hathavidhi mamidikalva madhusudhan

హత విధీ! ఇది విష్ణుసహస్ర నామంలా.. పారాయణ చేస్తున్నారా?

బంటూ గానికి ట్వంటీ టూ
బస్తీల మస్తు కటౌటు
వచ్చినమంటే సుట్టూ
కిక్కేచాలక ఓ నైటూ
సిల్కు చీర కట్టుకుని
చిల్డు బీరు మెరిసినట్లు
సుక్క తాగక షెక్కరొచ్చేరో
రాములో రాముల
రాములో రాముల. . .

ఇది అల వైకుంఠపురంలో సినిమా పాట. రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలో ఈ పాట దక్షిణాదిని ఊపేస్తోందట. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు మొదలు- పండుముసలి వరకు ఈ పాటను విష్ణు సహస్రనామంలా అందరూ పారాయణం చేస్తున్నారట. ఏ నోట విన్నా ఇదే పాట అట. ఈ మాట నేనన్నది కాదు. ఈ పాట రాసిన రచయిత 102.8 రేడియోలో 01 -01-2020 మధ్యాహ్నం 12.15 గంటలప్పుడు ఉత్సాహంగా, ఉల్లాసంగా చెప్పగా నేను విన్నవి.

అల వైకుంఠ పురంబులో నగరిలో ఆమూల సౌధంబు లోపల . . . పద్యం పోతన భాగవతంలోనిది అనికూడా ఈ సందర్భంగా లోకానికి తెలియాల్సిన అవసరం ఉంది.

అయ్యా!
గీతరచయిత గారూ!
మేము సగటు భాషాభిమానులం.
సిల్కు సీరగట్టుకుని
చిల్డు బీరు మెరిసినట్లు
సుక్క తాగక షెక్కరొచ్చి పడి ఉన్నాం. వైకుంఠ పురం ఎలా ఉండబోతోందో రాములో రాముల ట్వంటీ టూ కటౌట్లోనే కిక్కెక్కించారు.
పాట సందర్భం దర్శకుడి ఇష్టం.
సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం.
గీత రచన మీ ఇష్టం.

ఇందులో మీరు వాడిన బార్ అండ్ రెస్టారెంట్ భాష, పరిభాషపట్ల మాకెలాంటి అభ్యంతరం లేదు. ఇంతకంటే లిక్కర్ సేల్స్ ప్రమోషన్ పాటలు ఎన్నో విని ఎప్పుడూ చుక్కతాగని మాలాంటివాళ్ళు కూడా తాగకపోతే రౌరవాది నరకాల్లో పడిపోతామేమోనని తాగాలని మనసు మార్చుకుంటున్నాం. కాబట్టి సినిమాల్లో మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం – అని కనీ కనిపించకుండా హెచ్చరిక అక్షరాల సాక్షిగా ఇబ్బడిముబ్బడిగా తాగుడు దృశ్యాలను పెట్టి మద్యాన్ని ప్రోత్సహించండి. అది మీ భావప్రకటన స్వేచ్ఛ. రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు.

సిల్కు సీర కట్టుకుని
చిల్డు బీరు మెరిసినట్లు- నిజానికి గొప్ప ప్రయోగం. సృజనాత్మక పద విన్యాసం. ఈ ఉపమాలంకారాలను, ఈ శబ్ద చమత్కారాలను విశ్లేషించడానికి మాలాంటి సామాన్యులకు భాష చాలదు. మీకు ఇంకా ఉజ్వలమయిన భవిష్యత్తు ఉంది.
ట్వంటీ టూ
కటౌటూ
సుట్టూ
నైటూ లాంటి అంత్యప్రాసలతో మీరు తెలుగు భాషాసరస్వతికి ఇంకా ఎంతో సేవ చేయాల్సి ఉంది. భాషను సుసంపన్నం చేయాల్సి ఉంది.

అయితే మాదొక విన్నపం. విష్ణు సహస్రనామం మహా భారతంలోనిది. అంపశయ్య మీద అంత్యదశలో ఉన్న భీష్ముడు విష్ణువును స్తుతిస్తే వ్యాసుడు రాసిపెట్టాడు. దాని పవిత్రత దానికుంది. దాన్ని పారాయణం చేసేవారు వేరే ఉన్నారు. సిల్కు సీర; చిల్డు బీరులను- విష్ణు సహస్రనామాన్ని ఒకేగాటగట్టి మమ్మల్ను ఇబ్బంది పెట్టద్దు. ఇంతకంటే చెప్పడం సభామర్యాద కాదు. అయినా మీది తప్పుకాదనుకుంటే మా అజ్ఞానాన్ని సిల్కు; చిల్డు పరిభాషలోనే క్షమించగలరు.

-పమిడికాల్వ మధుసూదన్