఖానలు, డాక్టర్లు సిఫారసు చేయగా, ప్రభుత్వ దవాఖానల్లో ఇచ్చినవి 10 శాతమే.
2019లో పెద్దలు వాడిన ఔషధాల్లో మొత్తం డిఫైన్డ్ డైలీ డోసేజ్ (డీడీడీ) 5,071 మిలియన్లు. అంటే ప్రతి వెయ్యిమంది పెద్దల్లో రోజూ 10.4 డోసేజీ వాడారన్నమాట.
జాతీయ జాబితాలో చేర్చిన మొత్తం ఫార్ములేషన్స్‌లో అత్యవసర ఔషధాలు (ఎన్‌ఎల్‌ఈఎం) 49 శాతం ఉండగా, ఫిక్స్‌డ్ డోసేజ్ కాంబినేషన్స్ (ఎఫ్‌డీసీ)ల వాటా 34 శాతం ఉన్నది.
జాబితాలోని మొత్తం ఔషధాల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) గుర్తింపు పొందినవి కేవలం 47.1 శాతమే.
సీడీఎస్‌ఈవో గుర్తింపులేని ఔషధాల్లో అత్యధికం సెఫలోస్పొరిన్లు, మ్యాక్రోలైడ్స్, పెన్సిలిన్ కాంబినేషన్స్ ఉన్నాయి.
ఔషధాలను అతిగా వాడుతుండటంతో రానురాను అవి పనిచేయకుండా పోతున్నాయని అధ్యయనంలో తేలింది.
మనదేశంలో ఔషధాల విక్రయం, వినియోగంపై అమెరికా, యూరప్‌లో ఉన్నట్టు ఇప్పటికీ ఒక సరైన నిఘా విధానమే లేదు. దేశంలో యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా వాడుతున్నారు. వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకున్నా ఈ ఔషధాలు తేలికగానే దొరుకుతాయి. గుర్తింపు పొందిన వైద్యులు కూడా రోగులకు వీటినే ఎక్కువగా రాస్తున్నారు .